పాణ్యంలో ఉపాధ్యాయుడు లేని తరగతి గది
రాష్ట్రంలో గిరిజన విద్యార్థులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. వారి సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో నాణ్యమైన విద్య లభించక గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కన్వర్టెడ్ గిరిజన గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం వీటిపై శీతకన్ను వేయడంతో సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి.
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామంటూ రెండేళ్ల క్రితం 80 ఎస్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఇవి పేరుకు మాత్రమే గిరిజన గురుకుల పాఠశాలలు. వాస్తవానికి అక్కడ గురుకుల విద్యా విధానమే లేదు. వాటిని పరిశీలిస్తే.. సంక్షేమ హాస్టళ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి. ఈ 80 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుగా పిలుస్తోంది.
బోర్డుపైనే గురుకులం.. లోపల అధ్వానం
గతంలో ఉన్న సంక్షేమ హాస్టల్ భవనాల్లోనే గురుకుల స్కూళ్లు అంటూ కొత్తగా బోర్డులు పెట్టి నడుపుతున్నారు. సంక్షేమ హాస్టల్ అంటే.. విద్యార్థుల వసతి కోసం ఏర్పాటు చేసింది. బయట స్కూళ్లలో బోధిస్తారు. ఇప్పుడు వసతి కోసం ఏర్పాటు చేసిన గదిలోనే ఉపాధ్యాయులు క్లాసులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ మినహా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులంతా ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులైనవారే. తరగతి గది, పడక గది ఒక్కటే కావడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం.
ఇబ్బందులెన్నో..
కన్వర్టెడ్ గురుకులాల్లో కొత్తగా వార్డెన్ పోస్టులు వచ్చాయి. హాస్టళ్లు రద్దు కావడంతో వార్డెన్లు నేరుగా తమ సిబ్బంది, విద్యార్థులతో ప్రభుత్వం చెప్పిన మేరకు కన్వర్టెడ్ గురుకులాలకు చేరారు. వార్డెన్లు, సిబ్బంది పిల్లల భోజనం, వసతి సౌకర్యాలను చూస్తారు. ప్రస్తుతం వీరు ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు బోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై ఉపాధ్యాయులను నియమించింది. అయితే ఉపాధ్యాయులకు వసతి కల్పించకపోవడంతో వారు బయట అద్దె ఇళ్లళ్లో ఉంటున్నారు. విద్యార్థులకు విద్యనందించే బాధ్యత గురుకుల విద్యాలయ సంస్థది కావడం, భోజనం, వసతి సౌకర్యాల బాధ్యత ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులది కావడంతో వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. వీరి మధ్య వివాదాలతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
సీఎం మాటకే దిక్కు లేదు
సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలు, సమీక్ష సమావేశాల్లో 80 గిరిజన గురుకుల స్కూళ్లకు కొత్తగా భవనాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే నిర్మాణాలు మొదలుపెట్టాల్సిందిగా పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయితే పరిస్థితి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉంది. అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే నిర్మాణాలు మొదలవుతాయని, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని పాతపాటే పాడుతున్నారు.
తరగతి గది, పడక గది ఒక్కటే..
విలీన గురుకులాల్లో మొదటి సంవత్సరం మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించారు. గతేడాది ఇక్కడ ఉన్న, బయట నుంచి వచ్చిన అర్హులైన విద్యార్థులతో పాఠశాలల స్థాయిని 6వ తరగతికి పెంచారు. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పదో తరగతి వరకు పెంచుతారు. ఇక రద్దు కాగా మిగిలిన 30 గిరిజన వసతి గృహాల్లో ఉండి చదువుకునే 7, 8, 9, 10 తరగతుల వారికి అక్కడే వసతి కల్పించి, ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. వాస్తవానికి వసతి గృహాలను 100 మంది విద్యార్థులకు సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఇంతకంటే ఎక్కువ మంది చేరిన చోట పరిస్థితి దారుణంగా ఉంది. మళ్లీ ఈ హాస్టళ్లలోనే గురుకుల పాఠశాలల విద్యార్థులకు 4 గదులు ఇచ్చి మిగిలినవి 7 నుంచి 10 తరగతుల వారికి ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఒకరోజైతే పర్వాలేదు. సంవత్సరాల తరబడి సర్దుకోమంటే ఎలా అని విద్యార్థులు వాపోతున్నారు. తెనాలిలోని బాలుర పాఠశాలలోని 54 మంది విద్యార్థులకు 4 గదులు ఇవ్వగా, బాలికల పాఠశాలలో 96 మందికి 4 గదులిచ్చి సరిపెట్టారు. చిలకలూరిపేటలోని బాలుర పాఠశాలలోని 140 మంది 4 గదుల్లో ఉంటున్నారు. ఇక రేపల్లెలోని బాలుర పాఠశాలలో 67 మంది తలదాచుకుంటున్నారు. వీరికి పగలు ఆ గదులలోనే తరగతులు నిర్వహిస్తుండగా రాత్రికి నివాసం కూడా అక్కడే ఉండాల్సిన దుస్థితి. మిగిలిన గదులు వంటకు, ప్రిన్సిపాల్‌కు, స్టోర్, భోజనశాల, వార్డెన్ గదిగా ఉపయోగిస్తున్నారు. అంటే వీటి కోసం సుమారు 5 గదులు వాడుతున్నారు. ఇంకా మిగిలిన వాటిని 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల వసతికి ఇచ్చారు.
గురుకుల పాఠశాల ఉండాల్సింది ఇలా..
గురుకుల విద్యాలయం అంటే అక్కడే విద్యార్థుల విద్యాభ్యాసానికి తరగతి గదులతోపాటు ఉపాధ్యాయులు నివసించేందుకు క్వార్టర్స్ కూడా ఉండాలి. విద్యార్థులకు వసతి కోసం గదులు, భోజనం చేసేందుకు భోజనశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కనీసం రెండెకరాల ఆటస్థలం ఉండాలి. మొత్తం 20 నుంచి 25 ఎకరాల స్థలంలో గురుకుల విద్యాలయ భవనం ఉండాలి. కానీ ప్రభుత్వం వీటిలో వేటినీ పట్టించుకోలేదు. గురుకుల స్కూల్ నిర్వహణ తీరుతెన్నులపై ప్రైవేట్ ఏజెన్సీతో ఒక అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇంకా ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించలేదు.
80 స్కూళ్ల తరగతులు గచ్చుమీదే..
గుంటూరు జిల్లా రేపల్లె, స్టువర్టుపురం, తెనాలి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, వినుకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, ఉయ్యూరు, విస్సన్నపేట, నందిగామ, కొండపల్లి, మైలవరంలతోపాటు ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 80 గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క తరగతి గదిలోనూ విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో గచ్చుమీదనే విద్యార్థులు కూర్చోవాల్సిన దుస్థితి. ఏజెన్సీ ప్రాంతంలో హాస్టళ్లను రద్దు చేసి ఏర్పాటు చేసిన 30 ఆశ్రమ పాఠశాలలు మరీ దారుణంగా ఉన్నాయి. వాటికి కనీసం కాపౌండ్ గోడలు కూడా లేవు. దీంతో పాములు, తేళ్లు, ఇతర వన్యజీవులు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి.
ఒకేసారి హాస్టళ్ల రద్దుతో ఇబ్బందులు నిజమే..
గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఒకేసారి పూర్తిగా రద్దు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. దీనివల్ల విద్యార్థులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, ఉపాధ్యాయులు సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ప్రత్యామ్నాయాలు చూసుకుని గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ఉంటే బాగుండేదని తర్వాత గుర్తించాం. ఆ దృష్ట్యా అధ్యయన కమిటీని నియమించాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం. కొత్త భవనాల నిర్మాణాలకు స్థలసేకరణ జరుగుతోంది. త్వరలోనే భవన నిర్మాణాలను చేపడతాం.
– ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ
ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి
మా పాఠశాలలో మంచినీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయకపోవటంతో పలువురు విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి.
– మల్లా అంజి, పదో తరగతి విద్యార్థి, పీటీజీ పాఠశాల, విజయపురిసౌత్, గుంటూరు జిల్లా
ఈ చిత్రం.. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల మరుగుదొడ్ల దుస్థితికి నిదర్శనం. ఈ పాఠశాలలో మొత్తం 279 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ పరిశుభ్రతను గాలికొదిలేశారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటికి తలుపులు కూడా సరిగా లేవు. తరగతి గదుల పక్కనే కుళ్లిన చెత్త దర్శనమిస్తోంది. గదుల నిండా బూజు, చెత్తాచెదారం అధికంగా ఉంది. పిల్లలు అపరిశుభ్రంగా, చిరిగిన వస్త్రాలతోనే తరగతులకు హాజరవుతున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో విద్యార్థినులను పట్టించుకునేవారు కరువయ్యారు. కొందరు ఉపాధ్యాయులు తరగతులకు గైర్హాజరు అవుతున్నా అడిగేవారే లేరు.
ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు.. భూమిక. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు తనకు స్కూల్ యూనిఫాం, చున్నీ ఇవ్వలేదని వాపోతోంది. పాఠశాలకు ప్రహరీ లేదని, దీంతో పాఠశాల ఆవరణలోకి విష పురుగులు వస్తున్నాయని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment