సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ప్యానల్ ఇన్‌స్పెక్షన్ దుమారం సృష్టిస్తోంది. బోధన సిబ్బంది పనితీరును మదింపు చేసేందుకు తలపెట్టిన ప్యానల్ ఇన్‌స్పెక్షన్‌పై సొసై టీ పరిధిలోని టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతానికి ఈ ఇన్‌స్పెక్షన్లను నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంతి కొప్పుల ఈశ్వర్‌ను కలసిన ఉపాధ్యాయ సంఘ నేతలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమబాట పట్టారు.
జనవరి రెండో తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరంచేయాలని భావిస్తున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో బోధన కార్యక్రమాలు గందరగోళంలో పడ్డాయి. జూన్ ఒకటిన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం నెలరోజులు ఆలస్యం కాగా, ప్రత్యక్ష తరగతులు నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతామనడంతో సొసైటీ పాఠశాలల్లో అలజడి మొదలైంది.
ఏమిటి ఈ ప్యానల్ ఇన్‌స్పెక్షన్..
సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలో 268 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 30 డిగ్రీ కాలేజీలు ఉండగా.. మిగతా వాటిలో 238 పాఠశాలలు, జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యా సంస్థల్లోని బోధన సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో నిపుణులను నియమించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఇటీవల పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు.
ఈ కమిటీ సభ్యులు ప్రతి పాఠశాలను అకస్మికంగా సంద ర్శిం చి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా పిల్లల స్థితి, పరీక్షల్లో వచ్చిన మా ర్కు లు, భావ వ్యక్తీకరణ.. తదితర అంశాలపై క్షుణ్ణం గా సమీక్షించి ఆయా సబ్జెక్టు టీచర్లకు మార్కులు వేస్తారు. దీంతో టీచర్ల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతుంది. పనితీరు అధ్వాన్నంగా ఉంటే వారిపై చర్యలకు సిఫారసు చేసే వీలుంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉండగా.. తాజాగా కొత్త పద్ధతిలో నిర్వహించేందుకు సొసైటీ కార్యాచరణ రూపొందించింది.
ఎందుకు వ్యతిరేకత..
ప్రస్తుతం ప్యానల్ ఇన్‌స్పెక్షన్‌ను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. గిరిజన గురుకుల సొసైటీలలో కూడా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాచారం. కాగా, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో అమలు చేసే ప్యానల్ ఇన్‌స్పెక్షన్ ప్రక్రియను ప్రస్తుత విద్యా సం వత్సరానికి మాత్రమే వాయిదా వేయా లని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
2021–22 విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభం కాగా, అక్టోబర్ నెలాఖరు వరకు ఆన్‌లైన్ పద్ధతిలోనే బోధన సాగింది. ఈ నేపథ్యంలో పిల్లల సామర్థ్యాన్ని సాకుగా చూపి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.కృష్ణారెడ్డి, ప్రభుదాస్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఇన్‌స్పెక్షన్‌ను ఈ ఏడాది మాత్రమే వాయిదా కోరుతున్నామని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బాలరాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment