మాటల్లోనే పరిష్కారం..! | No Real Solutions | Sakshi
Sakshi News home page

మాటల్లోనే పరిష్కారం..!

Published Mon, Dec 3 2018 2:40 PM | Last Updated on Mon, Dec 3 2018 2:40 PM

No Real Solutions - Sakshi

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ (ఫైల్‌ ఫొటో)

‘గంట్యాడ మండలం పెదమజ్జి
పాలెం గ్రామానికి చెందిన పాతిన రాణి పింఛన్‌ కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. పింఛన్‌ మంజూరు కాలేదు. కనీసం ఎందుకు రావడం లేదో తెలియజేయలేదు. నవంబర్‌ 19న మరోసారి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న ఆమె గ్రీవెన్స్‌కు వచ్చేందుకు అవస్థలు పడుతోంది. అధికారులు మాత్రం పింఛన్‌ ఆదరువు కల్పించలేకపోతున్నారు.’ 

‘విజయనగరం పట్టణంలో  
కె.ఎల్‌.పురం వజ్రపుబంద ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు నెలలు తరబడి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలు విషయం నీటిపారుదలశాఖ అధికారులే అంగీకరిస్తున్నా తొలిగించేందుకు చొరవ తీసుకోపోవడం శోచనీయం’.

విజయనగరం గంటస్తంభం: గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి మీరెప్పుడైనా చూశారా? అక్కడ అర్జీ ఇచ్చేందుకు జనం పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. నడవడానికి శరీరం సహకరించని వృద్ధులు... పుట్టుకతోనే వైకల్యంతో బాధపడే విభిన్న ప్రతిభావంతులు... ఎన్నో ఏళ్లుగా సమస్యతో పోరాడుతున్న బాధితులు... అన్నీ పత్రాలు ఉన్నా రికార్డుల్లో భూమి హక్కులు లేని రైతులు.. ఇలా ఎంతోమంది కనపడతారు. రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు...చేతిలో చిల్లుగవ్వ లేని పేదలు అప్పులు చేసి మరీ గ్రీవెన్స్‌సెల్‌కు వస్తారు. వారిని చూసినా... వారిని కదిపినా కలెక్టర్‌ నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి దరఖాస్తు ఇస్తే పరిష్కారమైనట్లేనన్న ఆశ వారిలో కనిపిస్తుంది. ఒకసారి వస్తేగానీ ఇక్కడ పరిస్థితి అర్థం కాదు.. ఇదంతా ఎండమావులే అని. చేతల్లో కా కుండా మాటలతోనే ఫిర్యాదులు పరిష్కరించేస్తున్నారని.. జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ అర్జీల పరిష్కా రం తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
 
నామమాత్రపు పరిష్కారం
మీకోసం కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో దాదా పు అన్నీ పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఆన్‌లైన్‌లో అలాగే చూపిస్తున్నారు. వాస్తవానికి ఎం తమంది ఇచ్చిన అర్జీదారులకు సరైన పరిష్కా రం లభించందంటే నామమాత్రమే అని చెప్పాలి. పరిష్కారం అంటే ప్రభుత్వం, అధికారుల దృష్టిలో అర్జీకి ఏదో ఒక సమాధానం చెప్పడం. కానీ అర్జీ దారుడు దృష్టిలో తాను అధికారుల దృష్టిలో పెట్టిన సమస్య పరిష్కారమైతేనే న్యాయం జరిగినట్లు. ఈవిషయం అధికారులకు తెలిసినా తమ వద్ద అర్జీ పెండింగ్‌ లేకుండా ఏదో ఒక సమాధానం చెప్పేస్తున్నారు. ఒక్కోసారి తమ పరిధిలోనిది కాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాధానం ఇచ్చి సరిపెడుతున్నారు. ఇవన్నీ పరిష్కారమైనట్లేనని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో లెక్కకు వినతులు పరిష్కారం జరిగినా వాస్తవంలో ప్రజలు ఇబ్బందులు తీరడం లేదు. గత నాలుగేళ్లలో వచ్చిన వినతుల్లో అధికారులు పరిష్కారమైనట్లు చెబు తున్న వినతుల్లో 70శాతం పరిస్థితి ఇదే. దీంతో గ్రీవెన్స్‌సెల్‌లో వినతులు ఇవ్వడమే మినహా తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
లోపం ఎవరిది?
గ్రీవెన్స్‌సెల్‌లో వినతులకు సరైన పరిష్కారం ల భించలేదన్నది జిల్లా వాసులందరికీ తెలుసు. ప్రతీ మండలం, ప్రతీగ్రామం నుంచి ఏదో సందర్భంలో ఎవరో ఒకరు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి ఉంటా రు. వారి సమస్యకు ఎంతవరకు పరిష్కారం లభించిందో ఒకసారి తెలుసుకుంటే ఈ విషయం ఇట్టే బోధపడుతుంది. ఇందుకు లోపం ఎవరిదం టే ప్రభుత్వానిదేనని చెప్పక తప్పదు. అధికారులు పొరపాట్లు కూడా చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేని వినతులు పరిష్కరించే అవకాశం ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. అర్జీదారుడు ఇచ్చిన గ్రీవెన్స్‌ను మళ్లీ మండలాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి అక్కడకు వెళ్లి న్యాయం జరగలేదని భావించిన తర్వాత కలెక్టర్‌ వద్దకు వస్తున్నారు. ఆ విషయం మరిచి వారికే పంపడమే కాకుండా కనీసం వాస్తవమెంతో తెలుసుకోవడం లేదు. గ్రీవెన్స్‌ పిటీన్‌పై గ్రామాలకు వెళ్లి విచారణ చేసిన జిల్లా అధికారులను వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. ఇకపోతే ప్రభుత్వం కూడా గ్రీవెన్స్‌ పరిష్కారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. నాలుగేళ్లలో వచ్చినవాటిలో 5.10 లక్షల వినతులు ఫైనాన్స్‌ సంబంధిత అం శాలే అయినా వాటి పరిష్కారానికి చొరవ లేదు. పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల బిల్లులు, రుణాలు అధిక అర్జీ లు వస్తున్నా వారికి సమస్యకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇదిలాఉంటే 1100కు ఫోన్‌ చేసిన వారికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు కావడం చూస్తే గ్రీవెన్స్‌సెల్‌కు విలువ లేదన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్‌సెల్‌కు భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యముంటుందో చూడాలి.

పట్టించుకోవడం లేదు..
పట్టణంలో ఉన్నా తమ గు రించి పాలకులు పట్టించుకోవడం లేదు. తమకు తాగునీరు, విద్యుత్‌ సరఫరా లేదని, ఇతర సౌకర్యాలు అందడం లేదు. గ్రీవెన్స్‌సెల్‌లో ఎన్నోసార్లు అధికారులకు సమస్య తెలియజేసినా పరిష్కా రం కాలేదు. అటు ప్రభుత్వం గానీ, అధికారులుగానీ తమను పట్టించుకోవడం లేదు. – మజ్జి సత్యవతి, కామాక్షినగర్‌ నగర్‌ మాంతిచెరువు 

నివేదిస్తే పరిష్కరించినట్టే.. 
అర్జీదారుడు సమస్యపై ఇచ్చే దరఖాస్తు విచారించి పరిష్కరిస్తున్నాం. ఆర్థికపరమైన విషయాలు ప్రభుత్వానికి నివేదించి ఆ విషయం అర్జీ దారుడుకు తెలియజేస్తున్నాం. పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా అర్జీలు వ స్తున్నాయి. ఆ విషయం ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ఆ విధంగా చేస్తే పరిష్కారమైనట్లే. చేయలేని వాటి విషయంలో అర్జీదారుడికి తెలియజేసి క్లోజ్‌ చేస్తున్నాం. అంటే ఆ దరఖాస్తుకు పరిష్కారం అయినట్టే.   – జె.వెంకటరావు, డీఆర్వో, విజయనగరం      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement