నిర్మల్ ప్రయాణప్రాంగణంలో మహిళల రద్దీ
ఆదిలాబాద్: 'రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైనా నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర రూట్లతో పాటు ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అధికంగా పెరిగింది. ప్రయాణ ప్రాంగణాల్లో పురుషుల కంటే మహిళ ప్రయాణికులే ఎక్కువగా ఉండడంతో దీనిని అదునుగా తీసుకున్న చిల్లర దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు, ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహిళలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.'
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల వద్ద మహిళల రద్దీ..
ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు అధికంగా వస్తున్నారు. పల్లె వెలుగులతో పోల్చితే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా స్టాపులు ఉండడంతో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఎక్కడానికి మొగ్గు చూపుతున్నారు. తక్కువ దూరం ప్రయాణించేవారు మండల కేంద్రాలకు, పల్లెలకు ప్రయాణించేవారు మాత్రం పల్లె వెలుగు బస్సులు ఆశ్రయిస్తున్నారు.
ఇక ప్రధాన పట్టణాలకు వెళ్లేవారు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంల వద్ద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వద్ద మహిళా ప్రయాణికులు ఉండడంతో చిల్లర దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి దొంగతనాలు గతంలో నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇటువంటి రద్దీ సమయంలో ప్రయాణించే మహిళలు విలువైన నగలు ధరించకూడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. తమ హ్యాండ్ బ్యాగులో సైతం విలువైన వస్తువులు, ఖరీదైన మొబైల్ ఫోన్‌లను వెంట తీసుకెళ్లకపోవడమే ఉత్తమమని అంటున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది కూడా నిఘా పెంచడంతోపాటు ఎప్పటికప్పుడు మైకు ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. దీనితోపాటు సీసీ కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేశారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చోరీ ఘటనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పరిచయం లేని వ్యక్తులు అందించే వాటర్ బాటిల్ నీరు, తినుబండరాలు వంటివి వాటికి దూరంగా ఉండటమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బస్టాండ్ ప్రాంతాల్లో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే ఆర్టీసీ భద్రత సిబ్బందికి లేదా పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.
గతంలో కొన్ని ఘటనలు ఇలా..
గతంలో తరచుగా హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్లు, నగలు, డబ్బులు పోయినట్లు ప్రయాణికుల నుంఛి ఫిర్యాదులు అందాయి. కొందరు చిల్లర దొంగలు బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలు చేయడమే పనిగా పెట్టుకొని మాకం వేస్తారు. అందులో కొన్ని ఘటనలు ఇలా..
• గత నెలలో బస్సు ఎక్కుతున్న మహిళ చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కొని పరిగెడుతుండగా అక్కడే ఉన్న ఆర్టీసీ భద్రత సిబ్బంది ఆ దొంగను పట్టుకొని మొబైల్ ఫోన్ సంబంధిత మహిళకు ఇచ్చి దొంగను పోలీసులకు అప్పగించారు.
• పనిమీద జిల్లా కేంద్రానికి వచ్చినా ఓ వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు నగలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఇలా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.
భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నాం!
మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో కంటే ప్రస్తుతం మహిళల రద్దీ పెరిగిన మాట వాస్తవమే. రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, పోలీసుల సాకారం కూడా తీసుకుంటున్నాం. అదనపు సెక్యూరిటీని కూడా బస్టాండ్‌లో విధులు నిర్వహించేలా చూస్తున్నాం. మహిళా హోంగార్డులు, పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నాం. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. – ప్రతిమారెడ్డి, ఆర్టీసీ డీఎం, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment