ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిషన్ అధికారుల అలసత్వంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో చదువులు చట్టుబండలవుతున్నాయి. విద్యాసంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధకుల (అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు) నియామకాలు ఒక కొలిక్కి రాలేదు. విద్యాబోధకులను సెప్టెంబర్ 7వ తేదీ నాటికి నియమించాలని ఎస్‌పీడీ స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు.
532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు
జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరయ్యాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా జిల్లాలో 286 పాఠశాలల్లో కొన్నింటిలో అసలు టీచర్లు లేకపోగా కొన్నింటిలో మాత్రం ఒక్కొక్క టీచరే బోధిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు విద్యావలంటీర్లను నియమించేవారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించరాదు. కేవలం రెగ్యులర్ టీచర్లతోనే విద్యాబోధన చేయించాలి. డీఎస్సీ నిర్వహించకపోవడంతో కొత్త టీచర్ల నియామకాలు జరగలేదు. దీంతో పాఠశాలల్లో విద్యావలంటీర్లకు బదులుగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలకు, అసలు టీచర్లు లేని పాఠశాలలకు 286 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా వాటిని మంజూరు చేశారు. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవవేతనం చెల్లించేందుకు నిధులుకూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలోని బడిబయట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న 28 మండలాల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు విద్యాబోధకులను అదనంగా నియమించనున్నారు. జిల్లాకు మంజూరైన 175 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)కు విడుదలైన నిధులతో ఈ 28 మండలాల్లో నియమించే విద్యాబోధకులకు గౌరవవేతనం చెల్లిస్తారు. ఈ విధంగా మరో 246 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేశారు. దీంతో జిల్లాకు మొత్తం 532 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 6 పోస్టులు ఉర్దూ అభ్యర్థులకు కేటాయించారు. జిల్లాలో పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు మంజూరు చేశారు.
1920 దరఖాస్తులు:
జిల్లాకు మంజూరైన 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టరు పోస్టులకు మొత్తం 1920 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి తయారు చేసిన రిజర్వేషన్ల జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యతనిమ్మన్నారు. టీటీసీ, బీఈడీ, డీఈడీ విద్యార్హతలున్నవారే ఈ పోస్టులకు అర్హులు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. 7 నెలల పాటు అంటే 2014 మార్చి వరకు వీరిని కొనసాగించాలి. అభ్యర్థులు సంబంధిత మండల విద్యాధికారులకు దరఖాస్తులు సమర్పించాలి. మండల స్థాయిలో ఎంఈఓలు ఎంపిక చేసిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎన్‌ఎంసి)లు పాఠశాలల్లో చేర్చుకోవాలి. అయితే ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిధులతో కూడా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తుండటంతో దీనికి కలెక్టర్ ఆమోదముద్ర తప్పనిసరైంది. దీంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో జాప్యం జరుగుతోంది.
నష్టపోతున్న విద్యార్థులు, అభ్యర్థులు
పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల పిల్లల చదువులు సాఫీగా సాగడం లేదు. ఆగస్టు నుంచి సమైక్యాంధ్ర సమ్మె కూడా పాఠశాలల పనితీరును దెబ్బతీసింది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక్కరే అన్ని తరగతుల విద్యార్థులకు బోధించాల్సి రావడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. అసలు టీచరు లేని పాఠశాలల పరిస్థితి మరీ దారుణం. అక్కడ రోజుకొక టీచర్ పని చేస్తుండటం పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు.
రెగ్యులర్‌గా టీచరు పోస్టులు రాని క్వాలిఫైడ్ అభ్యర్థులు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులపైనే ఆశలు పెట్టుకున్నారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా కనీసం రూ. 5 వేలు వస్తే కుటుంబాలు సాఫీగా సాగిపోతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 1920 మందిలో 1098 మంది అర్హులుగా గుర్తించారు. వివిధ కారణాల వల్ల 689 మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల సేవలను వినియోగించుకునేందుకు గడువు మరో రెండు నెలల్లో ముగియనుండగా ఇప్పటి వరకు విద్యాబోధకుల నియామకాలు ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే విద్యాబోధకులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యాబోధకులు ఏరి..!
Published Wed, Jan 22 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement