ఉచితం అడ్రస్సేది? | free dresses are not providing to students | Sakshi
Sakshi News home page

ఉచితం అడ్రస్సేది?

Published Sat, Dec 7 2013 3:52 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM

free dresses are not providing to students

అధికారుల అనుచిత చర్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు  సకాలంలో ఉచిత దుస్తులు అందడంలేదు. కుట్టుపని తమకు కిట్టుబాటు అవుతుందో లేదో చూసుకుని, జేబుల్లోకి వెళ్లే నోట్లను బేరీజువేసుకుని మరీ యూనిఫారాలు కుట్టించే పనిని అధికారులు చేపడుతుండడంతో పిల్లలు పాత, చిరిగిపోయిన దుస్తులతో పాఠశాలకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడుతోంది.  
 
 విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఉచిత యూనిఫాం పంపిణీ జిల్లాలో ప్రహసనంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారులకు, ఎంఈఓలకు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)ల మధ్య సమన్వయం లోపం వల్ల సకాలంలో దుస్తుల పంపిణీ కావడంలేదు. దీంతో జిల్లాకు మంజూరైన నిధులు బ్యాంకులో  మూలుగుతున్నాయి. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాసంవత్సరం  ప్రారంభంలో ఏనాడూ పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. గత ఏడాది ఇవ్వవలసిన దుస్తులను ఈ
 విద్యా సంవత్సరంలో ఆరు నెలలు గడిచిన తరువాత ఇటీవల పంపిణీ చేశారు.   ఇలా ప్రతి ఏడాదీ దుస్తులను ఆలస్యంగా  ఇస్తున్నారు.  దీన్ని సరిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఏడాది (2013-14)కి సరిపడా దుస్తులకు  విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రాజీవ్ విద్యామిషన్ నిధులు విడుదల చేసింది.
 
  గత ఏడాది డైస్ ప్రకారం 1-8వ తరగతుల మధ్య ఉన్న 1,75,927 మంది విద్యార్థుల దుస్తుల కోసం రూ. 7.03 కోట్లు  ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. అక్టోబర్ చివరి నాటికి ఆప్కో నుంచి వస్త్రాన్ని తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు దాని అడ్రెస్స్‌లేదు.   నవంబర్ ఒకటో తేదీ నుంచి దుస్తులు కుట్టడం ప్రారంభించి డిసెంబర్ మొదటి వారంలోపువిద్యార్థులకు సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదు. ఆప్కో సరఫరా చేసే వస్త్రానికి సంబంధించిన తీర్మానాలను ఎస్‌ఎంసీల నుంచి ఎంఈఓల ద్వారా జిల్లా కేంద్రానికి పంపించాల్సి ఉండగా, చాలా మండలాల నుంచి ఇప్పటి వరకు తీర్మానాలు చేరలేదు. చాలా పాఠశాలల్లో ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.  జిల్లాలో సుమారు 90 పాఠశాలల్లో ఇప్పటి వరకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయలేదు.  
 
 ఎస్‌ఎంసీల నుంచి ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత వస్త్రం కొనుగోలు చేస్తామని, ఆ తరువాత దుస్తుల కుట్టించే బాధ్యతను ఎస్‌ఎంసీలే వహిస్తాయని ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఆర్వీఎం రాష్ట్రస్థాయి అధికారులు పెట్టిన గడువు డిసెంబర్ మొదటి వారంతో పూర్తయింది. అయితే ఇంకా 10 మండలాల నుంచి ఎస్‌ఎంసీ తీర్మానాలు రావాల్సి ఉంది. ఎస్‌ఎంసీలను ఎప్పుడు నియమిస్తారో, తీర్మానాలు ఎప్పుడు చేస్తారో, వస్త్రాన్ని ఎప్పుడు కొనుగోలుచేస్తారో, ఎప్పుడు కుట్టిస్తారో,  యూనిఫాంలు ఎప్పుడు పంపిణీ చేస్తారో పైవాడికే తెలియాలి.  
 
 గత ఏడాది పరిస్థితి
 యూనిఫాంలు కుట్టించడంలో గత ఏడాది కూడా తీవ్ర జాప్యం నెలకొంది. కొంతమంది ఎంఈఓలు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు యూనిఫాం కుట్టే పనిని అప్పగించి అరకొరగా సరఫరా చేయడంతోపాటు పంపిణీలో జాప్యం నెలకొంది. తొలుత స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల నుంచి ఆప్కోకి ఇచ్చిన తీర్మానాలను ఎంఈఓలు, జిల్లా అధికారులు తిరస్కరించారు.
 
 రాజకీయ ఒత్తిడితో స్థానిక ప్రైవేటు ఏజెన్సీకి దుస్తుల పంపిణీని అప్పగించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో ద్వారా వస్త్రం తెప్పించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా గత ఏడాది కొంతమంది ఎంఈఓలు స్థానిక దుకాణదారులతో కుమ్మక్కై వారి ద్వారా వస్త్రాన్ని తెప్పించారు.  దీంతో దుస్తుల సరఫరాలో సహజంగానే జాప్యం జరిగింది. వాటిని ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో పంపిణీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement