ఎదురులేని ఏకలవ్యులు! | Special training in sports in tribal gurukul schools | Sakshi
Sakshi News home page

ఎదురులేని ఏకలవ్యులు!

Published Thu, Mar 11 2021 4:58 AM | Last Updated on Thu, Mar 11 2021 4:58 AM

Special training in sports in tribal gurukul schools - Sakshi

సాక్షి, అమరావతి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.. గిరిపుత్రులు. క్రీడల్లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలు ఇస్తున్న ప్రత్యేక శిక్షణను అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. గిరిజన విద్యార్థులు సహజంగానే కొండకోనల్లో పుట్టి పెరగడం, చిన్ననాటి నుంచి వాటిని ఎక్కిదిగడం వల్ల వారి శరీరం క్రీడలకు అనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ వారికి మంచి ప్రోత్సాహమందిస్తూ చక్కటి శిక్షణ ఇప్పిస్తోంది. 

వ్యాయామం నుంచి యోగా వరకు.. 
ప్రస్తుతం రాష్ట్రంలో 190 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 51,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 370 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాలలో సుమారు వందమందికిపైగానే విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూళ్లకు ఒక ఫిజికల్‌ డైరెక్టర్‌ చొప్పున ప్రభుత్వం నియమించింది. వీటిలో పాఠాలతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రోజూ ఉదయం 5.30 నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటల వరకు వ్యాయామం, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 15, నవంబర్‌ 14న స్పోర్ట్స్, గేమ్స్‌ పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు అందిస్తున్నారు. 

వెయిట్‌ లిఫ్టింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధిస్తా
జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం నెగ్గాలనే లక్ష్యంతో అరకు స్పోర్ట్స్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. ఈ నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొంటున్నా.
– నినావత్‌ నరసింహ నాయక్, వెయిట్‌లిఫ్టర్‌

మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం.. 
గిరిజన విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే వారి ప్రతిభ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపుతున్నారు. క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ ఉంటుంది. 
– కె శ్రీకాంత్‌ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ

విశాఖపట్నం జిల్లా అరకు స్పోర్ట్స్‌ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పవన్‌ కుమార్‌ పేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయిలో అండర్‌–14 జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అతడు ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన నేషనల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని సాధించి అదరగొట్టాడు. గత నెలలో కేరళలో జరిగిన జాతీయ సౌత్‌ జోన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఏకంగా బంగారు పతకాన్ని ఒడిసిపట్టాడు. స్పోర్ట్స్‌ స్కూల్లో ఇస్తున్న శిక్షణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతున్నాడు. 

విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తూరు బయలుకు చెందిన నందకిశోర్‌ది పేద గిరిజన వ్యవసాయ కుటుంబం. అరకు క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అతడు లాంగ్‌జంప్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. 2019లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి అండర్‌–14 పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. అలాగే ఈ ఏడాది అసోంలో జరిగిన నేషనల్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. 

ప్రత్యేక ఆకర్షణగా అరకు క్రీడా పాఠశాల
ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేసిన గురుకుల క్రీడా పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వారి ఆసక్తిని బట్టి విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, రగ్బీ, వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం మొత్తం ఏడుగురు కోచ్‌లు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 10వ తరగతి వరకే ఉండటం వల్ల అండర్‌–14లో మాత్రమే విద్యార్థులు పాల్గొంటున్నారు. త్వరలోనే జూనియర్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేసి అండర్‌–16, అండర్‌–18లో కూడా పతకాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పీఎన్‌ఎన్‌ మూర్తి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement