విజయనగరం అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఎట్టకేలకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 264 ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం జిల్లా విద్యాశాఖకు ఆదేశాలొచ్చాయి. అయితే నియామకాల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు రావాల్సి ఉంది. ఈ పోస్టుల్లో ఎస్జీటీకి ఇతర కేటగిరీకి ఎన్నెన్ని కేటాయించాలో వంటి నిర్ధేశికాలు కూడా రాలేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కొరతను తీర్చడానికి ఈ పోస్టులు ఏమాత్రం సరిపోవని ఉపాధ్యాయుల వర్గాలు చెబుతున్నాయి.
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని తీసుకొని ఆ మేరకు అవసరమైన అన్ని పోస్టులలో ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తే కొరత తీరతుంది. ఏడాదిగా జరిగిన పదోన్నతుల వల్ల వివిధ కేటగిరీల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో పరిశీలిస్తే పదోన్నతుల ప్రక్రియ నిర్వహించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 624 ఏకోపాధ్యా ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో రెండో పోస్టు అవసరమున్న పాఠశాలలు 300 వరకు ఉన్నాయి. ఇంకా ఉన్నత పాఠశాలల్లో పదోన్నతిపై వెళ్లిన వివిధ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సుమారు 120 వరకు ఉన్నాయి. ఇప్పుడు మంజూరయిన 264 ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఎటూ చాలవని ఉపాధ్యాయవర్గాలు వాపోతున్నాయి.
గౌరవ వేతనం నిధులపై సందిగ్ధం
గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలోపని చేస్తున్న విద్యావాలంటీర్లకు రాజీవ్ విద్యామిషన్ నుంచి, హైస్కూళ్లలో పనిచేసే వాలంటీర్లకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి గౌరవవేతనం చెల్లించేవారు. ప్రస్తుతం విద్యాసంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు గౌరవవేతనం చెల్లించేందుకు బడ్జెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఇన్‌స్ట్రక్టర్ల నియాకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఖాళీగా ఉన్న టీచరు పోస్టులు భర్తీకి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటిస్తుండగా తాజాగా విద్యావలంటీర్ల నియామకాలు తెరపైకి రావడంతో డీఎస్సీపై నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
అవసరమున్న అన్ని చోట్ల పోస్టులివ్వాలి: స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సంఘం
జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో అవసరమున్న అన్ని చోట్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీలను అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతో భర్తీ చేయాలని స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సంఘం జిల్లా ప్రతినిధి బి.శ్రీనివాసరావు కోరారు. ప్రధానంగా నాన్ సక్సెస్ ఉన్నత పాఠశాల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు.
264 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల మంజూరు
Published Wed, Sep 3 2014 2:12 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement