Academic Instructor
-
త్వరలో విద్యావలంటీర్ల నియామకం
ప్రాథమికంగా ఆరేడు వేల మంది అవసరమని అంచనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో విద్యా వలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ఎంత మంది విద్యా వలంటీర్లు అవసరం అవుతారన్న లెక్కలు తేల్చడంపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. స్కూళ్లలో విద్యా బోధనకు ఆంటంకం కలగకుండా ఉండేందుకు ఈ నియామకాలు అవసరమని భావిస్తోంది. అలాగే భవిష్యత్తులో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు వస్తాయన్న అంశంపైనా దృష్టి పెట్టింది. అయితే బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమికంగా జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆరేడు వేల మంది విద్యా వలంటీర్లు అవసరమని భావిస్తున్నారు. మరోవైపు బదిలీల ప్రక్రియ పూర్తయిన వెనువెంటనే వలంటీర్లను నియమించి ఆ తరువాత డీఎస్సీ నిర్వహణ కోసం ఖాళీల వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని విద్యాశాఖ భావిస్తోంది. హేతుబద్ధీకరణ లెక్కల ప్రకారం.. ఇటీవల చేపట్టిన టీచర్ల హేతుబద్ధీకరణ లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఆరేడు వేల మంది విద్యా వలంటీర్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఖాళీలు ఉన్నట్లుగా తేలింది. మిగతా ఆరు జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు తేల్చింది. నిజమాబాద్ జిల్లాలో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు సమాచారం. అదనంగా ఉన్న ఈ పోస్టులను స్కూళ్లలో ఉంచకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చింది. మరోవైపు ఆయా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నట్లు తేలింది. ఆ స్థానాల్లో ప్రస్తుతం విద్యా వలంటీర్లను నియమించాల్సి వస్తుంది. -
వీధి బడులకు శాశ్వత సెలవు!
విజయనగరం అర్బన్: గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలకు ‘నాణ్యమైన విద్య’ అంటూ క్లస్టర్ స్కూళ్ల పేరుతో చాలా పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రానున్న విద్యాసంవత్సరం నుంచి అమలు చేయడానికి ఎంపిక చేసిన మూడు జిల్లాలో విజయనగరం జిల్లా ఉంది. దీంతో జిల్లాలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడనున్నాయి. మండలంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఒక పాఠశాల ఉండే విధంగా క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మండలాల్లో క్లస్టర్ సూళ్లకు అనుకూలమైన పాఠశాలలకు గుర్తింపు సర్వేలను ఎంఈఓల ద్వారా నిర్వహించారు. మూతపడే పాఠశాలలను ముందుగా ప్రకటిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుందని వాటి సంఖ్యను వెలువరించడానికి విద్యాశాఖ నిరాకరిస్తోంది. తొలుత మూడు కిలోమీటర్ల పరిధిలో క్లస్టర్ స్కూళ్లంటూ ప్రకటించింది. ఆ విధంగా అయితే మండలానికి 10 నుంచి 15 క్లస్టర్ స్కూళ్లు వచ్చే పరిస్థితి ఉండేది. కొద్దిరోజుల తర్వాత సవరించిన ఆదేశాల మేరకు 10 కిలోమీటర్ల పరిధిలో ఒక క్లస్టర్ పాఠశాల విధానం వచ్చింది. ఆ దిశగా మరోసారి సర్వే నివేదికలు పంపారు. తాజా ఆదేశాల మేరకు మండలానికి మూడు పాఠశాలల చొప్పున జిల్లాలోని 34 మండలాలలో కేవలం 102 క్లస్టర్ పాఠశాలలు మాత్రమే ఉంటాయి. ఒక్కో పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 2,927 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,320, మిగిలినవి ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలున్నాయి. దీంతో జిల్లాలో 2,825 పాఠశాలలు ఒక్కసారిగా మూతపడే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం దృష్టంతా ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేయడంపైనే ఉంది. ప్రజలకు విద్యనందించే భారాన్ని తగ్గించుకునే విధంగా ఆదినుంచి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీర్చడం నుంచి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడం వరకు ఏ ఒక్కటీ ఇంతవరకు చే పట్టిన దాఖలాలు లేవు. చివరికి కేంద్రప్రభుత్వం నిధులు అందజేసే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను భర్తీచేయడానికి కూడా ముందుకు రావడంలేదు. ఎలాగూ పాఠశాల సంఖ్యను తగ్గిస్తాం... కాబట్టి టీచర్ల కొరతను తీర్చక్కర్లేదు అన్నట్టుగా పాలకులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా వస్తున్న క్లస్టర్ స్కూళ్ల వ్యవస్థ వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే ప్రాథమిక స్థాయి విద్యార్థులను 10 కిలోమీటర్ల దూరం పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించే పరిస్థితి అనుమానమే. గ్రామాల నుంచి వ్యతిరేకత పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని గంట్యాడ మండలం నుంచి పలు గ్రామాల ప్రజలు, పాఠశాలల విద్యార్థులు కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులు అంగీకరిస్తారా? అనే విషయంపైనే ప్రస్తుతం చర్చనడుస్తోంది. మిగిలిన స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న భవనాల సంగతి ఏంటనే విషయాలపై స్పష్టత లేదు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మోడల్ స్కూళ్లకు అన్ని సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఏర్పాటు చేయనున్న క్లస్టర్ స్కూళ్ల విషయంలో కూడా అదే గతి పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వివరాలు తీసుకుంటాం: డీఈఓ ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలల వరకు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు వివరాలను తీసుకుంటామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మండలాల వారీగా వివరాలు పూర్తిస్థాయిలో ఇంకారాలేదన్నారు. స్మార్ట్, గ్రీన్ స్కూళ్లగా వాటిని తీర్చిదిద్దుతారని తెలిపారు. ఎంపిక చేసే వాటిలో పక్కా భవనం, ఫర్నిచర్, ప్రహరీ, కంప్యూటర్లు ఉండాలన్నారు. గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం ఉండాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. అలాగే విద్యార్థుల నమోదు అధికంగా ఉండడం తప్పనిసరి అన్నారు. ఒక్కో క్లస్టర్ స్కూల్‌కు 5 నుంచి 6 పాఠశాలలు అటాచ్ అవ్వాలని, అవసరమైతే అదనంగా తరగతి గదులు, రెసిడెన్షియల్ హాస్టల్ కట్టుకునేందుకు అవకాశం ఉండాలని వివరించారు. -
264 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల మంజూరు
విజయనగరం అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఎట్టకేలకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 264 ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం జిల్లా విద్యాశాఖకు ఆదేశాలొచ్చాయి. అయితే నియామకాల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు రావాల్సి ఉంది. ఈ పోస్టుల్లో ఎస్జీటీకి ఇతర కేటగిరీకి ఎన్నెన్ని కేటాయించాలో వంటి నిర్ధేశికాలు కూడా రాలేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కొరతను తీర్చడానికి ఈ పోస్టులు ఏమాత్రం సరిపోవని ఉపాధ్యాయుల వర్గాలు చెబుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని తీసుకొని ఆ మేరకు అవసరమైన అన్ని పోస్టులలో ఇన్స్ట్రక్టర్లను నియమిస్తే కొరత తీరతుంది. ఏడాదిగా జరిగిన పదోన్నతుల వల్ల వివిధ కేటగిరీల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో పరిశీలిస్తే పదోన్నతుల ప్రక్రియ నిర్వహించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 624 ఏకోపాధ్యా ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో రెండో పోస్టు అవసరమున్న పాఠశాలలు 300 వరకు ఉన్నాయి. ఇంకా ఉన్నత పాఠశాలల్లో పదోన్నతిపై వెళ్లిన వివిధ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సుమారు 120 వరకు ఉన్నాయి. ఇప్పుడు మంజూరయిన 264 ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఎటూ చాలవని ఉపాధ్యాయవర్గాలు వాపోతున్నాయి. గౌరవ వేతనం నిధులపై సందిగ్ధం గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలోపని చేస్తున్న విద్యావాలంటీర్లకు రాజీవ్ విద్యామిషన్ నుంచి, హైస్కూళ్లలో పనిచేసే వాలంటీర్లకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి గౌరవవేతనం చెల్లించేవారు. ప్రస్తుతం విద్యాసంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు గౌరవవేతనం చెల్లించేందుకు బడ్జెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఇన్‌స్ట్రక్టర్ల నియాకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఖాళీగా ఉన్న టీచరు పోస్టులు భర్తీకి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటిస్తుండగా తాజాగా విద్యావలంటీర్ల నియామకాలు తెరపైకి రావడంతో డీఎస్సీపై నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. అవసరమున్న అన్ని చోట్ల పోస్టులివ్వాలి: స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సంఘం జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో అవసరమున్న అన్ని చోట్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీలను అకడమిక్ ఇన్స్ట్రక్టర్లతో భర్తీ చేయాలని స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సంఘం జిల్లా ప్రతినిధి బి.శ్రీనివాసరావు కోరారు. ప్రధానంగా నాన్ సక్సెస్ ఉన్నత పాఠశాల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. -
విద్యాబోధకులు ఏరి..!
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిషన్ అధికారుల అలసత్వంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో చదువులు చట్టుబండలవుతున్నాయి. విద్యాసంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధకుల (అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు) నియామకాలు ఒక కొలిక్కి రాలేదు. విద్యాబోధకులను సెప్టెంబర్ 7వ తేదీ నాటికి నియమించాలని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరయ్యాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా జిల్లాలో 286 పాఠశాలల్లో కొన్నింటిలో అసలు టీచర్లు లేకపోగా కొన్నింటిలో మాత్రం ఒక్కొక్క టీచరే బోధిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు విద్యావలంటీర్లను నియమించేవారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించరాదు. కేవలం రెగ్యులర్ టీచర్లతోనే విద్యాబోధన చేయించాలి. డీఎస్సీ నిర్వహించకపోవడంతో కొత్త టీచర్ల నియామకాలు జరగలేదు. దీంతో పాఠశాలల్లో విద్యావలంటీర్లకు బదులుగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలకు, అసలు టీచర్లు లేని పాఠశాలలకు 286 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా వాటిని మంజూరు చేశారు. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవవేతనం చెల్లించేందుకు నిధులుకూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలోని బడిబయట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న 28 మండలాల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు విద్యాబోధకులను అదనంగా నియమించనున్నారు. జిల్లాకు మంజూరైన 175 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)కు విడుదలైన నిధులతో ఈ 28 మండలాల్లో నియమించే విద్యాబోధకులకు గౌరవవేతనం చెల్లిస్తారు. ఈ విధంగా మరో 246 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేశారు. దీంతో జిల్లాకు మొత్తం 532 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 6 పోస్టులు ఉర్దూ అభ్యర్థులకు కేటాయించారు. జిల్లాలో పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు మంజూరు చేశారు. 1920 దరఖాస్తులు: జిల్లాకు మంజూరైన 532 అకడమిక్ ఇన్స్ట్రక్టరు పోస్టులకు మొత్తం 1920 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి తయారు చేసిన రిజర్వేషన్ల జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యతనిమ్మన్నారు. టీటీసీ, బీఈడీ, డీఈడీ విద్యార్హతలున్నవారే ఈ పోస్టులకు అర్హులు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. 7 నెలల పాటు అంటే 2014 మార్చి వరకు వీరిని కొనసాగించాలి. అభ్యర్థులు సంబంధిత మండల విద్యాధికారులకు దరఖాస్తులు సమర్పించాలి. మండల స్థాయిలో ఎంఈఓలు ఎంపిక చేసిన అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎన్ఎంసి)లు పాఠశాలల్లో చేర్చుకోవాలి. అయితే ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిధులతో కూడా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తుండటంతో దీనికి కలెక్టర్ ఆమోదముద్ర తప్పనిసరైంది. దీంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో జాప్యం జరుగుతోంది. నష్టపోతున్న విద్యార్థులు, అభ్యర్థులు పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల పిల్లల చదువులు సాఫీగా సాగడం లేదు. ఆగస్టు నుంచి సమైక్యాంధ్ర సమ్మె కూడా పాఠశాలల పనితీరును దెబ్బతీసింది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక్కరే అన్ని తరగతుల విద్యార్థులకు బోధించాల్సి రావడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. అసలు టీచరు లేని పాఠశాలల పరిస్థితి మరీ దారుణం. అక్కడ రోజుకొక టీచర్ పని చేస్తుండటం పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రెగ్యులర్‌గా టీచరు పోస్టులు రాని క్వాలిఫైడ్ అభ్యర్థులు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులపైనే ఆశలు పెట్టుకున్నారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా కనీసం రూ. 5 వేలు వస్తే కుటుంబాలు సాఫీగా సాగిపోతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 1920 మందిలో 1098 మంది అర్హులుగా గుర్తించారు. వివిధ కారణాల వల్ల 689 మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల సేవలను వినియోగించుకునేందుకు గడువు మరో రెండు నెలల్లో ముగియనుండగా ఇప్పటి వరకు విద్యాబోధకుల నియామకాలు ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే విద్యాబోధకులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో 2013-14 విద్యా సంవత్సరంలో పని చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కె.రామశేషు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తెలుగు మీడియంలో 526 మంది, ఉర్దూ పాఠశాలల్లో ఆరుగురు మొత్తం 532 మంది ఇన్స్ట్రక్టర్లను నియమిస్తున్నారు. అసలు టీచర్లు లేని పాఠశాలలు, ఒక ఉపాధ్యాయుడు పని చేస్తున్న పాఠశాలల్లో, బడిబయట పిల్లలు అధిక సంఖ్యలో ఉన్న ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో వీరిని నియమిస్తున్నట్లు రామశేషు తెలిపారు. ఈ పోస్టులకు టీటీసీ/ డీఈడీ/ బీఈడీ పూర్తిచేసినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు మండల విద్యాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండలాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు, రోస్టర్ పాయింట్, ఇతర వివరాలకు అభ్యర్థులు ఠీఠీ.ఞట్చజ్చుట్చఝ.ఠ్ఛీఛౌఛ్ఛీ.ఛిౌఝ వెబ్సైట్ చూడవచ్చు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. ఏ మండలానికి ఎన్ని పోస్టులు.. పాఠశాలల్లో ఖాళీల అవసరాన్ని బట్టి ఏ మండలానికి ఎన్ని అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కేటాయించిందీ రామశేషు ప్రకటించారు. పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు కేటాయించారు. అద్దంకి మండలానికి 12, అర్థవీడు 1, బేస్తవారిపేట 6, బల్లికురవ 1, సీఎస్‌పురం 29, చీమకుర్తి 4, చినగంజాం 3, చీరాల 2, కంభం 4, దర్శి 7, దొనకొండ 36, పెదదోర్నాల 12, గిద్దలూరు 10, గుడ్లూరు 5, హనుమంతునిపాడు 26, ఇంకొల్లు 2, జె.పంగులూరు 2, కందుకూరు 15, కనిగిరి 8, కారంచేడు 1, కొమరోలు 19, కొనకనమిట్ల 27, కొండపి 3, కొరిశపాడు 4, కొత్తపట్నం 4, కురిచేడు 15, లింగసముద్రం 1, మద్దిపాడు 2, మార్కాపురం 7, మర్రిపూడి 5, మార్టూరు 3, ముండ్లమూరు 10, నాగులుప్పలపాడు 5, ఒంగోలు 6, పెదచెర్లోపల్లి 28, పుల్లలచెరువు 49, పామూరు 11, పర్చూరు 9, పెద్దారవీడు 6, పొదిలి 9, పొన్నలూరు 10, రాచర్ల 6, సింగరాయకొండ 1, సంతనూతలపాడు 1, సంతమాగులూరు 2, తాళ్లూరు 3, టంగుటూరు 6, తర్లుపాడు 5, త్రిపురాంతకం 26, ఉలవపాడు 8, వెలిగండ్ల 10, వేటపాలెం 2, వలేటివారిపాలెం 4, యర్రగొండపాలెం 24, యద్దనపూడి 5, జరుగుమల్లి 4 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను కేటాయించారు. అద్దంకి, అర్థవీడు, దోర్నాల, కురిచేడు, పొదిలి, వెలిగండ్ల మండలాలకు ఒక్కొక్కటి చొప్పున ఉర్దూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామశేషు కోరారు.