సమస్యలు రాజ్యమేలుతున్నాయి.. | Govt Neglegency.. | Sakshi
Sakshi News home page

సమస్యలు రాజ్యమేలుతున్నాయి..

Published Tue, Dec 4 2018 6:19 PM | Last Updated on Tue, Dec 4 2018 6:19 PM

Govt Neglegency.. - Sakshi

సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కర్షకులు... మత్స్యకారులు... దినసరి కూలీలు... లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతోమితిమీరిన అవినీతి చోటుచేసుకుంది. మరుగుదొడ్లలో అక్రమాల గుట్టు బట్టబయలవుతోంది. హౌస్‌ఫర్‌ ఆల్‌ బండారం బటయపడింది. కరువుతో రైతాంగం అల్లాడుతోంది. ఉన్న ఊళ్లో బతుకు లేక వలసవెళ్లిన మత్స్యకారులకు ఎంత కష్టం ఎంత కష్టం... పాక్‌చెరలో బందీగా మారి బిక్కుబిక్కుమంటున్న వారిని పట్టించుకునేవారెవరు? ఇవన్నీ చర్చించడానికి మళ్లీ ఓ వేదిక దొరికింది అదే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం. మంగళవారం జరగనున్న ఈ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు వస్తాయో రావో... 

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో అన్ని వర్గాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి పరిష్కారంపై పాలకులు దృష్టిసారించడం లేదు. కనీసం మంగళవారం జరగనున్న జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశంలోనైనా దీనిపై చర్చిస్తారో లేదోనని జిల్లా ప్రజా నీకం ఎదురు చూస్తోంది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది రైతులు అప్పుల ఊబితో కూరుకుపోయారు. ఖరీప్‌ లో వరి పంట 1,19,735 హెక్టార్లలో సాగవ్వగా 50 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. జిల్లాలో 26 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు మండలాలనే మాత్రమే కరువు జాబితాలో చేర్చింది. కరువు కారణంగా రైతాంగం ఎకరానికి రూ. 20 వేల వరకు నష్టపోయారు. కరువు మండలంగా ప్రకటిస్తే కనీసం కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని రైతులు వేడుకుంటున్నారు. సర్కారు దీనిపై పునరాలోచించాలి. మరి జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది.

బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు 
జిల్లాలో బాలికలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. గత ఏడాది సీతానగరం వద్ద పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడి చేసి హతమార్చగా... తాజాగా ఎస్‌.కోట మండలం ఐతినపాలెం వద్ద తొమ్మిదేళ్ల బాలికపై మరో కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. వీటిని నియంత్రించడానికి చేపడుతున్న చర్యలేమిటో తేల్చాలి.

బిక్కుబిక్కుమంటూ మత్స్యకారులు
జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడినుంచి పొరపాటున పాక్‌జలాల్లోకి వెళ్లి అక్కడి కోస్టుగార్డులకు చిక్కి ప్రస్తుతం అక్కడ బందీలుగా మారారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఇక్కడ వారి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ తమవారికోసం ఎదురు చూస్తున్నారు. కనీసం వారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నమూ చేయడం లేదు.
 
విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ వ్యాధి

మొన్నటి వరకు డెంగీ వ్యాధి కోరలు చాపింది. తాజాగా స్వైన్‌ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. జిల్లాలో నెల రోజుల్లో 13 మంది స్వైన్‌ ఫ్లూ బారిన పడ్డారు. వారిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందులో 9 నెలలు పాప కూడా ఉంది   జిల్లాలో వైద్యం దైవాధీనంగా మారింది. ముఖ్యంగా జిల్లా కేంద్రాస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పూసపాటి రేగ మండలం పోరాం గ్రామానికి చెందిన జి.స్వాతి అనే గర్భిణి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేంద్రాస్పత్రి వస్తే చికిత్స అందించడంలో జాప్యం చేయడం వల్ల ఆమెకు అబార్షన్‌ అయింది. దీంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఘోషాస్పత్రిలో కొద్ది రోజుల క్రితం గుమ్మలక్ష్మిపురానికి చెందిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో ప్రసవించింది. ఈ రెండు ఆస్పత్రిల్లో రోగులకు సకాలంలో వైద్యం అందచరనే ఆరోపణలు  ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement