తరగతి గదులు విడిచి పాఠశాల ఆవరణలో నిరసన
ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నాడని నేరడిగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం తరగతి గదులను విడిచి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సీనియర్ ఉపాధ్యాయుడినంటూ పదో తరగతి పరీక్షలు నా చేతిలోనే ఉంటాయని విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వారు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పాడు.
దీంతో వారు అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం సైతం సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మను వివరణ కోరగా ఈ విషయాలు తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎంఈఓ భూమారెడ్డిని వివరణ కోరగా రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు
Comments
Please login to add a commentAdd a comment