ఒంగోలు, న్యూస్‌లైన్: అవును నిజమే! బాల్యం మగ్గుతోంది. కార్ఖానాలు, కర్మాగారాలు, హోటళ్లు.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడ చూసినా బాలకార్మికులే. బడి బాట పట్టాల్సిన బాలలు బతుకు బాట పడుతున్నారు. మండే ఎండలో వయసుకు మించిన భారం మోస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నారని ఫిర్యాదు వస్తే చైల్డ్‌లైన్ వంటి సంస్థలకు సమాచారం ఇచ్చి చేతులు దులుపేసుకుంటోంది. విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్, కార్మికశాఖలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా ఏటా కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
జూన్‌తో సరి
జూన్ రావడం ఆలస్యం. పంతుళ్లే ప్రత్యేక షెడ్యూల్ వేసుకుని మరీ బాల కార్మికులను గుర్తించి వారిని బడిబాట పట్టించే పనిలో నిమగ్నమవడం ఏటా చూస్తున్నాం. ఈ హడావుడంతా రెండు నెలలే. ఆ తర్వాత అడ్మిషన్లు పూర్తి చేసి బాల కార్మికుల వైపు కన్నెత్తి చూడరు. జిల్లా కేంద్రం ఒంగోలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం గమనార్హం. నగరంలోని ఇందిరమ్మ కాలనీల్లో దాదాపు 40 మంది బడి ఈడు పిల్లలు బతుకు బాట పట్టారు. వారంతా గోతాలు తీసుకొని చెత్త ఏరుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజూ సంచరిస్తుంటారు. ఇక పోతురాజు కాలువ సమీపంలోనూ మరో 50 మంది పిల్లలు రోజూ పాత కాగితాలు ఏరుకునే పనిలో బిజీగా ఉంటారు. వీరంతా మధ్యాహ్నం వరకు చిత్తుకాగితాలు ఏరుకుని ఆ తర్వాత రంగారాయుడు చెరువు సమీపంలోని పాత కాగితాల దుకాణంలో అమ్ముకుని ఇంటి బాట పట్టడం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఒంగోలు, కనిగిరి, కందుకూరు, చీరాల, ఇంకొల్లు, మేదరమెట్ల, అద్దంకి, పొదిలి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బడికి పనికిరారంటూ తమ పిల్లలను కొందరు తల్లిదండ్రులు మెకానిక్ షెడ్లలో చేర్పిస్తుండటం విచారకరం.
ఫ్లాస్క్‌లతో రోడ్ల వెంట..
చీరాల, కందుకూరుల్లో హోటళ్లలో కూడా బాల కార్మికులు కనిపిస్తున్నారు. ఒంగోలులో కొందరు సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. చిన్న చిన్న పిల్లలు ఒక ఫ్లాస్క్ పట్టుకొని మెకానిక్ షెడ్లు, దుకాణాల చుట్టూ తిరిగి టీ విక్రయిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పిల్లవాడు చెప్పేది ఒకటే. డబ్బులు లేకపోవడంతో తానే ఫ్లాస్క్ కొనుక్కొని వ్యాపారం చేస్తున్నానంటాడే. అంతే తప్ప వ్యాపారి పేరు చెప్పేందుకు ఇష్టపడడు. ఇక అద్దంకి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు బాల కార్మికులు వెళ్తుంటారు. పెద్దల కూలీ రూ.300లు ఉంటే పిల్లలకు రూ.200 నుంచి రూ. 250 వరకు ఇస్తున్నారు. పిల్లలైతే మరింత స్పీడుగా పని చేస్తారనే నమ్మకం కూడా సంబంధింత యజమానుల్లో ఉండటం బాలకార్మిక వ్యవస్థ పెరిగేందుకు మరో కారణమని చెప్పవచ్చు.
భిక్షగాళ్ల వేషంలో..
టంగుటూరు, సింగరాయకొండ, మార్టూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లోనూ బాలలు మగ్గుతున్నారు. కొంతమంది ఫ్యాక్టరీ యజమానులు ఒకడుగు ముందుకేసి పిల్లలకు 14 సంవత్సరాలు నిండినట్లు సర్టిఫికెట్‌లు తెప్పించుకుని మరీ పనిలోకి పెట్టుకుంటున్నారు. సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది పిల్లలు రకరకాల వేషాల్లో భిక్షాటన పేరుతో ఒంగోలు వస్తుంటారు. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా.. లేక తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారా.. అనే అంశంపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. బడిబాట పట్టిన పిల్లల్లో బడి మానేసిన వారెందరు? వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మార్కాపురం పలకల గనులు, చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, స్పిన్నింగ్ మిల్లుల్లో బాల కార్మికులు నారకయాతన అనుభవిస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం దురదృష్టకరం.
బాల్యం బుగ్గి
Published Fri, Jan 24 2014 6:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement