సంగారెడ్డి లేదా తడ్కపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం
శాప్‌కు ప్రతిపాదనలు పంపిన అధికారులు
తొలివిడత 200 మంది విద్యార్థులకు అవకాశం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: క్రీడాభిమానులు, క్రీడాకారులకు శుభవార్త. జిల్లాస్థాయిలో స్పోర్ట్స్‌స్కూల్ త్వరలో ఏర్పాటు కానుంది. రూ.32 కోట్ల వ్యయంతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారులు స్టోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్)కు ఇటీవలే ప్రతిపాదనలు పంపించారు. సంగారెడ్డి లేదా, సిద్దిపేట సమీపంలోని తడ్కపల్లిలో జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు శాప్‌కు అందజేశారు. పైకా(పంచాయత్ యువ క్రీడాఔర్ ఖేల్ అభియాన్) ఈ స్కూల్ ఏర్పాటుకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరినాటికి మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్పోర్ట్స్ స్కూల్ జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు చోటు కల్పించి వారికి సంబంధిత క్రీడల్లో శిక్షణ ఇప్పించనున్నారు. తొలి విడత 200 మందికి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత దశలవారీగా విద్యార్థుల సంఖ్య వెయ్యి వరకు పెంచనున్నట్లు సమాచారం. ఎంపికైన విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలతోపాటు స్టోర్ట్స్ స్కూల్‌లోనే ఇంటర్మీడియట్ వరకు విద్యాభాస్యం కల్పిస్తారని అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి పైకా కృషి చేస్తోంది. ఇంతవరకు జిల్లాస్థాయిలో నాలుగు పర్యాయాలు పైకా క్రీడలు జరిగాయి. క్రీడలను మరింత అభివృద్ధి చేయటంతోపాటు గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా జిల్లాస్థాయిలో అన్ని వసతులు, సౌకర్యాలతో స్పోర్ట్స్‌స్కూల్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అధికారుల సమాచారం ప్రకారం రూ.32 కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్‌స్కూల్ ఏర్పాటు చేస్తారు. ఔట్‌డోర్ స్టేడియం, ఇండోర్ స్టేడియాలతోపాటు స్పోర్ట్స్ హాస్టల్ నిర్మిస్తారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుకునేందుకు వీలుగా స్పోర్ట్స్ స్కూల్‌కు అనుబంధంగా విద్యాసంస్థను ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పైకా క్రీడాపోటీల్లో ఎంపికైన విద్యార్థులను స్పోర్ట్స్‌స్కూల్‌లో ప్రవేశం కల్పిస్తారు. క్రీడాకారుల కోసం అవసరమైన కోచ్‌లు, పీఈటీల నియామకం చేపడతారు.
సంగారెడ్డికి దక్కే అవకాశం?
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో గతంలో స్టోర్ట్స్ స్కూల్ నిర్వహించారు. హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ ఇలా పలు క్రీడాంశాల్లో స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. దీంతో గతంలో మాదిరిగానే సంగారెడ్డిలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అవకాశం ఉంది. స్పోర్ట్స్‌స్కూల్‌కు అవసరమైనంత ప్రభుత్వ స్థలం సంగారెడ్డి సమీపంలోని తాళ్లపల్లిలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్‌లోగా నిర్ణయం రావచ్చు
జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి శాప్‌కు ప్రతిపాదనలు అందజేసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి హరనాథ్ తెలిపారు. పైకా ద్వారా జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. రాష్ర్టస్థాయిలో తొలివిడతగా 8 జిల్లాలకు అవకాశం కల్పిస్తున్నారని, అందులో మెదక్ జిల్లాకు అవకాశం దక్కనుందన్నారు. డిసెంబర్‌లోగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం వెలువడవచ్చని తెలిపారు.
రూ.32 కోట్లతో స్పోర్ట్స్‌స్కూల్!
Published Thu, Oct 3 2013 12:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement