ఒంగోలు: వైఎస్సార్ కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల, విజయనగరంలోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్‌లో 2018–19 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యనిర్వహణాధికారి, చీఫ్ కోచ్ ఆర్‌కే యతిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2017–18 విద్యా సంవత్సరంలో మూడో తరగతి పూర్తిచేసి ఉండాలన్నారు. 2018 మే 31 నాటికి 8 సంవత్సరాలు నిండిన (2009 జూన్ 1 నుంచి 2010 మే 31 మధ్య జన్మించిన) విద్యార్థులు మాత్రమే ప్రవేశానికి అర్హులు.
ఎంపికకు హాజరయ్యేటపుడు మీసేవ లేదా మున్సిపాల్టీ ద్వారా పొందిన పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలన్నారు. దీంతో పాటు ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన విద్యాపత్రం, 5 పాస్‌పోర్టు సైజుఫోటోలు తప్పక వెంట తీసుకురావాలన్నారు. 18, 19 తేదీల్లో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, 22వ తేదీ స్థానిక డాన్‌బాస్కో స్కూలులో ఉదయం 8 గంటలకు ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన వారు ఈనెల 26, 27 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా ఎంపికలకు హాజరవ్వాల్సి ఉంటుందన్నారు.
మండల స్థాయి ఎంపిక: ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగుపందెం, 800 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6 – 10 మీటర్ల షటిల్ రన్ విభాగాల్లో ఎంపిక ఉంటుంది.
జిల్లా స్థాయి ఎంపిక: ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6 – 10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్‌త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ విభాగాల్లో నిర్వహిస్తారు. జిల్లాలోని తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, జిల్లా ఒలంపిక్ సంఘం, సంబంధిత పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు పొల్గొనదలచిన విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. పూర్తి వివరాల కోసం 9440581700 నెంబర్‌ను సంప్రదించాలని చీఫ్ కోచ్ ఆర్‌కే యతిరాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment