పురిటి కష్టాలు.. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

పురిటి కష్టాలు.. గత నెలలో ఇద్దరు బాలింతలు మృత్యువాత

Published Mon, Aug 7 2023 1:36 AM | Last Updated on Mon, Aug 7 2023 7:01 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: గర్భిణులకు రిమ్స్‌లో పురిటి కష్టాలు తప్పడం లేదు. నవమాసాలు మోసి ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్న వారిలో ఇటీవల పలువురు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వెద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రూ.కోట్లాది నిధులతో సర్కారు ఆసుపత్రి నిర్మించినా పేదల కష్టాలు మాత్రం దూరం కావడం లేదు.

మెటర్నిటీ వార్డులో పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కాన్పుకు రూ.వేలాది చెల్లించుకోలేని పేదలు రిమ్స్‌లో చేరితే వైద్యం అందక అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే ఇద్దరు బాలింతలు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తుంది. గైనిక్‌ వార్డులో పర్యవేక్షణ కరువవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

వార్డును పర్యవేక్షించాల్సిన అధికారి చుట్టపు చూపుగా రావడం, వచ్చినా పట్టించుకోకపోవడం, బాలింతలకు సరైన వైద్య సేవలు అందించకపోవడమే కష్టాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి లేకపోతే రిమ్స్‌కు పీజీ సీట్లు రావనే ఆలోచనతో ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఆ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా గైనిక్‌వార్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు లేకపోలేదు.

ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే..
జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రిమ్స్‌లో పలు వార్డులు ఉండగా, అందులో మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డులే కీలకం. ప్రసవం కోసం ఇన్‌పెషేంట్స్‌ దాదాపు 200కు పైగా ఉంటారు. అయితే ఈ కీలక వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి.

గైనిక్‌ వార్డులో హెచ్‌వోడీతో పాటు మరో ఏడుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు రిమ్స్‌లో నలుగురు పీజీ చేస్తున్న గైనిక్‌ వైద్యులున్నారు. అలాగే షిఫ్టుల వారీగా ముగ్గురు చొప్పున హౌస్‌ సర్జన్లు ఈ వార్డులో ఉంటారు. ఓపీలో ఇద్దరు, ఆపరేషన్‌ థియేటర్‌లో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మిగతా వైద్యులు గైనిక్‌ వార్డులో ఉండాలి.

కానీ వారు చుట్టపుచూపులా కనిపిస్తుండడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం అయిన తర్వాత రక్తస్రావం, బీపీ, తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవేమి పట్టించుకోకుండా మధ్యాహ్నానికే ఇంటి ముఖం పడతారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచినా వారు విసుక్కోవడం, వస్తాం.. వెళ్లండనే సమాధానాలు తప్పా వచ్చి చూసిన దాఖలాలు ఉండవని బాధితులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా రిమ్స్‌లో స్టాఫ్‌నర్సులు, హౌస్‌సర్జన్లు, పీజీ డక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల పాటు మెటర్నిటీ వార్డులో ఉండాల్సిన వైద్యులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే తప్ప రాత్రి వేళల్లో రావడం లేదు. దీంతో గతంలో ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్యం అందక పురిటి నొప్పుల్లోనే మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

మారని రిమ్స్‌ తీరు..
ఎన్ని విమర్శలొస్తున్నా ఇక్కడి వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ పనిచేసే చాలా మంది వైద్యులకు ప్రైవేట్‌ క్లినిక్‌లు ఉండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో ఉన్న వారికి నాణ్యమైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి.

కాసులిస్తేనే.. సేవలు
గైనిక్‌ వార్డులో కొంతమంది సిబ్బంది తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్‌, సాధారణ ప్రసవమైన తర్వాత సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడబిడ్డ పుడితే రూ.500.. ఇలా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడకు చెందిన సొనాలి కాంబ్లే(22) రిమ్స్‌లో జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చిన ఐదారు గంటల్లోనే మృతి చెందింది. డెలివరీ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్పత్రిలో చేరిన ఆమె సాధారణ ప్రసవం అయ్యింది. ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనివ్వగా, 10 గంటల సమయంలో చనిపోయింది. అయితే వైద్యులు మాత్రం ఉమ్మ నీరు ఊపిరితిత్తులో చేరి శ్వాస ఆడక చనిపోయిందని చెప్పడం గమనార్హం.

గత నెలలో సిరికొండ మండలానికి చెందిన ఓ గర్భిణి రిమ్స్‌లో ప్రసవం కోసం చేరింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యం (కాలేయ సమస్య) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా, తీరా చనిపోయిన తర్వాత అనారోగ్య సమస్య అని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం.

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..
ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. గైనిక్‌ వార్డులో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. – జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement