విజయనగరం క్రైం: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్ చెప్పారు. మంగళవారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో సెమిష్టర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 వేల పాఠశాలలు, అనేక సంక్షేమ హస్టళ్లను మూసివేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. అన్ని కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నారు.
విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.సురేష్, నాయకులు బి.లక్ష్మణ్, ఎం.చింతయ్య పాల్గొన్నారు.
7న పాఠశాలల బంద్
Published Wed, Aug 5 2015 1:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement