
సాక్షి, హైదరాబాద్: హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ సోమవారం స్టేడియాన్ని ప్రారంభించారు. కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం అత్యాధునిక హంగులతో తయారైంది. దీనితో పాటు 3 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం జాతీయ స్థాయిలో సత్తా చాటుతోన్న స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సన్మానించారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రూ. 15 లక్షల విలువ చేసే ట్రాక్ సూట్లను క్రీడాకారులకు అందజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్‌పూల్‌ను స్కూల్ ప్రాంగణంలో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment