జంఝాటం ! | No Water Crops In Vizianagaram District | Sakshi
Sakshi News home page

జంఝాటం !

Published Sun, Aug 18 2019 10:24 AM | Last Updated on Sun, Aug 18 2019 10:46 AM

No Water Crops In Vizianagaram District - Sakshi

ఆ ప్రాంతంలో సాగునీటి సమస్య తీర్చడానికి ప్రాజెక్టు ఉంది. దాని ద్వారా నీరు తరలించడానికి కాలువలున్నాయి. కానీ నిర్వహణే లేదు. కాలువల్లో గుర్రపుడెక్క... పిచ్చిమొక్కలు... పెరిగిపోయాయి. చుక్కనీరైనా సాగడానికి అనువుగా లేదు. మరోచోట కాలువకు అడ్డంగా పెద్దరాయి పడింది. దానిని తొలగించకపోవడంవల్ల నీరు రావట్లేదు. దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీనంతటికీ కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం... అధికారుల్లో చిత్తశుద్ధి లోపం. ఇదీ జంఝావతి రిజర్వాయర్‌ పరిధిలోని కాలువల దుస్థితి. వీరి నిర్వాకం వల్ల పార్వతీపురం సబ్‌డివిజన్‌ పరిధిలోని మూడు మండలాలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది మన రైతన్నల పరిస్థితి. పంటల సాగుకు అవసరమైన ప్రాజెక్టులున్నాయి. నీటి వనరులున్నాయి. కాని అధికారుల పర్యవేక్షణ లోపంతో సాగునీరు సకాలంలో అందక కరువు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోంది. పార్వతీపురం డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. జంఝావతి ఎగువ, దిగువ కాలువల అభివృద్ధికి రూ.28.44 కోట్లు నిధులున్నా అధికారులు సకాలంలో పూడికలు తీయకపోవడం, ఎస్టిమేట్లు వేయడంలో నిబద్ధత లోపించడంవల్ల రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్‌కు దూరమై కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

దిగువ కాలువను వేధిస్తున్న అడ్డంకులు..
జంఝావతి దిగువ కాలువ పొడవు 26.09 కిలోమీటర్లు. ఇది జంఝావతి రబ్బరు డ్యాం నుంచి సీతానగరం మండలం నిడగల్లు, ఇప్పలవలస వరకు ఉంది. కాలువలో గుర్రపు డెక్క ఆకు పెరగడం, కాలువలో కొన్ని ప్రాంతాల్లో రాతి బండలు అడ్డంగా ఉండటంతో కాలువ ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు రావడంలేదు. అలాగే సీతానగరం మండలం నిడగల్లు వద్ద పోతినాయుడు చెరువు వద్ద బాక్స్‌ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. నర్సిపురం వద్ద ఒక కల్వర్టు, నర్సిపురం కనుమల చెరువు వద్ద ఒక సూపర్‌ పాసేజ్‌ను నిర్మించాల్సి ఉంది. మృత్యుంజయవలస వద్ద ఒక కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ కల్వర్టులకు నిధులు కూడా మంజూరై ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కాలువకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించడానికి, కల్వర్టులు నిర్మాణానికి, అడ్డాపుశిలనుంచి సీతానగరం మండలంలోని తామర చెరువు వరకూ కాలువ అభివృద్ధి చేయడానికి  కాంట్రాక్ట్‌ ఇచ్చి 2017–18 ఖరీఫ్‌ సీజనులో నిర్దేశించిన భూములకు సాగునీరందించడానికి సిద్ధం చేయాలని మార్గదర్శకాలున్నా పనులు జరగడం లేదు. కాని కాంట్రాక్టర్‌ సకాలంలో వీటిని నిర్మించడంలేదు. గుర్రపు డెక్క ఆకును తొలగిస్తే చాలు నీరు దిగువకు వెళుతుంది. కాని అధికారులు నిధులు వినియోగించకుండా, పనులు చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడంతో రైతన్నలు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పడకేసిన ఎగువకాలువ..
జంఝవతి ఎగువ కాలువ జంఝావతి రబ్బర్‌ డ్యాం నుంచి జమదాల గ్రామం వరకు 27.29 కిలోమీటర్ల పొడవు ఉంది. నెల్లూరుకు చెందిన ఆర్‌కెఎన్‌ ప్రాజెక్ట్సుకు చెందిన కాంట్రాక్టరు ఈ కాలువ పనుల టెండర్‌ దక్కించుకున్నారు. కొమరాడ మండలం డంగభద్ర వద్ద రాయిపణుకు తగిలింది. 1300 నుంచి 1700 మీటర్ల మేర రాళ్ళను పేల్చి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ రూ.6 కోట్ల వరకు ఖర్చు పెట్టగా అప్పటి ప్రభుత్వం రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. దీనివల్ల పనులు ఆగిపోయాయి. 

నీరున్నా... అందని వైనం..
పార్వతీపురం మండలంలోని ఎమ్మార్‌నగర్, కృష్ణపల్లి, మరిపి, ఎల్‌.ఎన్‌.పురం, చినబొండపల్లి, వెంకంపేట, పెదబొండపల్లి, లచ్చిరాజుపేట, తాళ్ళబురిడి, జమదాల గ్రామాలకు అందాల్సిన సాగు నీరు అందకుండా పోయింది. ఒక వైపు అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రైతన్నలకు కళ్ళముందే సాగునీరు ఉన్నా అది సాగుకు అందకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి నిధులు విడుదల చేస్తే కేవలం వారం రోజుల్లోనే పనులు పూర్తి చేసి పంట చేలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement