Patient Care
-
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
పురిటి కష్టాలు.. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే..
ఆదిలాబాద్: గర్భిణులకు రిమ్స్‌లో పురిటి కష్టాలు తప్పడం లేదు. నవమాసాలు మోసి ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్న వారిలో ఇటీవల పలువురు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వెద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రూ.కోట్లాది నిధులతో సర్కారు ఆసుపత్రి నిర్మించినా పేదల కష్టాలు మాత్రం దూరం కావడం లేదు. మెటర్నిటీ వార్డులో పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుకు రూ.వేలాది చెల్లించుకోలేని పేదలు రిమ్స్‌లో చేరితే వైద్యం అందక అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే ఇద్దరు బాలింతలు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తుంది. గైనిక్ వార్డులో పర్యవేక్షణ కరువవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వార్డును పర్యవేక్షించాల్సిన అధికారి చుట్టపు చూపుగా రావడం, వచ్చినా పట్టించుకోకపోవడం, బాలింతలకు సరైన వైద్య సేవలు అందించకపోవడమే కష్టాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి లేకపోతే రిమ్స్‌కు పీజీ సీట్లు రావనే ఆలోచనతో ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఆ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా గైనిక్‌వార్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే.. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రిమ్స్‌లో పలు వార్డులు ఉండగా, అందులో మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డులే కీలకం. ప్రసవం కోసం ఇన్పెషేంట్స్ దాదాపు 200కు పైగా ఉంటారు. అయితే ఈ కీలక వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. గైనిక్ వార్డులో హెచ్‌వోడీతో పాటు మరో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు రిమ్స్‌లో నలుగురు పీజీ చేస్తున్న గైనిక్ వైద్యులున్నారు. అలాగే షిఫ్టుల వారీగా ముగ్గురు చొప్పున హౌస్ సర్జన్లు ఈ వార్డులో ఉంటారు. ఓపీలో ఇద్దరు, ఆపరేషన్ థియేటర్లో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మిగతా వైద్యులు గైనిక్ వార్డులో ఉండాలి. కానీ వారు చుట్టపుచూపులా కనిపిస్తుండడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం అయిన తర్వాత రక్తస్రావం, బీపీ, తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవేమి పట్టించుకోకుండా మధ్యాహ్నానికే ఇంటి ముఖం పడతారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచినా వారు విసుక్కోవడం, వస్తాం.. వెళ్లండనే సమాధానాలు తప్పా వచ్చి చూసిన దాఖలాలు ఉండవని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రిమ్స్‌లో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్లు, పీజీ డక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల పాటు మెటర్నిటీ వార్డులో ఉండాల్సిన వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తప్ప రాత్రి వేళల్లో రావడం లేదు. దీంతో గతంలో ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్యం అందక పురిటి నొప్పుల్లోనే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మారని రిమ్స్ తీరు.. ఎన్ని విమర్శలొస్తున్నా ఇక్కడి వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ పనిచేసే చాలా మంది వైద్యులకు ప్రైవేట్ క్లినిక్‌లు ఉండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో ఉన్న వారికి నాణ్యమైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. కాసులిస్తేనే.. సేవలు గైనిక్ వార్డులో కొంతమంది సిబ్బంది తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్, సాధారణ ప్రసవమైన తర్వాత సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడబిడ్డ పుడితే రూ.500.. ఇలా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడకు చెందిన సొనాలి కాంబ్లే(22) రిమ్స్‌లో జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చిన ఐదారు గంటల్లోనే మృతి చెందింది. డెలివరీ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్పత్రిలో చేరిన ఆమె సాధారణ ప్రసవం అయ్యింది. ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనివ్వగా, 10 గంటల సమయంలో చనిపోయింది. అయితే వైద్యులు మాత్రం ఉమ్మ నీరు ఊపిరితిత్తులో చేరి శ్వాస ఆడక చనిపోయిందని చెప్పడం గమనార్హం. గత నెలలో సిరికొండ మండలానికి చెందిన ఓ గర్భిణి రిమ్స్‌లో ప్రసవం కోసం చేరింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యం (కాలేయ సమస్య) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా, తీరా చనిపోయిన తర్వాత అనారోగ్య సమస్య అని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. గైనిక్ వార్డులో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
నిజామాబాద్ ఆసుపత్రిలో దారుణం.. హరీష్ రావు సీరియస్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగిని స్ట్రెచర్‌లో వార్డుకు తరలించేందుకు సిబ్బంది ఎవరూ లేక పోవడంతో బంధువులే కాళ్లు పట్టుకుని ఈడ్చుకు వెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణకు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నప్పటికీ రోగులకు స్ట్రెచర్లు, వీల్చైర్లు అందుబాటులో ఉంచకపోవడంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సైతం ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా సీరియస్ అయ్యారు. స్ట్రెచర్ లేకుండా రోగిని బంధువులే కాళ్లు పట్టు కుని లిఫ్ట్ వరకు ఈడ్చుకెళ్లిన వీడియో ఫుటేజీని పరిశీలించా రు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్ ప్రతిమారాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్చైర్ల కొరత లేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 10 సెకండ్ల పాటు వీడియో తీసి 15 రోజుల తర్వాత వైరల్ చేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు తెలియదన్నారు. ఈనెల 1న ఆస్పత్రికి వచి్చన రోగి బోధన్ మండలం అచన్పల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. సూపరింటెండెంట్ తన తప్పును సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు దేగాం యదాగౌడ్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. మారని తీరు.. కాగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై ఎన్ని ఆరోపణలు వచి్చనా సిబ్బంది తీరు మారడం లేదు. స్ట్రెచర్, వీల్ చైర్లపై రోగులను తరలించాల్సి ఉండగా వాటర్ బాటిళ్లు, వాటర్ క్యాన్లు, బెడ్ షీట్లు తరలిస్తున్న దృశ్యం శనివారం ఆస్పత్రికి వెళ్లిన ‘సాక్షి’ కి కనిపించింది. రోగులను వార్డులోని డాక్టర్ల వద్దకు తుప్పు పట్టిన వీల్ చైర్లపై బంధువులే తోసుకుంటూ వెళ్తున్న దృశ్యం కంటపడింది. -
ఆ మాష్టారు కిడ్నీలో 156 రాళ్లు!
బంజారాహిల్స్: దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి యూరాలజిస్ట్, ఎండీ డాక్టర్ వి.చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని హుబ్లికి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బసవరాజు కడుపు నొప్పి రావడంతో పరీక్షలు నిర్వహించడంతో కిడ్నీల్లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు బదులుగా కడుపు దగ్గరలో ఉందని దీన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారని డాక్టర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. ఇలాంటి చోట కిడ్నీలోని రాళ్లను తీయడం చాలా పెద్ద ప్రయత్నమేనని అయితే శరీరంపై పెద్ద కోతకు బదులు కేవలం కీహోల్ మాత్రమే చేసి తీసేశామని ఆయన వివరించారు. ఈ రోగికి రెండేళ్లకు ముందే రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుందని అయితే ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఉన్నట్టుండి నొప్పి రావడంతో పరీక్షలు చేయిచుకున్నారని అన్నారు. -
స్ఫూర్తిగా నిలుస్తున్న వైద్య సిబ్బంది
గచ్చిబౌలి (హైదరాబాద్): కరోనా పాజిటివ్ పేషెంట్లకు నిర్విరామంగా చికిత్స అందిస్తూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్ఫూర్తి నింపుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రికి అవసరమైనంత మంది డాక్టర్లను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను మంత్రి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉం టుందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులలో లేని సదుపాయాలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్నాయని, విశాలమైన గదులలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజక్షన్లు లేవని ప్రైవేట్ ఆస్పత్రులు చేతులు ఎత్తివేస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులలో చేరిన వారికి అత్యాధునిక, ఖరీదైన వైద్యం అందిస్తున్నామని, బాధితులు ఇక్కడే చికిత్స చేయించుకోవాలన్నారు. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు. చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి మాట్లాడి వారిలో భరోసా నింపారు. చికిత్స, భోజనం ఎలా ఉందని ఆరా తీశారు. సదుపాయాలపై పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారని తెలి పారు. అనంతరం అక్సిజన్ కొరత లేకుండా చూడా లని టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్‌ను ఆదేశించారు. టిమ్స్‌లో 1,035 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా చికిత్సకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని చెప్పారు. రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేస్తున్నట్లు ప్రైవైట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో విచారణకు కమిటీ ఏర్పాటు చేశామ న్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
మిరాకిల్: 15 క్యాన్ల బీరు తాగించి బతికించారు
ముల్లును ముల్లు తోనే తీయాలి అనే సామెత మనం వింటూ ఉంటాం. అలాంటి సామెతే ఒక వ్యక్తి వ్యవహారంలో జరిగింది. కేన్ల కొద్ది బీర్లను లాగించేసే అతడి శరీరంలో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. దీంతో ఏమి చేయాలో అర్ధం కానీ వైద్యులు ఇలా ముల్లును ముల్లు తోనే తీయాలి అన్నట్లుగా అతడి శరీరంలోకి 15 కేన్ల బీరును ఆ మందుబాబు పొట్టలోకి పంప్ చేశారు. వివరాల్లోకెళ్తే.. వియత్నాంలోని క్వాంగ్త్రికి చెందిన గువన్ వాన్ నహత్ అనే వ్యక్తి ఫుల్లుగా బీర్లు వేయడంతో ఒంట్లో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నది. చదవండి: సోషల్ మీడియా స్టార్స్ దీంతో డాక్టర్లు అతడిని బతికించడానికి చివరి ఉపాయంగా ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకున్నారు. 15 కేన్ల బీరును నహత్ పొట్టలోకి పంప్ చేశారు. బీరుతో విషతుల్యమైన కడుపులోని విషాన్ని బీరుతోనే తీసేయాలన్నది వారి ప్లాన్. కానీ ఇది చాలా ప్రమాదకరం. అయితే రోగిని కాపడడానికి మరో మార్గం లేక దాన్నే ఎంచుకున్నారు. బీరులో మిథనాల్‌తోపాటు ఇథనాల్ కూడా ఉంటుంది. మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పాడే యాసిడ్‌ను ఇథనాల్ నియంత్రిస్తుంది. డాక్టర్లు దానిపై నమ్మకం పెట్టుకుని పంప్ చేశారు. మంత్రం ఫలించింది. నహత్ బతికి బయటపడ్డారు. చదవండి: సరదాగా చదరంగంలోకి వచ్చా..! -
‘కేర్ లెస్’ ప్రొవైడర్స్
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే నిరుపేద రోగుల్లో చాలా మంది నిరక్ష రాశ్యులు కావడంతో ఆస్పత్రిలో ఏ డాక్టర్ ఎక్కడ ఉంటాడో? ఏ వార్డు ఎక్కడ ఉంటుందో? ఏ పరీక్ష ఎక్కడ చేస్తారో? వారికి తెలియదు. వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆస్పత్రుల వారీగా పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ఈ సేవలు ప్రస్తుతం ‘కేర్ లెస్’గా మారాయి. ఆస్పత్రుల్లో ప్రభుత్వం కే టాయించినంత మంది లేక పోగా..ఉన్నవారు కూడా రోగులకు బదులు వైద్యాధికారుల వ్యక్తిగత సేవలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో ఈ సేవలు ఉన్నా..లేనట్లుగానే తయారైంది. ఎప్పటికప్పుడు సేవలపై ఆరా తీసి, మెరుగుపర్చాల్సిన ఉన్నతాధికారులు ఇవేవీ పట్టించుకోడం లేదు. ఫలితంగా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విధుల్లో లేకపోయినా..పక్కగా బిల్లులు... ప్రభుత్వ ఆస్పత్రుల్లో వార్డుబోయ్స్ ఖాళీలు భారీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రోగులకు కనీస సేవలు అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక ప్రతిపాదికన రెండేళ్ల క్రితం పేషంట్ కేర్ ప్రొవైడర్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఉస్మానియాలో 217 మంది, నిలోఫర్‌లో 90 మంది, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో 28 మంది, గాంధీలో 7, ఉస్మానియా వైద్య కాలేజీలో 83 మంది, సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 56 మంది, ఫీవర్ ఆస్పత్రి లో 20 మందిని ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పేషంట్ కేర్ ప్రొవైడర్స్‌గా నియమించింది. వీరిలో సగం మంది ఆస్పత్రికే రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విధులకు వచ్చిన వారు కూడా అసలు డ్యూటీకి బదులే వేరే పనులు చేస్తూ పేషెంట్ కేర్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. నీలోఫర్ ఆస్పత్రిలో 90 మంది ఉండగా, ఒక్కో షిప్ట్‌లో 30 మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో పని చేయాల్సి ఉండగా, వీరిలో సగం మంది కూడా కన్పించడం లేదు. అయితే సదరు కాంట్రాక్టర్ మాత్రం వంద శాతం హాజరు చూపుతుండటం, ఆ మేరకు బిల్లులు జారీ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఎంఓలు ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అసలు లక్ష్యం ఇదీ! వార్డు బాయ్స్ స్థానంలో పేషెంట్ కేర్ ప్రొవైడర్స్‌ను నియమించింది. ఆస్పత్రికి వచ్చిన రోగికి వీరు అండగా ఉండాల్సి ఉంటుంది. ఏ వార్డు ఎక్కడుందో చెప్పడంతో పాటు ఏ జబ్బుతో బాధపడుతున్న వారు ఏ వైద్యుడి వద్దకు వెళ్లాలో సూచించాలి. ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ తదితర పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ ల్యాబ్ వద్దకు తీసుకెళ్లడం, సేకరించిన రక్తపు నమూనాలను ల్యాబ్‌కు పంపించాలి. ఆస్పత్రిలో అడ్మిటైన ఇన్పేషంట్కు సహాయకుడిగానూ పని చేయాలి. వీల్ చైర్‌పై లేదా స్ట్రెచర్‌పై ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం మొదలు.... పడకలపై ఉన్న దుప్పట్లను ఎప్పటికప్పుడు మార్చడం.... ఒక వేళ వార్డులోని రోగు ల్లో ఎవరైనా మల, మూత్ర విసర్జన కోసం వెళ్లాలని భావిస్తే..వారిని టాయ్‌లెట్‌కు తీసుకెళ్లడం వరకు ఇలాంటి అన్ని పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరెవరూ ఆ పనులు చేయక పోవడంతో రోగుల బంధువులే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో ఆరోగ్య దూతలు పేషెంట్ కేర్ సర్వీసు ప్రొవైడర్స్ లేక ఇబ్బంది పడుతున్న ఇన్ పేషెంట్లకు సేవలను అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా(ఎంఇపీఎంఏ)కింద హోమ్ కేర్, బెడ్‌సైడ్ కేర్‌లో శిక్షణ పొందిన ఆరోగ్య దూతలను నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియమించింది. ఇందులో భాగంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 14 మంది, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో ఇద్దరు, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నలుగురిని నియమించింది. ప్రమాదవశాత్తూ రోడ్డు, అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులు, వృద్ధులతో పాటు అల్సర్, కేన్సర్ తదితర దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న నిరుపేదలకు వీరు సేవలు అందిస్తారు. రోగులకు ఆహారం అందించడం మొదలు...పడకలను సిద్ధం చేయడం, ఉదయం నిద్ర లేవగానే బ్రస్ చేయించి, ముఖం కడగడం, చేతి, కాలి వేళ్లకు ఉన్న గోళ్లను కత్తిరించడం, తల, జుట్టు సంరక్షణ, స్నానం చేయిం చడం, ఎప్పటికప్పుడు గాయాలను శుభ్రం చేయడం, డ్రెస్సులు, డైపర్లు మార్చడం వరకు... ఇలా అన్ని పనుల్లోనూ రోగులకు సహాయంగా ఉంటారు. -
రోగులను చూసేది రెండు నిమిషాలే..
లండన్: భారత్‌లో రోగులను పరీక్షించేందుకు సగటున రెండు నిమిషాల సమయాన్ని మాత్రమే వైద్యులు వెచ్చిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్వీడన్లో 22.5 నిమిషాలు, అత్యల్పంగా బంగ్లాదేశ్‌లో 48 సెకన్ల సమయాన్ని రోగులను పరీక్షించేందుకు వైద్యులు కేటాయిస్తున్నారని స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లోని 28.5 మిలియన్ల కన్సెల్టేషన్స్‌పై నిర్వహించిన సర్వేలలోని సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ మేరకు అంచనాకు వచ్చారు. అధ్యయన వివరాలు బ్రిటీష్ మెడికల్ జర్నల్ బీఎమ్‌జేలో ప్రచురితమయ్యాయి. 2015లో భారత్‌లో రోగులను కేవలం రెండు నిమిషాలు మాత్రమే వైద్యులు పరీక్షించేవారని, అదే పాకిస్తాన్లో 1.79నిమిషాలు మాత్రమే కేటాయిస్తారని పేర్కొంది. -
పేరుకే ఇరవైనాలుగు గంటల ఆస్పత్రి
♦ నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్య ♦ విధులు నిర్వహిస్తున్న ఒకే వైద్యాధికారి ♦ అవస్థలు పడుతున్న రోగులు కెరమెరి: కెరమెరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో రోగులకు వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేసే వారు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం ఆపై వ్యాధుల కాలం.. మండలంలోని 64 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు.ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఇద్దరున్నా పరిపోని వైనం.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వైద్యుడు సేవలు అందిస్తున్నాడు. ఆయన ఏదైన అత్యవసరమై బయటికి వెళ్తే రోగుల పరిస్థితి దేవుడెరుగు. వైద్యులు లేక పోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెండేళ్లేగా ఉన్నతీకరించి 24 గంటల ఆస్పత్రిగా మార్చారు. వాస్తవానికి నలుగురు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఎపిడమిక్ పీరియడ్ మండలాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతీ వారం జిల్లా కేంద్రంలో ఒకటి రెండు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉన్న ఒక్క వైద్యుడు వెళ్లి పోతే రోగుల పరిస్థితి ఏంటని ఒక సారి అధికారులు గమనించాలని స్థానికులు కోరుతున్నారు. భారమంతా స్టాఫ్ నర్స్లపైనే.. మండలంలో 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. అందులో 10 మంది ఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. అందులో ముగ్గురు రెగ్యూలర్ కాగా.. ఏడుగురు 2వ ఏఎన్ఎంలు ఉన్నారు. ఇద్దరు సూపర్వైజర్లు ఉండగా ఒకే ఒక్కడుగా హెల్త్ అసిస్టేంట్ ఉన్నాడు. పీహెచ్సీలో నలుగురు స్టాప్ నర్సులు ఉండాల్సి ఉండగా ముగ్గురే విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వైద్యాధికారి లేక పోయినా, ఫార్మసిస్ట్, ఎల్టీ లేకపోయినా స్టాప్ నర్సులపైనే భారం పడుతుంది. ఇటు డేలివరీలు చేయడం, రోగులకు వైద్య పరీక్షలు చేయడం, మాత్రలు ఇవ్వడం లాంటి వన్ని వారు చేయక తప్పడం లేదు. మే నెలలో 39 డెలివరీలు ఆస్పత్రిలో జరగ్గా.. ఈ నెల 29 వరకు 33 ప్రసూతిలు జరిగాయి. ఈ విషయమై జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండలవాసులు ఆరోపిస్తున్నారు. సరే..! ఆలోచిస్తాం.. ఉన్న వైద్యున్ని ఇతర చోటికి పంపించడంతో ఇబ్బంది కలగక తప్పదు. ప్రత్యాన్మాయ చర్యల గురించి ఆలోచిస్తాం. వైద్యులు కూడా ఎక్కడ అధికంగా లేరు. వైద్యాధికారితో మాట్లాడి సమస్య పరిష్కరమయ్యే దిశగా చర్యలు తీసుకుంటాం. – సుబ్బారాయుడు, జిల్లా వైద్యాధికారి.