sports school
-
ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్ వేటు
-
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్, శామీర్‌పేట: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హరికృష్ణ స్థానంలో ఇన్చార్జ్ ఓఎస్డీగా సుధాకర్ రావును నియమించారు. లైంగిక వేధింపుల ఆరో పణలపై నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యు లతో కూడిన కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్పోర్ట్స్) శైలజా రామయ్యర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్‌చైర్మన్, ఎండీ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యు లు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పోర్ట్స్ స్కూల్లోని బాలికలు, సిబ్బందిని వేర్వేరు గా విచారించారు. పాఠశాలతోపాటు బాలికల హాస్టల్లోని సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. విచారణ ముగిశాక ఈ కమిటీ నివేదికను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు అందించనుంది. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. కాగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ట్వీట్ చేశారు. ఓఎస్డీని వెళ్లొద్దంటూ కారుకు అడ్డుగా నిలిచిన బాలికలు సస్పెండ్ అయిన హరికృష్ణను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వెళ్లొద్దంటూ కొందరు బాలికలు కారుకు అడ్డుగా నిలిచారు. మీరు లేకుంటే స్కూల్ అభివృద్ధి జరగదని, మీరు ఎలాంటి తప్పు చేయలేదని క్యాంపస్‌లోనే ఉండాలంటూ వారు భావోద్వేగానికి లోనయ్యారు. -
హకీంపేట ఘటనపై హరికృష్ణ స్పందన
-
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి
-
వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి,వైఎస్సార్ కడప: క్రీడలపై ఆసక్తి ఉన్న చిన్నారుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు మంచి వేదికగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. నాలుగు, ఐదు తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు. తొలుత మండల స్థాయిలో పోటీలు నిర్వహించి విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ మధ్యలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలుంటాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి.. విద్యార్థులను ఎంపిక చేస్తారు. మండల, జిల్లా పోటీల తేదీలను ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశముంది. ఎంపిక విధానమిలా.. తొలుత మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థి ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగుపందెంలో 15 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 8 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికలను డీఎస్ఏ ఆధ్వర్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, 6గీ10 షటిల్రన్, మెడిసిన్ బాల్‌ఫుట్‌లో 21 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 11 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌లతో కలిపి మొత్తం 27 పాయింట్లకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో 14 పాయింట్లకు పైగా సాధించాలి. బాలురకు 20, బాలికలకు 20 నాలుగవ తరగతిలో ప్రవేశాలకు 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు కేటాయించారు. కోవిడ్ వల్ల 2020–21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది 5వ తరగతికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. 5వ తరగతిలో కూడా 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన విద్యార్థులకు 10 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్‌లో నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇక్కడి విద్యార్థులు ఏటా పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఎవరు అర్హులంటే.. 4వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 1–8–2012 నుంచి 31–7–2013 మధ్యలో పుట్టినవారై ఉండాలి. 5వ తరగతిలో చేరాలనుకునే వారు 1–8–2011 నుంచి 31–7–2012 మధ్యలో జన్మించినవారై ఉండాలి. బర్త్ సర్టిఫికెట్, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్, 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఎంపిక ప్రదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడమంటే చక్కటి భవిష్యత్‌కు బాట వేయడమే. అన్ని రకాల వసతులు, విద్యతో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో శిక్షణ అందిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ రామచంద్రారెడ్డి, ప్రత్యేకాధికారి, డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల, కడప చదవండి: సాగర తీరం.. సుందర దృశ్యం -
విధి ఆట.. గెలుపు బాట
ఆ ఇద్దరు బాలికలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. సొంతవారు అండగా నిలవలేదు. బాలసదన్‌లో ఆశ్రయం పొందారు. ఆ చిన్నారుల జీవితాల్లో క్రీడలు వెలుగులు నింపాయి. భవిష్యత్ జీవితానికి బంగారు బాటలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐసీడీఎస్, కోచ్‌లు, అందించిన సహకారంతో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఈనెల 29వ తేదీన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి,నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వెంకటాచలం మండలంలోని మనుబోలు గ్రామంలో రమేష్, అంజమ్మ దంపతులు జీవించేవారు. వీరికి శృతి, పల్లవి పిల్లలు. ఏరోజు కారోజు కూలీ పనులు చేస్తే తప్ప గడవని జీవితాలు వాళ్లవి. ఈ నేపథ్యంలో 2013 సంవత్సరంలో రమేష్, అంజమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అమ్మానాన్న చనిపోవడంతో శ్రుతి, పల్లవి అనాథలయ్యారు. కొందరు వారిని నెల్లూరులో ఐసీడీఎస్ బాలసదన్‌లో చేర్చారు. అక్కాచెల్లెళ్లు అప్పటి నుంచి అక్కడే ఉంటూ చదువులు ప్రారంభించారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం చదువుకుంటూ క్రీడల్లో రాణించాలంటే స్పోర్ట్స్ స్కూల్స్ ఉపయోగపడతాయని కోచ్ సుకుమార్ 2017లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్స్ సెలక్షన్స్‌కు శృతిని పంపారు. రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించిన చిన్నారి కడపలోని డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో చేరింది. రెండేళ్ల శిక్షణ అనంతరం అక్కడి కోచ్‌లు ఫుట్‌బాల్ క్రీడకు శృతి బాగా సరిపోతుందని గుర్తించారు. బాలికలకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం శృతి అక్కడ 8వ తరగతి చదువుతోంది. చెల్లెలు పల్లవి స్కూల్లో గేమ్స్‌లో రాణిస్తోంది. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాళెం కస్తూర్బా బాలికల విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఊహతెలియని వయసులోనే సర్వం కోల్పోయినా మనోధైర్యంతో అటు క్రీడల్లో, ఇటు చదువుల్లో అక్కాచెల్లెళ్లు రాణిస్తున్నారు. కోచ్ గుర్తించడంతో.. కొంతకాలానికి అక్కాచెల్లెళ్లు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కు హాజరయ్యారు. బాలికల్లో చురుకుదనాన్ని ఖోఖో కోచ్ సుకుమార్ గుర్తించారు. వారి పరిస్థితులను ఆరాతీశారు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌కు రావడం, బాలికల్లోని ఆసక్తిని గమనించిన కోచ్ వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. బాలభవన్ అధికారులతో సంప్రదించి క్రీడల్లో రాణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో శృతి స్కూల్ స్థాయి, జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో రాణించడం మొదలుపెట్టింది. కోచ్ సుకుమార్ ఆమెకు క్రీడా దుస్తులు, పరికరాలు, పుస్తకాల కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చారు. ఖోఖో అసోసియేషన్ నాయకులు కె.గురుప్రసాద్, విజయకుమార్, గిరిప్రసాద్ తదితరులు శృతికి సాయం చేశారు. భారత జట్టులో స్థానం సాధిస్తా గురువులు ఇచ్చిన సహకారంతో క్రీడల్లో మెళకువలు నేర్చుకుంటున్నా. దేశం తరఫున ఆడాలని ఉంది. పెద్దలు సహాయం చేస్తున్నారు. మంచి ఉద్యోగం సాధించి నాలాంటి పదిమందికి అండగా నిలుస్తాను. డీఎస్ఏ, ఐసీడీఎస్ అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ మరువలేనిది. - శృతి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిభను గుర్తించడం వల్లే.. సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్నప్పుడే శృతి, పల్లవిలోని ప్రతిభను గుర్తించాం. తల్లిదండ్రుల్లేని పిల్లలు కావడంతో చాలామంది సహాయం చేశారు. ఇప్పటికీ బాలసదన్ అధికారులు చూపిస్తున్న ఆదరాభిమానాలు గొప్పవి. దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా వీరు తయారవుతారు. – సుకుమార్, ఖోఖో కోచ్ చదవండి: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్ -
ఎదురులేని ఏకలవ్యులు!
సాక్షి, అమరావతి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.. గిరిపుత్రులు. క్రీడల్లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలు ఇస్తున్న ప్రత్యేక శిక్షణను అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. గిరిజన విద్యార్థులు సహజంగానే కొండకోనల్లో పుట్టి పెరగడం, చిన్ననాటి నుంచి వాటిని ఎక్కిదిగడం వల్ల వారి శరీరం క్రీడలకు అనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ వారికి మంచి ప్రోత్సాహమందిస్తూ చక్కటి శిక్షణ ఇప్పిస్తోంది. వ్యాయామం నుంచి యోగా వరకు.. ప్రస్తుతం రాష్ట్రంలో 190 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 51,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 370 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాలలో సుమారు వందమందికిపైగానే విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూళ్లకు ఒక ఫిజికల్ డైరెక్టర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. వీటిలో పాఠాలతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రోజూ ఉదయం 5.30 నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటల వరకు వ్యాయామం, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 15, నవంబర్ 14న స్పోర్ట్స్, గేమ్స్ పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు అందిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గాలనే లక్ష్యంతో అరకు స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. ఈ నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నా. – నినావత్ నరసింహ నాయక్, వెయిట్‌లిఫ్టర్ మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం.. గిరిజన విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే వారి ప్రతిభ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపుతున్నారు. క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. – కె శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విశాఖపట్నం జిల్లా అరకు స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ పేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయిలో అండర్–14 జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అతడు ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని సాధించి అదరగొట్టాడు. గత నెలలో కేరళలో జరిగిన జాతీయ సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా బంగారు పతకాన్ని ఒడిసిపట్టాడు. స్పోర్ట్స్ స్కూల్లో ఇస్తున్న శిక్షణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తూరు బయలుకు చెందిన నందకిశోర్‌ది పేద గిరిజన వ్యవసాయ కుటుంబం. అరకు క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అతడు లాంగ్‌జంప్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. 2019లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఈ ఏడాది అసోంలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. ప్రత్యేక ఆకర్షణగా అరకు క్రీడా పాఠశాల ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేసిన గురుకుల క్రీడా పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వారి ఆసక్తిని బట్టి విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, రగ్బీ, వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం మొత్తం ఏడుగురు కోచ్‌లు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 10వ తరగతి వరకే ఉండటం వల్ల అండర్–14లో మాత్రమే విద్యార్థులు పాల్గొంటున్నారు. త్వరలోనే జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసి అండర్–16, అండర్–18లో కూడా పతకాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ పీఎన్ఎన్ మూర్తి తెలిపారు. -
త్వరలో స్పోర్ట్స్ స్కూల్‌పై సమీక్ష
హైదరాబాద్: హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్)లో మౌలిక వసతుల కల్పనపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్పోర్ట్స్స్కూల్లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావడం క్రీడాకారుల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. క్రీడలతో పాటు చదువులోనూ ఏకాగ్రత చూపించాలని ఆయన విద్యార్థులను కోరారు. సింథటిక్ ట్రాక్, ఫుట్‌బాల్ గ్రౌండ్, స్విమ్మింగ్‌పూల్‌తో పాటు స్పోర్ట్స్ స్కూల్లో అవసరమయ్యే సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మరో 15 రోజుల్లో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 10 జీపీఏ సాధిస్తే రూ. 25 వేలు ఇస్తా: మంత్రి మల్లారెడ్డి పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధిస్తే రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని ఏ క్రీడా పాఠశాల లేనంత విశాలంగా 200 ఎకరాల్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఉందన్న ఆయన స్థానిక మంత్రిగా స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో పాఠశాల అభివృద్ధికి కోటి రూపాయల నిధులు కేటాయిస్తానని మాట ఇచ్చానని, అందులో భాగంగా రూ. 25 లక్షలు మంజూరు చేశానని తెలిపారు. మిగిలిన నిధులు త్వరలోనే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను సన్మానించి, ట్రాక్ సూట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, శాట్స్ ఎండీ దినకర్‌బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్లో ఇండోర్ స్టేడియం షురూ
సాక్షి, హైదరాబాద్: హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ సోమవారం స్టేడియాన్ని ప్రారంభించారు. కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం అత్యాధునిక హంగులతో తయారైంది. దీనితో పాటు 3 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం జాతీయ స్థాయిలో సత్తా చాటుతోన్న స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సన్మానించారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రూ. 15 లక్షల విలువ చేసే ట్రాక్ సూట్లను క్రీడాకారులకు అందజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్‌పూల్‌ను స్కూల్ ప్రాంగణంలో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఒంగోలు: వైఎస్సార్ కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల, విజయనగరంలోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో 2018–19 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యనిర్వహణాధికారి, చీఫ్ కోచ్ ఆర్కే యతిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2017–18 విద్యా సంవత్సరంలో మూడో తరగతి పూర్తిచేసి ఉండాలన్నారు. 2018 మే 31 నాటికి 8 సంవత్సరాలు నిండిన (2009 జూన్ 1 నుంచి 2010 మే 31 మధ్య జన్మించిన) విద్యార్థులు మాత్రమే ప్రవేశానికి అర్హులు. ఎంపికకు హాజరయ్యేటపుడు మీసేవ లేదా మున్సిపాల్టీ ద్వారా పొందిన పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలన్నారు. దీంతో పాటు ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన విద్యాపత్రం, 5 పాస్‌పోర్టు సైజుఫోటోలు తప్పక వెంట తీసుకురావాలన్నారు. 18, 19 తేదీల్లో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, 22వ తేదీ స్థానిక డాన్‌బాస్కో స్కూలులో ఉదయం 8 గంటలకు ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన వారు ఈనెల 26, 27 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలకు హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి ఎంపిక: ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగుపందెం, 800 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6 – 10 మీటర్ల షటిల్ రన్ విభాగాల్లో ఎంపిక ఉంటుంది. జిల్లా స్థాయి ఎంపిక: ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6 – 10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్‌త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ విభాగాల్లో నిర్వహిస్తారు. జిల్లాలోని తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, జిల్లా ఒలంపిక్ సంఘం, సంబంధిత పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు పొల్గొనదలచిన విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. పూర్తి వివరాల కోసం 9440581700 నెంబర్‌ను సంప్రదించాలని చీఫ్ కోచ్ ఆర్కే యతిరాజ్ పేర్కొన్నారు. -
సార్లొస్తే కొత్త అల్లుళ్లమే..
► స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ► కడప స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి విజయవాడ స్పోర్ట్స్: ‘సార్... మా స్పోర్ట్స్ స్కూల్‌ను తనిఖీ చేయడానికి మీలాంటి సార్లొస్తే ఆ రోజుకు మేము కొత్తగా అత్తారింటికి వచ్చిన అల్లుళ్లమైపోతాం. కొత్త అల్లుళ్లు అత్త గారి ఇంటికొస్తే ఎలా చూస్తారో అలా చూస్తారు. పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు సార్. ఆ తరువాత మీరు వెళ్లిపోతే మా పరిస్థితి దారుణం. సరైన భోజనం పెట్టరు. మమ్మల్ని సరిగా పట్టించుకోరు. మొన్నటికి మొన్న శాప్ ఓఎస్డీ రామకృష్ణ గారు వచ్చారు. మమ్మల్ని భలేగా చూసుకున్నారు సార్. ఆ తరువాత మళ్లీ మామూలే. పరిగెడదామంటే సరైన ట్రాక్ ఉండదు. పలుగువేసి దిగేసినా ఆ ట్రాక్‌లో దిగదు. ఎగుడు దుగుడు ట్రాక్‌పై పరిగెత్తాలంటే మా యాంకిల్పోతోంది సార్. ట్రాక్ షూట్లు, స్పైక్‌లు, క్రీడా వస్తువులు ఇవ్వరం’టూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల్లో అథ్లెట్లకు ఏర్పాటు చేసిన సమ్మర్ రెసిడెన్షియల్ క్యాంపులో ఓ విద్యార్థి రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంపును ఆయన సందర్శించారు. క్యాంపు గురించి ఆరా తీస్తున్న ఆయనకు వైఎస్సార్ జిల్లా కడప స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి (అథ్లెట్) వివేకానంద అక్కడ పరిస్థితులను వివరించారు. దీనికి స్పందించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం కడప స్పోర్ట్స్ స్కూల్ ఇన్చార్జి సరిగా పనిచేయకపోతే సస్పెండ్ చేయాలని ఓఎస్డీ రామకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం క్యాంపులో పాల్గొన్న అథ్లెట్లతో ఫొటోలు దిగారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి క్రీడాకారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏకాగ్రతతో సాధన చేస్తే విజయవరిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. క్యాంపు కోచ్ డీఎన్వీ వినాయక ప్రసాద్‌ను అభినందించారు. కార్యక్రమానికి కళాశాల పీడీ నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పీ రామకృష్ణ, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్S కార్యదర్శి ఏవీ రా«ఘవేంద్ర, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు, శాప్, అసోసియేషన్ కోచ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రాఘవేంధ్ర , ఇతర సభ్యులు, కోచ్‌లు ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్ డిగ్రీ అందించేందుకు సిద్ధం ప్రతిగల క్రీడాకారులకు స్పోర్ట్స్ డిగ్రీ కోర్సు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర లయోల కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ అన్నారు. చైనా, క్యూబా దేశాల్లో మాదిరిగా క్రీడాకారులకు ప్రత్యేక సిలబస్‌తో విద్యనందిస్తే విద్యార్థులకు ఉపయోగమని చెప్పారు. దీనిపై జూన్ మొదటి వారంలో సమావేశమవుదామని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
క్రీడా పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
► విజయనగరం విజ్జి మైదానంలో రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల ► గంట్యాడ మండలం తాడిపూడిలో జల క్రీడాశాల ఏర్పాటు ► జూన్ నుంచి 350 మంది క్రీడాకారులకు తరగతులు ప్రారంభం విజయనగరం మున్సిపాలిటీ: విద్యకు నిలయమైన విజయనగరం జిల్లాలో క్రీడా పాఠశాల, జల క్రీడా శాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పాలనాపరమైన ఆమోదం లభించగా... వాటి ఏర్పాటుపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రీజనల్ క్రీడా పాఠశాలను విజయనగరం పట్టణ శివారులోని విజ్జిస్టేడియంలోను, జల క్రీడాశాలను గంట్యాడ మండల తాటిపూడి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల.. విజ్జి స్టేడియం వేదికగా రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయి. అందులో రూ.20 కోట్ల నిధుల విడుదలకు పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. క్రీడాపాఠశాల ఏర్పాటు ప్రాజెక్టును గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ విభాగం రూపకల్పన చేస్తోంది. ఆ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సదరు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు విజ్జిలో పర్యటించనున్నారు. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న మొత్తం 350 మంది విద్యార్థులకు ఈ పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. తరగతులను వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌నెల) లోనే ప్రారంభించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతుల నిర్వహణకు ఓ భవనం.... వారు వసతి ఉండేందుకు మరో భవనంను ముందస్తుగా విజ్జి స్టేడియం సమీపంలో అద్దెకు తీసుకునే యోచనలో ఉన్నారు. తాటిపూడి వద్ద జల క్రీడాశాల.. జిల్లా కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని గంట్యాడ మండలం తాడిపూడి వద్ద జల క్రీడా శాల ఏర్పాటుకు పాలనాపరమైన ఆమోదం లభించింది. తాటిపూడి జలశయాన్ని దీనికోసం వినియోగించుకోనున్నట్టు సమాచారం. శిక్షణ పొందగోరే విద్యార్థులకు వసతి, తరగతులు కోసం భవనాల నిర్మాణాల కోసం తొలివిడతగా రూ.3కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇదే విషయాన్ని డీఎస్డీఓ ఎన్.సూర్యారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా... రూ.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన క్రీడా పాఠశాల కోసం తొలివిడతగా రూ.20 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. పాఠశాలలో 350 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
క్రీడోదయం
ఫలితాన్నిచ్చిన టాలెంట్ హంట్ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ తొలిసారిగా జిల్లా నుంచి 25మంది ఎంపిక స్పోర్ట్స్ స్కూళ్లతో క్రీడాకారులకు మహర్దశ జిల్లా స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ హంట్ మంచి ఫలితానిచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన చిన్నారి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది స్పోర్ట్స్ స్కూల్‌కు జిల్లా నుంచి పది కంటే తక్కువగానే ఎంపికయ్యేవారు. కానీ ఈ సారి ఏకంగా 25మంది చిన్నారులు ఎంపికయ్యారు. – మహబూబ్‌నగర్ క్రీడలు జిల్లా గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల్లో సత్తాచాటారు. ఈ ఏడాది తొలిసారిగా 25మంది పాలమూరు విద్యార్థులు రాష్ట్రంలోని హకీంపేట (హైదరాబాద్), కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలలకు ఎంపికై సంచలనం సృష్టించారు. 25 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి 4, 5 తరగతుల్లో ప్రవేశం పొందారు. వీరిలో 15మంది విద్యార్థులు ఆదిలాబాద్ స్కూల్‌కు ఎంపికయ్యారు. 20మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొందారు. వీరికి ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో చదువుతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. మూడేళ్ల పాటు ఫెక్సిబిలిటీ కింద శిక్షణ అందజేసి అనంతరం వారు ఎంచుకున్న క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. ఫలించిన టాలెంట్‌హంట్.. కలెక్టర్ టీకే శ్రీదేవి సహకారంతో తెలంగాణలో ఎక్కడాలేని విధంగా డీఎస్డీఓ టీవీఎల్ సత్యవాణి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్లో ఒక తండాను ఎంపిక చేసుకుని ప్రత్యేకంగా టాలెంట్ హంట్‌ను నిర్వహించారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో టాలెంట్ హంట్‌తో క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను వెలికితీశారు. వీరికి ముందుగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికల్లో నిర్వహించే ఎత్తు, బరువు, మెడిసిన్ బాల్ త్రో, షటిల్ రన్, 30 మీటర్ల రన్, షార్ట్ జంపింగ్ తదితర అంశాల్లో ఎంపికలు నిర్వహించి జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు.. స్పోర్ట్స్ స్కూల్ (ఆదిలాబాద్) 4వ తరగతిలో.. మహేశ్వరి (ఖిల్లాఘనపురం), భానుప్రియ (పదర), సింధు (నర్సాయిపల్లి), సవిత (లింగంపల్లి), మోనేశ్వరి (కొల్లంపల్లి), వినోద్ (లింగంపల్లి), నిఖిల్‌గౌడ్ (ముట్పూర్), రాంచరణ్ (బిజినేపల్లి), 5వ తరగతిలో.. పావని (ఉప్పునుంతల), బాలమణి (లింగంపల్లితండా). శ్రీధర్ (టంకర), గోవర్ధన్ (బెక్కం), సాయివరుణ్ (మహబూబ్‌నగర్), భానుప్రకాశ్‌గౌడ్ (కొండూర్), తరుణ్‌కుమార్‌రెడ్డి (ఖిల్లాఘనపురం). స్పోర్ట్స్ స్కూల్ (హైదరాబాద్) 4వ తరగతిలో.. జయ (కొల్లంపల్లి), అరుణశ్రీ (మద్దూర్), హిమబిందు (మానాజిపేట), అర్చన (బొల్గట్‌పల్లి), సహస్ర (బాలానగర్). 5వ తరగతిలో.. రాము (వెల్కిచర్ల). రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ (కరీంనగర్) 4వ తరగతిలో.. సుప్రజ (చిన్నచింతకుంట), ముడావత్ అనూష (తాడూర్), రాకేశ్ (పెనిమిళ్ల), శివమణి (బాలానగర్). స్పోర్ట్హాస్టల్ ద్వారా రాణించిన జిల్లా క్రీడాకారులు స్పోర్ట్ హాస్టల్లో ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. జిల్లాకు చెందిన అథ్లెట్ శంకర్ జిల్లాస్థాయి నుంచి హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఖిల్లాఘనపూర్కు చెందిన నవత సెపక్‌తక్రాలో ఏషియన్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. వీరితో పాటు భారతి, లలిత, అంజలి, సరిత, పాండు, స్వప్న, నరేశ్, హారిక, రామునాయక్, రాములు, గోపాల్, లక్ష్మిరాం స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటూ ఆయా క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. 50మంది ఎంపికయ్యేలా లక్ష్యం.. – సత్యవాణి, డీఎస్డీఓ జిల్లాలోని గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం ఉంది. దానిని వెలికితీస్తే మంచి క్రీడా ఆణిముత్యాలు వస్తారు. కలెక్టర్ సహకారంతో టాలెంట్ హంట్‌ను నిర్వహించాం. మూడు స్పోర్ట్స్ స్కూళ్లలకు 25 మంది క్రీడాకారులు ఎంపికకావడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని టాలెంట్ హంట్లు నిర్వహించి 50మంది ఎంపికయ్యేలా లక్ష్యంగా శిక్షణ అందజేస్తాం. -
స్పోర్ట్స్ స్కూల్‌కే టైటిల్
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా ఫుట్‌బాల్ టోర్నమెంట్లో స్పోర్ట్స్ స్కూల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సరూర్‌నగర్‌లోని వి.ఎం. హోమ్ మైదానంలో బుధవారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో స్పోర్ట్స్ స్కూల్ జట్టు 1-0తో గ్లెన్డేల్ అకాడమీపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో గ్లెన్డేల్ అకాడమీ 8-7తో డీపీఎస్, నాచారంపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో స్పోర్ట్స్ స్కూల్ 2-1తో ఓక్రిడ్జ్ స్కూల్‌పై నెగ్గింది. -
జిల్లా నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక
విశాఖపట్నం: కడప వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లోని నాలుగవ తరగతిలో ప్రవేశాలకు బాలుర విభాగంలో 24 మంది, బాలికల విభాగంలో 15 మందిని జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. ఈనెల 27న జరగనున్న రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు వీరంతా హాజరుకానున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి ఎంపికైన వీరంతా ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈనెల 25న మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా క్రీడాభివద్ధి సంస్థ వద్ద హాజరుకావాలని డి.ఎస్.డి.ఓ. జూన్ గాల్యట్ కోరారు. ఆధార్‌కార్డు, వయస్సు ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్లతో పాటు 20 పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. బి.భాస్కరరావు, శ్యామ్, హేమంత్, పూర్ణసాయి, పూర్ణచందు, శేషు, పి.భాస్కరరావు, జి.రోహిత్, ఎం.రోహిత్, కాసువంత్, హేమ్‌చరణ్, హరీష్, అనిల్, చరణ్‌తేజ్, నాయుడు, తేజ, బి.రోహిత్, సాయికుమార్, ప్రవీణ్‌సాయి, పి.అనిల్‌కుమార్, ఆకాష్, పి.రాజేష్, ఎస్.గౌతమ్, కె.కిరణ్ బాలుర విభాగంలో ఎంపికయ్యారు. కె.దేవి, పి.రామలక్ష్మి, వసంత, దేవి, పూజిత, హేమవర్షిణి, శ్రావణి, కె.దేవి, సాయిలత, లావణ్య, దేవమణి, రమ్య, అనురాధ, దీపిక, రిచిత బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ఎంపికైన వారిలో ఉన్నారు. -
ఆట.. అడ్డదారి!
సాక్షి, కడప/ కడప స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయంగా కొందరు, పైరవీలు చేస్తూ మరికొందరు సీటు కోసం చక్రం తిప్పుతున్నారు. ఏకంగా కేంద్ర మంత్రుల నుంచి ఫోన్లు వస్తుంటే ఒత్తిడి భరించలేక ఓ అధికారి నాలుగు రోజుల పాటు సెల్‌ఫోన్ ఆఫ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎలాగోలా సీటు దక్కించుకుంటే ఇంటర్ వరకు అన్ని ఖర్చులు పాఠశాల యాజమాన్యమే భరించడంతో పాటు క్రీడల్లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు భావిస్తుండటం వల్లే డిమాండ్ ఏర్పడింది. సెలక్షన్స్‌పై ఉత్కంఠ క్రీడా పాఠశాలకు ఎంపికైతే క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పడినట్లే. కడప నగరంలో ఉన్న వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 40 సీట్లు (బాలురు20, బాలికలు20) ఉంటాయి. తొలుత మండల, ఆపై జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వారిలోంచి అర్హులైన వారిని ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ఎంపిక చేస్తారు. ఈ ఎంపికకు ఒక్కో జిల్లా నుంచి బాలికల విభాగంలో ఎనిమిది, బాలుర విభాగంలో ఎనిమిది.. మొత్తం 16 మంది హాజరు కానున్నారు. ఈ లెక్కన 13 జిల్లాల నుంచి 208 మంది బాలబాలికలు ఫైనల్ సెలక్షన్స్‌కు హాజరు కానున్నారు. వీరిలో ప్రతిభ కనపరిచిన 40 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. పోటీ ఎక్కువగా ఉండటంతో పలువురు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఓ కేంద్ర మంత్రి నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. ఎంపికలకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు గతేడాది సెలక్షన్స్‌లో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ ఏడాది అత్యున్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్‌గా శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, మెంబర్ కన్వీనర్‌గా క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి యాదవ్, మెంబర్లుగా శాప్ ఎండీ రేఖారాణి, జిల్లా కలెక్టర్ కే.వి.రమణ, ఓఎస్డీ నాగరాజు, శాప్ డెరైక్టర్లు హనుమంతరావు, సత్తి గీత, రవీంద్రబాబు, డి.జయచంద్ర వ్యవహరిస్తారు. క్రీడా పాఠశాల కోచ్‌లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కోచ్‌లను ఈ ఎంపిక ప్రక్రియకు నియమించారు. నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహిస్తాం మాకు ఏ రాజకీయ నాయకుడు, ప్రజా ప్రతినిధి నుంచి ఎటువంటి ఒత్తిడి రాలేదు. క్రీడా పాఠశాల ఎంపికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం. శాప్ చైర్మన్, సభ్యులు, ఎండీ, జిల్లా కలెక్టర్ తదితరులతో కూడిన అత్యున్నత కమిటీ ఈ ఎంపికలను పర్యవేక్షిస్తుంది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు వదంతులు, దళారులను నమ్మవద్దు. ఈ నెల 27న రాయలసీమ జిల్లాల క్రీడాకారులకు, 28న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, 29న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల క్రీడాకారులకు ఫైనల్ సెలక్షన్స్ పోటీలు నిర్వహిస్తున్నాం. - రుద్రమూర్తి యాదవ్, క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి, కడప -
సిబ్బంది 20 మంది.. హాజరైన పిల్లలు 10 మంది !
శ్రీకాకుళం న్యూకాలనీ:జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం జరిగిన స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలకు స్పందన కరువైంది. వైఎస్సాఆర్ కడప జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లాస్థాయి బాలబాలికల ఎంపికల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏకంగా 20 మంది వ్యాయామ ఉపాధ్యాయులను సిబ్బందిగా నియమించారు. ఈ ఎంపికలకు కేవలం పది మంది చిన్నారులే హాజరయ్యారు. వీరిలో కూడా బాలికలు లేరు. ఇవే ఎంపికలకు గత ఏడాది సుమారు 80 మంది హాజరయ్యారు. 29న రాష్ట్రస్థాయి ఎంపికలు ఎంపికలకు హాజరైన చిన్నారులకు వయసు, బరువు, ఎత్తులతోపాటు స్టాండింగ్ బ్రాడ్‌జంప్, వెర్టికల్ జంప్, మెడిసినల్‌బాల్, 30 మీటర్లు, 800 మీటర్ల పరుగు విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఎంపికైన పిల్లలు జాబితాను త్వరలో వెల్లడిచేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికైన పిల్లలు ఈనెల 29వ తేదీన కడపలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధిస్తారని డీఎస్డీవో బి.శ్రీనివాసకుమార్ వెల్లడించారు. ఎంపికల కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, వెంకటరమణ, ఎస్.సూరిబాబు, వాసుదేవాచారి, ఎమ్మెస్సీ శేఖర్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కుటుంబం నుంచి...
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు సాధించిన శిరీష స్వస్థలం వైఎస్సార్ కడప జిల్లా, వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామం. తండ్రి వెంకట శివారెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. తల్లి పేరు వెంకటలక్ష్మి. స్వతహాగా క్రీడాభిమాని అయిన తండ్రి... అమ్మాయిని క్రీడాకారిణిని చేయాలని భావించారు. అందుకే హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో శిరీషను చేర్పించారు. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో శిరీష రాణించి ఇప్పుడు కామన్వెల్త్లో విజేతగా నిలిచింది. కోచ్‌ల శిక్షణలో... స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం తీసుకున్నప్పుడు ఆరంభంలో శిరీష జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే అక్కడి కోచ్‌లు ఎస్ఏ సింగ్, మాణిక్యాలరావు ఆమెలో ప్రతిభను గుర్తించి వెయిట్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించారు. పాఠశాల స్థాయిలో పలు విజయాలు సాధించిన అనంతరం శిరీష, జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జార్ఖండ్‌లో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ (యూత్) చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జూనియర్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈ ఏడాది ఉత్తర కొరియాలో జరిగిన ఏషియన్ కప్‌లో 3 రజత పతకాలు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా విజయం ఆమె కెరీర్లో అత్యుత్తమమైందిగా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న శిరీష, ప్రత్యేక అనుమతితో స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ కొనసాగిస్తోంది. ‘మా అమ్మాయి ఏదైనా క్రీడలో భారత్‌కు ఆడేలా చూడాలనేది నా కోరిక. ఇప్పుడు జూనియర్ స్థాయిలో ఆమె ఇలాంటి విజయాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో సీనియర్ విభాగంలోనూ రాణించాలని కోరుకుంటున్నాను’ - శివారెడ్డి, శిరీష తండ్రి -
రూ.32 కోట్లతో స్పోర్ట్స్స్కూల్!
సంగారెడ్డి లేదా తడ్కపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం శాప్‌కు ప్రతిపాదనలు పంపిన అధికారులు తొలివిడత 200 మంది విద్యార్థులకు అవకాశం సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: క్రీడాభిమానులు, క్రీడాకారులకు శుభవార్త. జిల్లాస్థాయిలో స్పోర్ట్స్స్కూల్ త్వరలో ఏర్పాటు కానుంది. రూ.32 కోట్ల వ్యయంతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారులు స్టోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్)కు ఇటీవలే ప్రతిపాదనలు పంపించారు. సంగారెడ్డి లేదా, సిద్దిపేట సమీపంలోని తడ్కపల్లిలో జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు శాప్‌కు అందజేశారు. పైకా(పంచాయత్ యువ క్రీడాఔర్ ఖేల్ అభియాన్) ఈ స్కూల్ ఏర్పాటుకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరినాటికి మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్పోర్ట్స్ స్కూల్ జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు చోటు కల్పించి వారికి సంబంధిత క్రీడల్లో శిక్షణ ఇప్పించనున్నారు. తొలి విడత 200 మందికి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత దశలవారీగా విద్యార్థుల సంఖ్య వెయ్యి వరకు పెంచనున్నట్లు సమాచారం. ఎంపికైన విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలతోపాటు స్టోర్ట్స్ స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు విద్యాభాస్యం కల్పిస్తారని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి పైకా కృషి చేస్తోంది. ఇంతవరకు జిల్లాస్థాయిలో నాలుగు పర్యాయాలు పైకా క్రీడలు జరిగాయి. క్రీడలను మరింత అభివృద్ధి చేయటంతోపాటు గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా జిల్లాస్థాయిలో అన్ని వసతులు, సౌకర్యాలతో స్పోర్ట్స్స్కూల్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అధికారుల సమాచారం ప్రకారం రూ.32 కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్స్కూల్ ఏర్పాటు చేస్తారు. ఔట్‌డోర్ స్టేడియం, ఇండోర్ స్టేడియాలతోపాటు స్పోర్ట్స్ హాస్టల్ నిర్మిస్తారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుకునేందుకు వీలుగా స్పోర్ట్స్ స్కూల్‌కు అనుబంధంగా విద్యాసంస్థను ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పైకా క్రీడాపోటీల్లో ఎంపికైన విద్యార్థులను స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశం కల్పిస్తారు. క్రీడాకారుల కోసం అవసరమైన కోచ్‌లు, పీఈటీల నియామకం చేపడతారు. సంగారెడ్డికి దక్కే అవకాశం? జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో గతంలో స్టోర్ట్స్ స్కూల్ నిర్వహించారు. హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ ఇలా పలు క్రీడాంశాల్లో స్పోర్ట్స్ స్కూల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. దీంతో గతంలో మాదిరిగానే సంగారెడ్డిలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అవకాశం ఉంది. స్పోర్ట్స్‌స్కూల్‌కు అవసరమైనంత ప్రభుత్వ స్థలం సంగారెడ్డి సమీపంలోని తాళ్లపల్లిలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డిసెంబర్‌లోగా నిర్ణయం రావచ్చు జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి శాప్‌కు ప్రతిపాదనలు అందజేసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి హరనాథ్ తెలిపారు. పైకా ద్వారా జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. రాష్ర్టస్థాయిలో తొలివిడతగా 8 జిల్లాలకు అవకాశం కల్పిస్తున్నారని, అందులో మెదక్ జిల్లాకు అవకాశం దక్కనుందన్నారు. డిసెంబర్‌లోగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం వెలువడవచ్చని తెలిపారు.