నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. | - | Sakshi
Sakshi News home page

నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు..

Published Mon, Dec 25 2023 12:04 AM | Last Updated on Mon, Dec 25 2023 7:43 AM

- - Sakshi

నేరడిగొండ పాఠశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

ఆదిలాబాద్‌: విద్యార్థుల భవితకు బాటలు వేయాల్సిన కొంత మంది గురువులు ఆ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ బాధను భరించలేక కొందరు బయట పెడుతుండగా, మరికొంత మంది మౌనంగా భరించాల్సిన దుస్థితి. జిల్లాలో కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ కీచకులపై నామమాత్రపు చర్యలకే పరిమితం కావడంతో వక్రబుద్ధి ఉన్న మిగతా వారి తీరులో మార్పు కానరాని పరిస్థితి.

సంఘటనలు బయటకు వచ్చినప్పుడు రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలతో బయటపడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి పోయి వారిపై అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యాశాఖకే చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ కీచక గురువు విద్యార్థినులను వేధించడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. గతంలోనూ జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

  • నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు ఇటీవల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి సైతం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, డీఈవోకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
  • జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఈ ఏడాది మార్చిలో ఓ కోచ్‌ విద్యార్థినులను వేధించడంతో ఆ విషయం బయట పడింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి అతడిని విధుల నుంచి తప్పించారు. వెకిలిచేష్టలకు పాల్పడినట్లు తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.
  • మావల మండలం వాఘాపూర్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడిని అక్కడి నుంచి మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఆ పాఠశాలలో సైతం ఆయన తీరు మారలేదు. విద్యార్థినులు ఆందో ళన చేపట్టినప్పటికీ విషయం బయట పొక్క కుండా విద్యాశాఖాధికారులు కప్పిపుచ్చారు.
  • తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను విద్యార్థినులకు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆయనను పాఠశాలలో బంధించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఈవో అతడిని మరో పాఠశాలకు పంపించారు.
  • ఉట్నూర్‌ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు. అలాగే అతడిపై పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదైంది.

వక్రబుద్ధితో..
విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులు కొంత మంది వక్రబుద్ధితో వారి ని వేధిస్తున్నారు. ముఖ్యంగా ఈఘటనలు ఉన్న త పాఠశాలల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో సాధికారత క్లబ్‌లు ఏర్పా టు చేసినప్పటికీ అవి నామామత్రంగానే మిగిలాయి. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే ఉపాధ్యాయులకు తోటి టీచర్లు మద్దతు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాఠాలు బోధించే సమయంలో బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, వెకిలిచేష్టలకు దిగడంతో వారు చదువుపై ఆసక్తి చూపలేకపోతున్నారు. విషయాన్ని తల్లిండ్రులకు చెప్పలేక మదనపడుతున్నారు. ఒకవేళ విషయాన్ని బయట పెడితే తమ చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని వా రు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎవరి కై నా చెబితే సంగతి చూస్తామని ఈ గురువులే విద్యార్థినులను హెచ్చరిస్తు న్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

టీచర్ల మధ్య గొడవలు..
జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగుచూస్తుండగా, మరెన్నో బహిర్గతం కావడం లేదన్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని పాఠశాలల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని చెప్పిస్తున్నట్లు కూడా చర్చ సాగుతోంది.

వీరి మధ్య గొడవలు విద్యార్థుల భవితపై ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు నిరసనకు దిగడంతో విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. దీంతో అక్కడ పాఠాలు బోధించే టీచర్ల కొరత ఏర్పడుతోంది. గొడవల కారణంగా ఉపాధ్యాయుల పరువు పోవడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.

కొరవడిన పర్యవేక్షణ..
విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పా టు తోటి మహిళ ఉపాధ్యాయులను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.

జిల్లాలో ఒక్క రెగ్యులర్‌ ఎంఈఓ లేకపోవడం, అలాగు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఇన్‌చార్జి కావడంతో కొంత మంది ఉపాధ్యాయులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏవైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. తప్పు చేసిన వారికి కనీసం మెమోలు కూడా ఇవ్వకుండా మెతక వైఖరి వ్యవహరించడంతో తమను ఎవరేమి చేయలేదనే ధీమాతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.

గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి
ఉపాధ్యాయులు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు ఉపాధ్యాయులు వారి భవితకు బాటలు వేయాలి. విద్యార్థినులను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. కొంత మంది తీరు వల్ల విద్యా శాఖకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ప్రణిత, డీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement