క్రీడా పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
► విజయనగరం విజ్జి మైదానంలో రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల
► గంట్యాడ మండలం తాడిపూడిలో జల క్రీడాశాల ఏర్పాటు
► జూన్ నుంచి 350 మంది క్రీడాకారులకు తరగతులు ప్రారంభం
విజయనగరం మున్సిపాలిటీ: విద్యకు నిలయమైన విజయనగరం జిల్లాలో క్రీడా పాఠశాల, జల క్రీడా శాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పాలనాపరమైన ఆమోదం లభించగా... వాటి ఏర్పాటుపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రీజనల్ క్రీడా పాఠశాలను విజయనగరం పట్టణ శివారులోని విజ్జిస్టేడియంలోను, జల క్రీడాశాలను గంట్యాడ మండల తాటిపూడి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల..
విజ్జి స్టేడియం వేదికగా రూ.50 కోట్లతో క్రీడా పాఠశాల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయి. అందులో రూ.20 కోట్ల నిధుల విడుదలకు పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. క్రీడాపాఠశాల ఏర్పాటు ప్రాజెక్టును గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ విభాగం రూపకల్పన చేస్తోంది.
ఆ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సదరు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు విజ్జిలో పర్యటించనున్నారు. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న మొత్తం 350 మంది విద్యార్థులకు ఈ పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. తరగతులను వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌నెల) లోనే ప్రారంభించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతుల నిర్వహణకు ఓ భవనం.... వారు వసతి ఉండేందుకు మరో భవనంను ముందస్తుగా విజ్జి స్టేడియం సమీపంలో అద్దెకు తీసుకునే యోచనలో ఉన్నారు.
తాటిపూడి వద్ద జల క్రీడాశాల..
జిల్లా కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని గంట్యాడ మండలం తాడిపూడి వద్ద జల క్రీడా శాల ఏర్పాటుకు పాలనాపరమైన ఆమోదం లభించింది. తాటిపూడి జలశయాన్ని దీనికోసం వినియోగించుకోనున్నట్టు సమాచారం. శిక్షణ పొందగోరే విద్యార్థులకు వసతి, తరగతులు కోసం భవనాల నిర్మాణాల కోసం తొలివిడతగా రూ.3కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇదే విషయాన్ని డీఎస్‌డీఓ ఎన్.సూర్యారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా... రూ.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన క్రీడా పాఠశాల కోసం తొలివిడతగా రూ.20 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. పాఠశాలలో 350 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.