Gurukul Schools
-
గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, చిలుకూరు: చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణలోని గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నట్టు సీఎం చెప్పారు. అలాగే, మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హాస్టల్స్, గురుకులాల్లో విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ ఇస్తున్నాం. హాస్టల్స్, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభమైంది. మెస్ మెనూలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. వారం రోజుల్లో ఐదు రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయించాం.తెలంగాణలో 26వేల ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే రాణిస్తారనే అపోహ ఉండేది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేటు స్కూల్స్ 33 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు?. మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలి. చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే.గురుకులాలు, హాస్టల్స్‌లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది?. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రతీనెలా పదో తేదీలోపు డైట్ ఛార్జీలు చెల్లిస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
Gurukul Jobs: పూర్తిస్థాయి పీజీటీ, ఆర్ట్ టీచర్ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటనలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ నెల 5న టీఆర్‌ఈఐఆర్‌బీ 9,231 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 17న జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్ కొలువులకు సంబంధించిన రెండు ప్రకటనలను విడుదల చేయగా... తాజాగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ), ఆర్ట్ టీచర్ కొలువులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటి ఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రక టనలన్నీ గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 ప్రకటనలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఈ నెల 24న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు గురుకుల బోర్డు అధికారులు చెబుతున్నారు. 1,276 పీజీటీ పోస్టులు... గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 1,276 ఉన్నాయి. ఇందులో అత్యధికం మహిళలకే రిజర్వ్ కావడం గమనార్హం. బాలికల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు వంద శాతం మహిళలకే కేటాయించడంతోపాటు బాలుర విద్యాసంస్థల్లో 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ మేరకు పోస్టుల కేటాయింపులు జరిగాయి. ఈ క్రమంలో 966 పీజీటీ పోస్టులు మహిళలకు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 310 పోస్టులు వచ్చాయి. పీజీటీలోని మొత్తం పోస్టుల్లో మహిళలకు 75.70 శాతం ఉద్యోగాలు, జనరల్ కేటగిరీలో 24.30 శాతం రిజర్వ్ అయ్యాయి. ఆర్ట్ టీచర్ పోస్టులు 132 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఆర్ట్ టీచర్ కేటగిరీలో 132 పోస్టుల భర్తీకి గురుకుల నియామకాల బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇందులో మహిళలకు 112 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. మోత్తం పోస్టుల్లో మహిళలకు 84.85 శాతం కేటాయింపు కాగా జనరల్ కేటగిరీలో 15.15 శాతం పోస్టులు లభించాయి. -
Telangana: కొత్త గురుకులాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన బీసీ గురుకుల విద్యా సంస్థలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరానికి గాను ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాల, ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఉన్న మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. యుద్ధప్రాతిపదికన ఈ విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో బీసీ గురుకుల సొసైటీ ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు సొసైటీ చర్యలు పూర్తి చేసింది. కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది 5,6,7 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేయగా, విద్యార్థులు సైతం రిపోర్టు చేశారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 295 గురుకుల పాఠశాలలు ఇప్పటివరకు రాష్ట్రంలో 262 గురుకుల పాఠశాలలున్నాయి. క్షేత్రస్థాయిలో బీసీ గురుకులాలకు డిమాండ్ విపరీతంగా ఉండడం... ప్రతి సంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా నిండుతుండగా... మరింత మంది ఆశావహులు సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో కొత్తగా 33 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య 295కు చేరి అత్యధిక విద్యా సంస్థలతో అతి పెద్ద సొసైటీగా నిలిచింది. వచ్చే వారం నుంచి డిగ్రీ కాలేజీలు షురూ... రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 16కు చేరనుంది. కొత్తగా ప్రారంభించనున్న డిగ్రీ కాలేజీలకు భవనాలను గుర్తించిన అధికారులు మిగతా ఏర్పాట్లలో బిజీ అయ్యారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేకాధికారులుగా పదవీ విరమణ పొందిన కాలేజీ ప్రిన్స్పాళ్లు, సీనియర్ లెక్చరర్లను ఎంపిక చేసింది. మరోవైపు బోధన సిబ్బందిని గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో ఎంపిక చేస్తోంది.అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 15వ తేదీతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది. వచ్చే వారంలో అడ్మిషన్లు పూర్తి చేసిన వెంటనే తరగతులు ప్రారంభిస్తామని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు ‘సాక్షి’కి వెల్లడించారు. -
తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో దసరా సెలవుల హడావుడి ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలంతా వారి తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు గురుకుల సొసైటీలు కొన్ని షరతులు విధించాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గురుకుల సొసైటీలు.. ప్రిన్సిపాళ్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. పిల్లలను గురుకులం నుంచి ఇంటికి పంపాలంటే తప్పకుండా ఆ విద్యార్థి తల్లి లేదా తండ్రి లేకుంటే సంరక్షకుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే విద్యార్థులను ఇంటికి అనుమతించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. స్నేహితులు, తోబుట్టువులు, ఇతర పరిచయస్తులతో పిల్లలను ఇంటికి అనుమతించవద్దని తేల్చిచెప్పాయి. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. విద్యార్థులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కాకుండా ఇతరులకు అప్పగిస్తే తలెత్తే పరిణామాలకు ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు స్పష్టం చేశారు. బాలికల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలను అప్పజెప్పే సమయంలో తల్లిదండ్రులు/సంరక్షకులు వచ్చినప్పటికీ వారు సరైన వ్యక్తులేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకుని రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు. దీంతో పిల్లల అప్పగింతకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. తల్లిదండ్రులు సైతం కాస్త ఓర్పుతో ఉండాలని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించే సమయంలో విద్యార్థి చదువు గురించి సైతం వివరించాలని స్పష్టం చేయడంతో టీచర్లు ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, సెలవుల అనంతరం కూడా విద్యార్థులు తిరిగి వచ్చే సమయంలో వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలని, వెంట తెచ్చుకున్న సరుకులు, సామగ్రిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సొసైటీ కార్యదర్శులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వ హాస్టళ్లకు ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓకు సంబంధిత మండలంలోని గురుకుల పాఠశాలల అకడమిక్ బాధ్యతలను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. ►మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలి. ►దీనికోసం ఎస్ఓపీలు రూపొందించాలి. ►పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్‌కూడా రూపొందించాలి. ►మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లపై ఈ అధికారులతో పర్యవేక్షణ చేయాలి. ►పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. ►ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలి. ►మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు కూడా విధివిధానాలు ఖరారుచేయాలి. ►గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు. ►టాయిలెట్లు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు. ►సిబ్బందికి, విద్యార్థులకు ఫర్నిచర్ కల్పనలో భాగంగా డెస్క్‌లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్. ►కిచెన్ ఆధునీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్. ► 55 ఇంచీల స్మార్ట్ టీవీతో పాటు క్రీడాసామగ్రి, మరియు లైబ్రరీ బుక్స్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు. ►గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు – నేడు పనులు చేయాలని సీఎం ఆదేశం. ►2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు –నేడు. ►పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►డ్రైనేజీని లింక్ చేయడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్న సీఎం. ►విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలని సీఎం ఆదేశాలు. ►ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ►ఈమేరకు ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు. ►ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత నాణ్యతతో ఉండాలని స్పష్టంచేశారు. ►హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ►హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ►క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలి. ►ఈ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ను కూడా తయారుచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. ►విలేజ్‌క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. ►హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి, భర్తీచేయాలి. ►పై నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధంచేసి తనకు నివేదించాలని ఆధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు
జ్వరంతో బాధపడుతున్న ఈ విద్యార్థి పేరు విజయ్‌కుమార్. ఆసిఫాబాద్‌లోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లలేదని.. హాస్టల్లోనే ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెబుతున్నాడు. తనతోపాటు మరో నలుగురూ జ్వరంతో బాధపడుతున్నారని అంటున్నాడు. ఇలా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఈ హాస్టల్లో ఏఎన్ఎంలు దిక్కులేరు. రాత్రిపూట తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నామని.. మరుగుదొడ్లకు సెప్టిక్ ట్యాంక్ లేక పక్కనే ఉన్న మురికికాల్వ దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు వాపోతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కిక్కిరిసి ఉన్న మెస్ గది ఇది. ఇందులో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే పాఠశాల భవనంలో ఉన్న మెదక్ డిగ్రీ బాలికల గురుకుల కళాశాలలో మరో 840 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. గురుకుల పాఠశాల విద్యార్థులు తరగతి గదిలోనే బస చేయాల్సి వస్తోంది. విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, భోజనానికి లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పారిశుధ్యలోపం కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే చాలా గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం కారణంగా ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. మరోవైపు కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజన వసతులు అందించేందుకు 267 ఎస్సీ, 162 ఎస్టీ, 292 బీసీ, 206 మైనారిటీ, 35 విద్యాశాఖ గురుకులాలను ఏర్పాటు చేసింది. ఒక్కో గురుకులంలో 480 మంది చొప్పున.. మొత్తం 4,61,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదట్లో గురుకులాలు బాగానే సాగినా తర్వాత గాడితప్పాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల విద్యార్థుల హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. పరిశుభ్రత మచ్చుకైనా కానరావడం లేదని.. అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ గురుకులంలో చూసినా ఇదే దుస్థితి ►నల్లగొండ ఎస్‌ఎల్‌బీసీలోని అనుముల ఎస్సీ బాలుర గురుకులంలో 480 మంది ఉన్నారు. వారిలో చాలా మంది జ్వరాల బారినపడి ఇళ్లకు వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అన్నం ముద్దగా ఉంటోందని, పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు, పలుచని మజ్జిగతో భోజనం పెడుతున్నారని వాపోతున్నారు. ఉదయం పెట్టే ఉప్మాలోనూ పురుగులు వస్తున్నాయని అంటున్నారు. హాస్టల్ పక్కన రేకుల షెడ్డు కింద అంతా భోజనం చేస్తున్నామని.. చీకట్లో వడ్డిస్తుండటంతో దోమలు, పురుగులు పడుతున్నాయని వాపోతున్నారు. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. అందులోనే హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో 482 మంది బాలికలు ఉన్నారు. భవనం పక్కన రేకుల షెడ్డులో కిచెన్, భోజనశాల ఉన్నాయి. మెస్ హాల్ పక్కనే మురికి కాల్వ ఉంది. దుర్వాసన, దోమల బెడదతో విద్యార్థినులు తరచూ రోగాల పాలవుతున్నారు. సమీపంలో పొలాలు ఉండటం, ప్రహరీ లేకపోవడంతో విష పురుగులు, పందులు హాస్టల్లోకి వస్తున్నాయి. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాలు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతంలో పార్ట్‌టైం ఏఎన్ఎంలు పనిచేసేవారు. గిరిజనశాఖ ఇటీవల వారిని తొలగించడంతో విద్యార్థులకు జ్వరమొస్తే చూసే దిక్కులేకుండా పోయింది. సరైన భోజనం పెట్టకపోవడం, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారినపడుతున్నామని పలు పాఠశాలల్లోని విద్యార్థినులు వాపోతున్నారు. ►కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల చుట్టూ చెట్లు, పొదలతో అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్ల వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో రాత్రిపూట విద్యార్థులు భయపడుతున్నారు. ►రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారన్న వార్తలు వస్తుండటంతో.. ఆందోళనకు గురైన పలువురు తల్లిదండ్రులు కరీ ంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలకు వచ్చారు. కొందరు విద్యార్థుల ఆరోగ్యాన్ని వాకబు చేసి వెళ్లగా.. మరికొందరు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం కనిపించింది. ►జనగామ జిల్లా జఫర్‌గఢ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో డ్రైనేజీ నీరు పాఠశాల ఆవరణలోనే నిలుస్తోంది. తాగునీటి పైపులైన్లు కూడా లీకవుతున్నాయి. ►మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లోని బాత్రూం, మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవని వాపోతున్నారు. తరగతి గదుల్లో ఐదు ఫ్యాన్లు ఉంటే నాలుగు పనిచేయడం లేదని.. దోమల బెడద ఎక్కువైందని అంటున్నారు. హాస్టల్ చుట్టూ పొదలు పెరిగాయని, ఇప్పటికే మూడుసార్లు హాస్టల్లోకి పాములు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్లో డోర్లు సరిగ్గా లేని మరుగుదొడ్లు. భయంతో అడ్మిషన్ రద్దు చేసుకుని తీసుకెళ్తున్నా.. మా కొడుకు సిద్ధార్థను బొమ్మకల్ గురుకుల పాఠశాలలో సీఈసీ మొదటి సంవత్సరంలో చేర్పించాను. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవని, భోజనం మంచిగా లేదని మా కొడుకు ఫోన్ చేసి చెప్పడంతో అడ్మిషన్ రద్దు చేసుకొని తీసుకెళ్తున్నాను. ప్రైవేట్ కాలేజీలో చేర్పించి చదివిస్తాను. – గంగాచారి, విద్యార్థి తండ్రి, కరీంనగర్ -
గురుకుల సీటు... వెరీ హాటు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగే మిగిలింది... రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సీట్లు లేవు... దయచేసి రావొద్దు... ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై సీఎం జగన్ సమీక్ష
-
పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు. స్కూళ్ల నిర్వహణ నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం.. హాస్టళ్లలో వైద్యుల సందర్శన తప్పనిసరి అన్నారు. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని, ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులపాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో విస్తృత సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో.. ► ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ► ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేపట్టాలి. ► స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కిందకు హాస్టళ్లు, గురుకులాలు ► గురుకులాలు, వసతి గృహాల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని.. సీఎం జగన్ ఆదేశించారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన స్వయంగా నేనే చేయించాను. ► మనం చేయాల్సింది చాలా ఉంది. దీనిపై ఒక కార్యాచరణ ఉండాలి. ► ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. ఈ పనులు మీవి అనుకుని పనిచేయాలి. ► ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశాం. ► మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోంది. ► సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలి. ► దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పాపానపోలేదు. అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలి. ► అభివృద్ధి పనులు చేశాక.. వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలి. దీనిమీద ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలి. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి... సీఎం జగన్ ► హాస్టళ్ల నిర్వహణకోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచండి. ► పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి: ► మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో.. అలాంటి వసతులే ఉండాలి. ► పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ► స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయండి: ► ప్రతి హాస్టల్లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి : ► హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్ల వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి: ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. ► డైట్ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్ ఛార్జీలను పెంచాలి. సమూలంగా డైట్ ఛార్జీలు పరిశీలించి.. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ ఛార్జీలను పెంచింది. అప్పటివరకూ హాస్టల్ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రభుత్వం అలాంటిది కాదు అని సీఎం జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. హాస్టళ్లలో నాడు–నేడు అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం జగన్.. వాటి నిర్వహణను కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ఇంకా.. ► వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం. ► మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ► ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ► అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలని.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు తాము అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించేలా ఉండాలని సీఎం జగన్, అధికారులతో చెప్పారు. ► ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్న సీఎం జగన్.. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
ఎక్కడ అనుమతిస్తే.. అక్కడే
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను ఇష్టానుసారంగా నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంజూరైన నియోజకవర్గాల పరిధిలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొంది. గురుకుల పాఠశాలలను ఒక చోట మంజూరు చేస్తే మరో ప్రదేశంలో నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు సంబంధించి దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఒకటి బాలికలది కాగా, మరొకటి బాలుర గురుకులం. వీటిని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్వహించాలి. ఈ మేరకు గురుకుల పాఠశాలల మంజూరు సమయంలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్దేశిస్తారు. కానీ ప్రస్తుతం మూడువంతుల గురుకుల విద్యా సంస్థలను అనుమతించిన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలు దొరక్క.. రాష్ట్రంలో దాదాపు వెయ్యి సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 820 గురుకుల పాఠశాలలు కాగా, వీటిలో మూడోవంతు పాఠశాలలకు అనుబంధంగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవికాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను విడతలవారీగా మంజూరు చేయగా.. వాటికి భవనాలను నిర్మించే వరకు అద్దె భవనాల్లో కొనసాగించాలని సూచించింది. దీంతో గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిబంధనలకు అనుగుణంగా భవనాలను వెతికినప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతాల్లో తగిన భవనాలు లభించక.. మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు ఏర్పాటు చేశారు. భవనాల లభ్యత ఉన్న చోటనే అద్దెకు తీసుకుని అక్కడే గురుకులాలను ప్రారంభిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పెద్ద భవనాలున్న చోట రెండు, మూడు, నాలుగు.. గురుకుల పాఠశాలలను ఒకే క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పాఠశాల మంజూరు చేసిన ప్రాంతం దాటి దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఫిర్యాదులతో.. స్పందించిన సర్కారు అనేక చోట్ల ఆయా నియోజకవర్గాల పరిధి దాటి వీటిని ఏర్పాటు చేయడంతో స్థానికతకు ప్రాధాన్యతమిస్తూ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా.. అనుమతించిన ప్రాంతంలోనే గురుకుల పాఠశాలలను నిర్వహించాలని స్పష్టం చేసింది. రెండురోజుల కిందట రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో సమావేశమై లొకేషన్ల అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఎక్కడ మంజూరు చేస్తే అక్కడే గురుకులాన్ని నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాలను గుర్తించి వెంటనే అక్కడికి మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇతర గురుకుల సొసైటీల్లోనూ ఇదే తరహాలో ఆదేశాలు ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
గురుకులాలపై ‘గురి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చదివేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టే విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మరింత అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సాంఘిక సంక్షేమ శాఖ దృష్టి సారించింది. విద్యా బోధనలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఎక్కువ శిక్షణ అవసరమైన బోధన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ టైమ్ టేబుల్‌ను మారుస్తోంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరగతులను వర్గీకరించబోతున్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు.. తగిన మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో మరిన్ని సీట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటర్ సెకండియర్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి.. వారందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను సిద్ధం చేసేందుకు వీలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అన్ని స్థాయిల్లో విద్యా బోధనను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మేలైన బోధన అందిస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలపై పేద వర్గాలకు నమ్మకం కుదిరింది. ఈ సందర్భంలో మా వంతు బాధ్యతగా విద్యార్థులకు మరింత మేలైన విద్యా బోధన అందించేందుకు చర్యలు చేపట్టాం. గురుకుల జూనియర్ కాలేజీల్లో గతంలో ఇంటర్ సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేయాలని ఆదేశించాం. రాష్ట్రంలోని కొన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలపై కూడా దృష్టి సారించి పరిష్కరిస్తున్నాం. ఇకపై గురుకులాలను సందర్శించి వాటికి మరింత ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటా. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
తెలంగాణలో కొత్తగా 33 గురుకులాలు.. 15 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థుల కోసం కొత్తగా గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త గురుకులాల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ తదితర అంశాలపై బుధవారం మంత్రి తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో 33 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కొత్తగా 4 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 115 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే ఉందని, మరో 15 డిగ్రీ కాలేజీలనుఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిని మంత్రి గంగుల ఆదేశించారు. ఈ డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిధ్యంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు కొత్త వాటిని ప్రవేశపె ట్టాలని, పారిశ్రామిక రంగం అవసరాల మేరకు వాటితో అనుసంధానం చేయా లని చెప్పారు. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ వంటి కోర్సులను కాలేజీల వారీగా ప్రవేశపెట్టాలని సూచించారు. వీటి ద్వారా విద్య పూర్తి చేసుకొనే తరుణంలో గురుకుల సొసైటీ ద్వారానే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించాలని, ఈ మేరకు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మరో 21 బీసీ స్టడీ సర్కిళ్లు:రాష్ట్రంలో మరో 21 బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఏకసంఘంగా ఏర్పడిన కులాలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కొత్తగా మరో ఆరు కులా లు ఏక సంఘంగా ఏర్పడ్డాయని వీటికి ఈ నెల 8న నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ఏకసంఘంగా ఏర్పడని వాటిని సైతం త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. -
AP: ఆ విద్యార్థులకు అలర్ట్.. 20వ తేదీలోగా చేరాలి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం పొందాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. 20వ తేదీ తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. -
బాలల్లో సంకల్పబలం ఉండాలి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): సమాజానికి మంచి చేయాలన్న సంకల్పబలం బాలల్లో ఉండాలని, అందుకోసం కష్టపడి చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్ ఆకాంక్షించారు. మంగళవారం ఆమె ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహాన్ని (జువెనైల్ హోం) సందర్శించారు. గృహంలో ఉన్న బాలలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశాలమైన ప్రపంచంలో అనేక అవకాశాలున్నాయని, బెయిల్‌పై బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాలలు పెరిగిన వాతావరణం, అక్కడి పరిస్థితుల ప్రభావంతో జరిగిన చిన్నచిన్న ఘటనల కారణంగా ఇక్కడికి వచ్చారని అన్నారు. వారికి ఇక్కడ ఇస్తున్న కౌన్సెలింగ్‌తో చాలా మార్పు వచ్చిందన్నారు. బెయిల్ పూచీకత్తు అంశాన్ని జేజేసీ దృష్టికి తీసుకెళ్తా తమకు బెయిల్ మంజూరు అయినప్పటికీ పూచీకత్తు, నగదు జమ చేయలేని పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులున్న కారణంగా ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందని పలువురు బాలలు మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో చలించిపోయిన ఆమె.. ఈ అంశాన్ని తాను జువెనైల్ జస్టిస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు. వారిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైల్డ్ లైన్ 1098 ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. బాలల సంస్కరణల సేవలు జాయింట్ డైరెక్టర్ బీడీవీ ప్రసాదమూర్తి, పరిశీలనా గృహం సూపరింటెండెంట్ టి.మధుసూధనరావు, మహిళా శిశు సంక్షేమ పీడీ ఉమాదేవి పాల్గొన్నారు. -
గురుకులాలపై పటిష్ట పర్యవేక్షణ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఉత్సవ విగ్రహాల్లా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. కొన్ని గురుకుల పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలను పరిష్కరించడానికి, నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి అధికారులు తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేలా గురుకుల విద్యా సంస్థల టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. 6 ఉమ్మడి జిల్లాల్లో రూ.94.3 కోట్లతో క్రీడా ప్రతిభా కేంద్రాలను నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బాలురకు బాక్సింగ్, తూర్పుగోదావరి జిల్లా తునిలో బాలికలకు విలు విద్య, కృష్ణా జిల్లా కృష్ణారావుపాలెంలో బాలురకు అథ్లెటిక్స్, ప్రకాశం జిల్లా పెదపావనిలో బాలికలకు అథ్లెటిక్స్, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో బాలురకు కబడ్డీ, వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్‌లో బాలికలకు ఫెన్సింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నాయక్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాలు.. డిజిటల్ చదువులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన పక్కాగా నిర్వహిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే విడతల వారీగా తరగతులను డిజిటలీకరిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం(2022–23) పూర్తయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధనే జరుగుతుందన్నారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 281 గురుకుల పాఠశాలల్లో 1,696 తరగతులు డిజిటలైజ్ అవుతాయన్నారు. శుక్రవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్(మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) బోర్డు సమావేశం మంత్రి గంగుల అధ్యక్షతన జరిగింది. 2022–23లో సొసైటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. గురుకుల పాఠశాలల్లో డిజిటలైజేషన్ 100 శాతం చేయాలన్న నిర్ణయంపై బోర్డు తీర్మానించింది. అలాగే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు వేడినీటి వసతి కల్పన కోసం టీఎస్ రెడ్కో ద్వారా సోలార్ వాటర్ హీటర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాఠశాలల నిర్వహణ పక్కగా జరిగేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి వాఖ్యానించారు. అకడమిక్ సెల్‌ను తీర్చిదిద్దాలని, అంతర్గత ఆడిట్ బృందాలను మరింత బలపర్చాలన్నారు. ఇదిలా ఉండగా, ‘గురుకులం.. దూరాభారం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై మంత్రి స్పందించారు. గురుకులాల నిర్వహణకు తీసుకునే అద్దె భవనాలతో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
గురుకులం దూరాభారం
ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్‌లో ఉంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ)కు చెందిన మూడు మహిళా డిగ్రీ కాలేజీలు ఈ ఒక్క భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ మూడూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బుద్వేల్, హైదరాబాద్ జిల్లా మహేంద్రహిల్స్‌లో ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. గురుకుల సొసైటీ మాత్రం ఈ మూడింటినీ ఆయా ప్రాంతాలకు దూరంగా, అంకుషాపూర్‌లోని ఒక మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ ఫొటోలోని భవనం శామీర్‌పేటలో ఉంది. ఇక్కడ జగద్గిరిగుట్ట ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిని గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో నిర్వహించగా.. అక్కడ అద్దె భవనం విషయంలో నెలకొన్న సమస్యతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కాలేజీని సుదూర ప్రాంతానికి తరలించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భవనంలో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో రెండు నెలల క్రితం విద్యార్థినులు నిరసనలకు దిగారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా వసతులు కల్పించిన సొసైటీ అధికారులు.. ఈ వ్యవహారం రోడ్డెక్కినందుకు కాలేజీలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల గురుకుల కళాశాల. జిల్లాలోని కోడేరు గురుకుల పాఠశాలలో హాస్టల్ వసతులు సరిపోక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడికి తరలించారు. బైపీసీలో 40 మంది, సీఈసీలో 40 మంది చొప్పున విద్యార్థులను తరలించడంతో విద్యార్థులు తరగతుల్లో కిక్కిరిసి కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే అదే పాఠశాల ఆరో తరగతికి చెందిన రెండు సెక్షన్లను వసతులు లేక అధికారులు నాగర్‌కర్నూల్ పాఠశాలకు తరలించారు. దీంతో కరోనా సమయంలోనూ తరగతి గదుల్లో ఒక్కో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ హాస్టల్లోనూ రద్దీ పెరిగి ఒకే గదిలో 40 మంది వరకు విద్యార్థులు సర్దుకొని ఉండాల్సి వస్తోంది. అంతేగాకుండా మరుగుదొడ్లు, స్నానాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు. కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు. అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే స్థాయిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే వీటికి పక్కాగా భవనాలు నిర్మించి, సరైన విధంగా మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇక్కడి గురుకులం మరెక్కడో ♦రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు. ♦ హైదరాబాద్ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. ♦రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమిన్‌పేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్లోనే నిర్వహిస్తున్నారు. -
ఎస్సీ గురుకుల టీచర్ల ఉద్యమబాట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ప్యానల్ ఇన్స్పెక్షన్ దుమారం సృష్టిస్తోంది. బోధన సిబ్బంది పనితీరును మదింపు చేసేందుకు తలపెట్టిన ప్యానల్ ఇన్స్పెక్షన్పై సొసై టీ పరిధిలోని టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతానికి ఈ ఇన్స్పెక్షన్లను నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంతి కొప్పుల ఈశ్వర్‌ను కలసిన ఉపాధ్యాయ సంఘ నేతలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమబాట పట్టారు. జనవరి రెండో తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరంచేయాలని భావిస్తున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో బోధన కార్యక్రమాలు గందరగోళంలో పడ్డాయి. జూన్ ఒకటిన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం నెలరోజులు ఆలస్యం కాగా, ప్రత్యక్ష తరగతులు నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతామనడంతో సొసైటీ పాఠశాలల్లో అలజడి మొదలైంది. ఏమిటి ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్.. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలో 268 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 30 డిగ్రీ కాలేజీలు ఉండగా.. మిగతా వాటిలో 238 పాఠశాలలు, జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యా సంస్థల్లోని బోధన సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో నిపుణులను నియమించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఇటీవల పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు. ఈ కమిటీ సభ్యులు ప్రతి పాఠశాలను అకస్మికంగా సంద ర్శిం చి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా పిల్లల స్థితి, పరీక్షల్లో వచ్చిన మా ర్కు లు, భావ వ్యక్తీకరణ.. తదితర అంశాలపై క్షుణ్ణం గా సమీక్షించి ఆయా సబ్జెక్టు టీచర్లకు మార్కులు వేస్తారు. దీంతో టీచర్ల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతుంది. పనితీరు అధ్వాన్నంగా ఉంటే వారిపై చర్యలకు సిఫారసు చేసే వీలుంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉండగా.. తాజాగా కొత్త పద్ధతిలో నిర్వహించేందుకు సొసైటీ కార్యాచరణ రూపొందించింది. ఎందుకు వ్యతిరేకత.. ప్రస్తుతం ప్యానల్ ఇన్‌స్పెక్షన్‌ను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. గిరిజన గురుకుల సొసైటీలలో కూడా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాచారం. కాగా, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో అమలు చేసే ప్యానల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియను ప్రస్తుత విద్యా సం వత్సరానికి మాత్రమే వాయిదా వేయా లని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2021–22 విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభం కాగా, అక్టోబర్ నెలాఖరు వరకు ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగింది. ఈ నేపథ్యంలో పిల్లల సామర్థ్యాన్ని సాకుగా చూపి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.కృష్ణారెడ్డి, ప్రభుదాస్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఇన్‌స్పెక్షన్‌ను ఈ ఏడాది మాత్రమే వాయిదా కోరుతున్నామని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బాలరాజ్ పేర్కొన్నారు. -
చిన్నారి డాక్టర్లు.. గురుకులాలకు వీళ్లే కేర్టేకర్లు
సాక్షి, హైదరాబాద్: గురుకులంలో ప్రతి తరగతికి ఓ ‘డాక్టర్’! విద్యార్థి ఆరోగ్య స్థితిపై కన్నేసి ఉంచడం, జలుబు, జ్వరం, దగ్గులాంటి స్వల్ప అస్వస్థత అయినా సరే గుర్తించి వెంటనే క్లాస్ టీచర్, పాఠశాల హెల్త్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లడం వీరి కర్తవ్యం. డాక్టర్ అంటే నిజంగా ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న అనుభవజ్ఞుడైన డాక్టర్ కాదండోయ్.. గురుకులంలోని ఓ విద్యార్థే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) తన పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని మరింత శ్రద్ధగా పర్యవేక్షించే క్రమం లో ప్రయోగాత్మకంగా ‘చిన్నారి డాక్టర్’కార్యక్రమా న్ని చేపట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం గురుకుల పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా.. ప్రస్తుతం అది సత్ఫలితాలు ఇస్తున్నట్టు సొసైటీ అధికారులు చెబుతున్నారు. నిత్యం మరింత శ్రద్ధగా..: టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ పరిధిలో 269 గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో 5నుంచి 10 వరకు తరగతులు, ప్రతి క్లాసుకు రెండు సెక్షన్ల చొప్పున మొత్తం పన్నెండు సెక్షన్లుంటాయి. ఒక్కో గురుకులంలో గరిష్టంగా 480 మంది విద్యార్థులుంటారు. అయితే ఒక పాఠశాలకు ఒక హెల్త్ సూపర్వైజర్ పోస్టును మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కరిపైనే ఎక్కువ భారం పడొద్దని భావించిన అధికారులు సొసైటీకి అనుబంధంగా కొనసాగుతున్న పనేషియా ప్రాజెక్టు సహకారంతో చిన్నారి డాక్టర్ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. చిన్నారి డాక్టర్ కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్య స్థితిని నిత్యం మరింత శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యాన్ని ముం దుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకా శాలు తక్కువగా ఉంటున్నాయని, కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రయోగం మరింతగా సత్ఫలితాలనిస్తోందని వివరించారు. త్వరలో కోవిడ్ కట్టడికో బృందం కోవిడ్–19 వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ పాఠశాలల్లో అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి పాఠశాలకు ఒక కోవిడ్–19 వర్క్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సొసైటీ విద్యార్థుల ఆరోగ్య స్థితిపై నిఘా వేసి ఉంచే పనేషియా ప్రాజెక్ట్ హెడ్ సామర్ల కిరణ్‌కుమార్ తాజాగా కోవిడ్–19 వర్క్ టీమ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శి ఆమోదం పొందిన వెంటనే ప్రతి పాఠశాలలో నలుగురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పీఈటీతో పాటు ఇద్దరు టీచర్లు, హెల్త్ సూపర్వైజర్ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలు గమనించడం, కోవిడ్ ప్రొటోకాల్ అమలు చేయడం వీరి బాధ్యత అని అధికారులు చెబుతున్నారు. -
గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి: కేఎన్వీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవడంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు మాత్రమే కరోనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. -
‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శనివారం తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్ళితో సహా మిగిలిన పాఠశాలల్లో 2021– 22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభంకాగా, ఈనెల 30 వరకు ‘హెచ్‌టీటీపీఎస్.ఏపీఆర్ఎస్. ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్’ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలవారీగా కలెక్టరు కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా జూలై 14న అర్హులను ఎంపిక చేస్తారు. ప్రవేశానికి అర్హత.. ఓ.సీ, బీ.సీలకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31మధ్య పుట్టి ఉండాలి. ∙ఎస్సీ, ఎస్టీలు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. ∙అభ్యర్థులు జిల్లాలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు చదివి ఉండాలి. ∙ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. ∙అభ్యర్థి తల్లి, తండ్రి, సంరక్షకుల 2020–21 ఆర్థిక సంవత్సరాదాయం రూ .1,00,000 మించరాదు. -
ఎదురులేని ఏకలవ్యులు!
సాక్షి, అమరావతి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.. గిరిపుత్రులు. క్రీడల్లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలు ఇస్తున్న ప్రత్యేక శిక్షణను అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. గిరిజన విద్యార్థులు సహజంగానే కొండకోనల్లో పుట్టి పెరగడం, చిన్ననాటి నుంచి వాటిని ఎక్కిదిగడం వల్ల వారి శరీరం క్రీడలకు అనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ వారికి మంచి ప్రోత్సాహమందిస్తూ చక్కటి శిక్షణ ఇప్పిస్తోంది. వ్యాయామం నుంచి యోగా వరకు.. ప్రస్తుతం రాష్ట్రంలో 190 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 51,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 370 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాలలో సుమారు వందమందికిపైగానే విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూళ్లకు ఒక ఫిజికల్ డైరెక్టర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. వీటిలో పాఠాలతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రోజూ ఉదయం 5.30 నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటల వరకు వ్యాయామం, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 15, నవంబర్ 14న స్పోర్ట్స్, గేమ్స్ పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు అందిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గాలనే లక్ష్యంతో అరకు స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. ఈ నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నా. – నినావత్ నరసింహ నాయక్, వెయిట్‌లిఫ్టర్ మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం.. గిరిజన విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే వారి ప్రతిభ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపుతున్నారు. క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. – కె శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విశాఖపట్నం జిల్లా అరకు స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ పేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయిలో అండర్–14 జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అతడు ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని సాధించి అదరగొట్టాడు. గత నెలలో కేరళలో జరిగిన జాతీయ సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా బంగారు పతకాన్ని ఒడిసిపట్టాడు. స్పోర్ట్స్ స్కూల్లో ఇస్తున్న శిక్షణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తూరు బయలుకు చెందిన నందకిశోర్‌ది పేద గిరిజన వ్యవసాయ కుటుంబం. అరకు క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అతడు లాంగ్‌జంప్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. 2019లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఈ ఏడాది అసోంలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. ప్రత్యేక ఆకర్షణగా అరకు క్రీడా పాఠశాల ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేసిన గురుకుల క్రీడా పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వారి ఆసక్తిని బట్టి విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, రగ్బీ, వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం మొత్తం ఏడుగురు కోచ్‌లు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 10వ తరగతి వరకే ఉండటం వల్ల అండర్–14లో మాత్రమే విద్యార్థులు పాల్గొంటున్నారు. త్వరలోనే జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసి అండర్–16, అండర్–18లో కూడా పతకాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ పీఎన్ఎన్ మూర్తి తెలిపారు.