Telangana News: రిమ్స్‌ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!
Sakshi News home page

రిమ్స్‌ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!

Published Wed, Sep 6 2023 12:50 AM | Last Updated on Wed, Sep 6 2023 8:49 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్‌ కదలనివ్వడం లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా రిమ్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్‌ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్‌, అవుట్‌సో ర్సింగ్‌, రెగ్యులర్‌ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్‌ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

స్టాఫ్‌నర్సుల నుంచి వసూళ్లు..
రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్‌ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్‌ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు.

మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్‌)లో ఏకంగా ఓ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్‌ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌పై రాసుకొని గ్రూప్‌లో వేశారు. ఇంక్రిమెంట్‌ కాకపోతే పీఆర్సీ, ఐఆర్‌లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డిలీట్‌ చేశారు.

అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్‌పై పెట్టిన ఫొటోలు, గ్రూప్‌ చాటింగ్‌ మెస్సేజ్‌లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్‌ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్‌ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.

సర్వీసు బుక్‌లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్‌మెంట్‌ అయిన స్టాఫ్‌ నర్సుల నుంచి రిమ్స్‌లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్‌ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. రిమ్స్‌లో స్టాఫ్‌ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్‌డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.

తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్‌లో పనిచేసే ఓ ల్యాబ్‌ అసిస్టెంట్‌ నుంచి మరో ల్యాబ్‌ అసిస్టెంట్‌ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం.

నా దృష్టికి రాలేదు..
రిమ్స్‌లో స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్‌ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement