పేరుకే ఇరవైనాలుగు గంటల ఆస్పత్రి
♦ నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్య
♦ విధులు నిర్వహిస్తున్న ఒకే వైద్యాధికారి
♦ అవస్థలు పడుతున్న రోగులు
కెరమెరి: కెరమెరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో రోగులకు వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేసే వారు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం ఆపై వ్యాధుల కాలం.. మండలంలోని 64 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు.ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఇద్దరున్నా పరిపోని వైనం.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వైద్యుడు సేవలు అందిస్తున్నాడు. ఆయన ఏదైన అత్యవసరమై బయటికి వెళ్తే రోగుల పరిస్థితి దేవుడెరుగు. వైద్యులు లేక పోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెండేళ్లేగా ఉన్నతీకరించి 24 గంటల ఆస్పత్రిగా మార్చారు. వాస్తవానికి నలుగురు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఎపిడమిక్ పీరియడ్ మండలాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతీ వారం జిల్లా కేంద్రంలో ఒకటి రెండు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉన్న ఒక్క వైద్యుడు వెళ్లి పోతే రోగుల పరిస్థితి ఏంటని ఒక సారి అధికారులు గమనించాలని స్థానికులు కోరుతున్నారు.
భారమంతా స్టాఫ్ నర్స్‌లపైనే..
మండలంలో 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. అందులో 10 మంది ఎన్‌ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. అందులో ముగ్గురు రెగ్యూలర్ కాగా.. ఏడుగురు 2వ ఏఎన్‌ఎంలు ఉన్నారు. ఇద్దరు సూపర్‌వైజర్లు ఉండగా ఒకే ఒక్కడుగా హెల్త్ అసిస్టేంట్ ఉన్నాడు. పీహెచ్‌సీలో నలుగురు స్టాప్ నర్సులు ఉండాల్సి ఉండగా ముగ్గురే విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వైద్యాధికారి లేక పోయినా, ఫార్మసిస్ట్, ఎల్‌టీ లేకపోయినా స్టాప్ నర్సులపైనే భారం పడుతుంది. ఇటు డేలివరీలు చేయడం, రోగులకు వైద్య పరీక్షలు చేయడం, మాత్రలు ఇవ్వడం లాంటి వన్ని వారు చేయక తప్పడం లేదు. మే నెలలో 39 డెలివరీలు ఆస్పత్రిలో జరగ్గా.. ఈ నెల 29 వరకు 33 ప్రసూతిలు జరిగాయి. ఈ విషయమై జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండలవాసులు ఆరోపిస్తున్నారు.
సరే..! ఆలోచిస్తాం..
ఉన్న వైద్యున్ని ఇతర చోటికి పంపించడంతో ఇబ్బంది కలగక తప్పదు. ప్రత్యాన్మాయ చర్యల గురించి ఆలోచిస్తాం. వైద్యులు కూడా ఎక్కడ అధికంగా లేరు. వైద్యాధికారితో మాట్లాడి సమస్య పరిష్కరమయ్యే దిశగా చర్యలు తీసుకుంటాం.
– సుబ్బారాయుడు, జిల్లా వైద్యాధికారి.