బడుల మూత...పోస్టుల కోత..! | Education tdp government stepfather love | Sakshi
Sakshi News home page

బడుల మూత...పోస్టుల కోత..!

Published Mon, Jul 28 2014 12:06 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

బడుల మూత...పోస్టుల కోత..! - Sakshi

బడుల మూత...పోస్టుల కోత..!

 విద్యారంగంపై సర్కార్ సవతి ప్రేమ చూపుతోంది. ఒక వైపు బడిపిలుస్తోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తూ మరో వైపు జిల్లాలో 72 యూపీ పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేసి, తద్వారా డీఎస్సీలో పోస్టులను కుదించి వేసేందుకు ఎత్తుగడ వేసింది. ఈ వ్యవహారం ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
 
 విజయనగరం అర్బన్:డీఎస్సీ-2014 పోస్టుల కుదింపునకు కుతంత్రాలు సాగుతున్నాయి. నిజానికి పోస్టులకు తగ్గించే రేషనలైజేషన్ ప్రక్రియ ఎలాగూ ఉంటుంది... ఇది కాకుండా ఇంకా భారీగా పోస్టులు తగ్గించి డీఎస్సీని మమా అనిపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.  విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో ప్రాథమికోన్నత పాఠశాల లోని 6, 7వ తరగతి రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆర్‌సీ నం: 36/పీఎస్-1-1/2014 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.
 
 ఒకవైపు ‘బడి పిలుస్తోంది...’ అంటూ హడావుడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు మరో వైపు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని సుమారు 72 ప్రాథమికోన్నత పాఠశాలలను (యూపీ) మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 6, 7వ తరగతుల్లో ఇరవై మందిలోపు విద్యార్థులున్న యూపీ స్కూళ్లను మూసివేయనున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘ నాయకులు అభ్యంతరం చెప్పడంతో 20 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించే పనిని విద్యాశాఖ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 243 యూపీ పాఠశాలలున్నా యి. వీటిలో 72 స్కూళ్లలో 6, 7వ  తరగతులు 20 మందిలోపు విద్యార్థులున్నట్లు తెలిసింది. ఉత్తర్వుల ను అమలు చేస్తే రానున్న రోజుల్లో మరిన్న యూపీ పాఠశాలలు జిల్లాలో మూతపడే ప్రమాదం ఉంది.
 
 ఉపాధ్యాయులు సర్దుబాటు సాధ్యమేనా...?
 ఇంతవరకు 20 మంది కన్నా అధికంగా పిల్లలు ఉండడం వల్ల యూపీ స్కూళ్లలో తెలుగు, హిందీ పండిట్లతోపాటు మరో రెండు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉండేవి. ఆ స్కూళ్లను రద్దు ఆదేశాల వల్ల సంబంధిత పోస్టుల ఉపాధ్యాయులను తక్షణమే సమీప ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలి. 72 స్కూళ్లు మూసివేస్తే అక్కడ పనిచేస్తున్న దాదాపు 140 మంది ఉపాధ్యాయులను వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ అధికారులకు ఈ సర్దుబాటు కత్తిమీద సామే అవుతుంది.
 
  చదువులకు మధ్యలో ఫుల్‌స్టాప్ !
  అదే విధంగా ఈ ఆదేశాల్లో మరో అంశం మేరకు ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్లు దూరంలో యూపీ పాఠశాల, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలో 20 కన్నా తక్కువగా పిల్లలు ఉన్న యూపీ పాఠశాలను మూసివేస్తే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను దగ్గరలోని పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. పాఠశాల మూసివేసిన గ్రామంలో కిలోమీటరు వరకు బస్సు సౌకర్యం లేకపోతే దూరప్రాంతంలోని పాఠశాలకు వెళ్లే ఒక్కొక్క విద్యార్థికి రూ.3 వేలు ప్రయాణ ఖర్చులుగా ఇవ్వాలనే నిబంధన ఉంది. 72 యూపీ పాఠశాలల మూసి వేస్తే ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ఎంతమేరకు రవాణా చార్జీలు చెల్లిస్తారనేది విద్యాశాఖ అధికారులే చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి నిధులు విద్యార్థులకు ఇవ్వకుండా వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితి జిల్లాలో గతంలో జరిగింది. ప్రయాణం భారం కావడంతో చాలా మంది విద్యార్థులు చదువును మధ్యలో నిలిపివేసే పరిస్థితులు ఏర్పడతాయి.
 
  డీఎస్సీ పోస్టులకు కోత తప్పదు...?
 ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శాపంగా మారింది. యూపీ స్కూళ్ల రద్దు వల్ల ఏర్పడే మిగులు పోస్టులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మరో వైపు హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) నిర్వహించే ఆలోచన చేస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిర్దేశిత నిష్పత్తితో నిర్వహించే ఈ ప్రక్రియ వల్ల కూడా పోస్టులు మిగులుతాయి. దీంతో డీఎస్సీ-2014లో తీయబోతున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల సంఖ్య తగ్గుతుంది. త్వరలో విడుదలకానున్న డీఎస్సీ-14 నోటిఫికేషన్‌లో కేవలం 409 పోస్టులు చూపెడుతున్నట్లు తెలిసింది. వీటిలో మైదాన ప్రాంతంలో 343, ఏజన్సీ ప్రాంతంలో 66 వరకు ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పోస్టులు కేవలం 145 మాత్రమే ఉన్నాయి. యూపీ స్లూళ్ల రద్దు నేపథ్యంలో మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్దుబాటు చేయాల్సినవి కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే సాధ్యమైనంత మేరకు పోస్టుల్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎవరికైనా అర్ధమవుతుంది.  
 
  నివేదిక పంపాం: ఆర్వీఎం పీఓ
 జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను తరగతుల వారీగా పంపాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ వివరాలు  పంపినట్టు రాజీవ్ విద్యామిషన్ పీఓ శారద  చెప్పారు. అందులో 20 మంది కన్నా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను గుర్తించి నివేదించినట్టు ఆమె తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement