వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ | Ysr Sports School Admission Notification For 4 And 5 Class | Sakshi
Sakshi News home page

Ysr Sports School: పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Published Thu, Sep 30 2021 11:26 AM | Last Updated on Thu, Sep 30 2021 1:26 PM

Ysr Sports School Admission Notification For 4 And 5 Class - Sakshi

సాక్షి,వైఎస్సార్‌ కడప: క్రీడలపై ఆసక్తి ఉన్న చిన్నారుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు మంచి వేదికగా నిలిచిన డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. నాలుగు, ఐదు తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌) ఆధ్వర్యంలో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు. తొలుత మండల స్థాయిలో పోటీలు నిర్వహించి విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు.

అక్టోబర్‌ 6 నుంచి 10వ తేదీ మధ్యలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలుంటాయి. అక్టోబర్‌ 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి.. విద్యార్థులను ఎంపిక చేస్తారు. మండల, జిల్లా పోటీల తేదీలను ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశముంది.

ఎంపిక విధానమిలా..
తొలుత మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థి ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్, 800 మీటర్ల పరుగుపందెంలో 15 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 8 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికలను డీఎస్‌ఏ ఆధ్వర్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, 6గీ10 షటిల్‌రన్, మెడిసిన్‌ బాల్‌ఫుట్‌లో 21 పాయింట్లకు ఎంపికలు నిర్వహిస్తారు. 11 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఎత్తు, బరువుతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, వర్టికల్‌ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌లతో కలిపి మొత్తం 27 పాయింట్లకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో 14 పాయింట్లకు పైగా సాధించాలి.

బాలురకు 20, బాలికలకు 20
నాలుగవ తరగతిలో ప్రవేశాలకు 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు కేటాయించారు. కోవిడ్‌ వల్ల 2020–21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది 5వ తరగతికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. 5వ తరగతిలో కూడా 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన విద్యార్థులకు 10 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్‌లో నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇక్కడి విద్యార్థులు ఏటా పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

ఎవరు అర్హులంటే..
4వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 1–8–2012 నుంచి 31–7–2013 మధ్యలో పుట్టినవారై ఉండాలి. 5వ తరగతిలో చేరాలనుకునే వారు 1–8–2011 నుంచి 31–7–2012 మధ్యలో జన్మించినవారై ఉండాలి. బర్త్‌ సర్టిఫికెట్, స్టడీ అండ్‌ కాండక్ట్‌ సర్టిఫికెట్, 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఎంపిక ప్రదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి
వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడమంటే చక్కటి భవిష్యత్‌కు బాట వేయడమే. అన్ని రకాల వసతులు, విద్యతో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో శిక్షణ అందిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి.
  – డాక్టర్‌ రామచంద్రారెడ్డి, ప్రత్యేకాధికారి, డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాల, కడప 

చదవండి: సాగర తీరం.. సుందర దృశ్యం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement