ప్రాథమికంగా ఆరేడు వేల మంది అవసరమని అంచనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో విద్యా వలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ఎంత మంది విద్యా వలంటీర్లు అవసరం అవుతారన్న లెక్కలు తేల్చడంపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.
స్కూళ్లలో విద్యా బోధనకు ఆంటంకం కలగకుండా ఉండేందుకు ఈ నియామకాలు అవసరమని భావిస్తోంది. అలాగే భవిష్యత్తులో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు వస్తాయన్న అంశంపైనా దృష్టి పెట్టింది. అయితే బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమికంగా జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆరేడు వేల మంది విద్యా వలంటీర్లు అవసరమని భావిస్తున్నారు.
మరోవైపు బదిలీల ప్రక్రియ పూర్తయిన వెనువెంటనే వలంటీర్లను నియమించి ఆ తరువాత డీఎస్సీ నిర్వహణ కోసం ఖాళీల వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని విద్యాశాఖ భావిస్తోంది.
హేతుబద్ధీకరణ లెక్కల ప్రకారం..
ఇటీవల చేపట్టిన టీచర్ల హేతుబద్ధీకరణ లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఆరేడు వేల మంది విద్యా వలంటీర్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఖాళీలు ఉన్నట్లుగా తేలింది. మిగతా ఆరు జిల్లాల్లో ఎస్‌జీటీ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు తేల్చింది.
నిజమాబాద్ జిల్లాలో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు సమాచారం. అదనంగా ఉన్న ఈ పోస్టులను స్కూళ్లలో ఉంచకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చింది. మరోవైపు ఆయా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నట్లు తేలింది. ఆ స్థానాల్లో ప్రస్తుతం విద్యా వలంటీర్లను నియమించాల్సి వస్తుంది.
త్వరలో విద్యావలంటీర్ల నియామకం
Published Tue, Jul 21 2015 2:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement