రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోగల కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్‌లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
టాయిలెట్‌లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్‌లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు. మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్‌లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు.
అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment