వ్యవసాయ కుటుంబం నుంచి... | Agricultural family from... | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కుటుంబం నుంచి...

Published Thu, Nov 28 2013 1:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Agricultural family from...

సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు సాధించిన శిరీష స్వస్థలం వైఎస్సార్ కడప జిల్లా, వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామం. తండ్రి వెంకట శివారెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. తల్లి పేరు వెంకటలక్ష్మి. స్వతహాగా క్రీడాభిమాని అయిన తండ్రి... అమ్మాయిని క్రీడాకారిణిని చేయాలని భావించారు. అందుకే హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో శిరీషను చేర్పించారు. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో శిరీష రాణించి ఇప్పుడు కామన్వెల్త్‌లో విజేతగా నిలిచింది.
 
 కోచ్‌ల శిక్షణలో...
 స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం తీసుకున్నప్పుడు ఆరంభంలో శిరీష జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే అక్కడి కోచ్‌లు ఎస్‌ఏ సింగ్, మాణిక్యాలరావు ఆమెలో ప్రతిభను గుర్తించి వెయిట్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించారు. పాఠశాల స్థాయిలో పలు విజయాలు సాధించిన అనంతరం శిరీష, జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జార్ఖండ్‌లో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ (యూత్) చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జూనియర్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈ ఏడాది ఉత్తర కొరియాలో జరిగిన ఏషియన్ కప్‌లో 3 రజత పతకాలు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా విజయం ఆమె కెరీర్‌లో అత్యుత్తమమైందిగా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న శిరీష, ప్రత్యేక అనుమతితో స్పోర్ట్స్ స్కూల్‌లో శిక్షణ కొనసాగిస్తోంది.
 
 ‘మా అమ్మాయి ఏదైనా క్రీడలో భారత్‌కు ఆడేలా చూడాలనేది నా కోరిక. ఇప్పుడు జూనియర్ స్థాయిలో ఆమె ఇలాంటి విజయాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో సీనియర్ విభాగంలోనూ రాణించాలని కోరుకుంటున్నాను’     
 - శివారెడ్డి, శిరీష తండ్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement