
ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే
లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు
పొరుగు దేశానికి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక
సర్వసన్నద్ధంగా ఉండాలని భారత సైనిక దళాలకు పిలుపు
జైపూర్: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఇప్పటిదాకా సాగించిన ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపాలని, లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని తేల్చిచెప్పారు. భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తే పాకిస్తాన్ అనే దేశం ఇకపై చరిత్రలో మాత్రమే మిగిలిపోతుందని స్పష్టంచేశారు. తమను మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభిస్తామని ఉద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపించిన సహనం, సంయమనాన్ని ఈసారి చూపించబోమని పేర్కొన్నారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం రాజస్తాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఆర్మీ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో స్థానాన్ని, భౌగోళిక ఉనికిని కాపాడుకోవాలా? వద్దా? అనేది పాకిస్తాన్ చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే ప్రమాదంలో పడుతుందన్నారు. ఈసారి బలంగా దెబ్బకొడతామని అన్నారు.
త్వరలో మరో అవకాశం రావొచ్చు
ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే దీటుగా తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని భారత సైనిక దళాలకు జనరల్ ఉపేంద్ర ద్వివేది సూచించారు. ‘మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడానికి త్వరలో మరో అవకాశం రావొచ్చు. అందుకే ఇప్పటినుంచే పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉండండి. ఆల్ ద బెస్ట్’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆగలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌పై మరోసారి దాడికి దిగితే ఆపరేషన్ సిందూర్ వెంటనే ప్రారంభమవుతుందని పాకిస్తాన్‌ను ఆయన హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ ఏడాది మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఎయిర్‌బేస్‌లపై నాలుగు రోజులపాటు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చదవండి:
ఆపరేషన్ సిందూర్‌పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్ చీఫ్