గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు | Special Report On Gurukul School Students Problems | Sakshi
Sakshi News home page

గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు

Published Sat, Sep 10 2022 3:39 AM | Last Updated on Sat, Sep 10 2022 8:06 AM

Special Report On Gurukul School Students Problems - Sakshi

నల్లగొండ జిల్లాలోని ఎస్సీ గురుకులంలో ఆరు బయట చీకట్లోనే భోజనం చేస్తున్న విద్యార్థులు

జ్వరంతో బాధపడుతున్న ఈ విద్యార్థి పేరు విజయ్‌కుమార్‌. ఆసిఫాబాద్‌లోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లలేదని.. హాస్టల్‌లోనే ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెబుతున్నాడు.


తనతోపాటు మరో నలుగురూ జ్వరంతో బాధపడుతున్నారని అంటున్నాడు. ఇలా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఈ హాస్టల్‌లో ఏఎన్‌ఎంలు దిక్కులేరు. రాత్రిపూట తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నామని.. మరుగుదొడ్లకు సెప్టిక్‌ ట్యాంక్‌ లేక పక్కనే ఉన్న మురికికాల్వ దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు వాపోతున్నారు. 

 

మెదక్‌ జిల్లా కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కిక్కిరిసి ఉన్న మెస్‌ గది ఇది. ఇందులో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే పాఠశాల భవనంలో ఉన్న మెదక్‌ డిగ్రీ బాలికల గురుకుల కళాశాలలో మరో 840 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. గురుకుల పాఠశాల విద్యార్థులు తరగతి గదిలోనే బస చేయాల్సి వస్తోంది. విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, భోజనానికి లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పారిశుధ్యలోపం కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే చాలా గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం కారణంగా ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. మరోవైపు కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్‌ రిపోర్ట్‌. 

ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినా.. 
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజన వసతులు అందించేందుకు 267 ఎస్సీ, 162 ఎస్టీ, 292 బీసీ, 206 మైనారిటీ, 35 విద్యాశాఖ గురుకులాలను ఏర్పాటు చేసింది. ఒక్కో గురుకులంలో 480 మంది చొప్పున.. మొత్తం 4,61,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదట్లో గురుకులాలు బాగానే సాగినా తర్వాత గాడితప్పాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల విద్యార్థుల హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. పరిశుభ్రత మచ్చుకైనా కానరావడం లేదని.. అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

ఏ గురుకులంలో చూసినా ఇదే దుస్థితి 
నల్లగొండ ఎస్‌ఎల్‌బీసీలోని అనుముల ఎస్సీ బాలుర గురుకులంలో 480 మంది ఉన్నారు. వారిలో చాలా మంది జ్వరాల బారినపడి ఇళ్లకు వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అన్నం ముద్దగా ఉంటోందని, పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు, పలుచని మజ్జిగతో భోజనం పెడుతున్నారని వాపోతున్నారు. ఉదయం పెట్టే ఉప్మాలోనూ పురుగులు వస్తున్నాయని అంటున్నారు. హాస్టల్‌ పక్కన రేకుల షెడ్డు కింద అంతా భోజనం చేస్తున్నామని.. చీకట్లో వడ్డిస్తుండటంతో దోమలు, పురుగులు పడుతున్నాయని వాపోతున్నారు. 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. అందులోనే హాస్టల్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో 482 మంది బాలికలు ఉన్నారు. భవనం పక్కన రేకుల షెడ్డులో కిచెన్, భోజనశాల ఉన్నాయి. మెస్‌ హాల్‌ పక్కనే మురికి కాల్వ ఉంది. దుర్వాసన, దోమల బెడదతో విద్యార్థినులు తరచూ రోగాల పాలవుతున్నారు. సమీపంలో పొలాలు ఉండటం, ప్రహరీ లేకపోవడంతో విష పురుగులు, పందులు హాస్టల్లోకి వస్తున్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకులాలు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతంలో పార్ట్‌టైం ఏఎన్‌ఎంలు పనిచేసేవారు. గిరిజనశాఖ ఇటీవల వారిని తొలగించడంతో విద్యార్థులకు జ్వరమొస్తే చూసే దిక్కులేకుండా పోయింది. సరైన భోజనం పెట్టకపోవడం, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారినపడుతున్నామని పలు పాఠశాలల్లోని విద్యార్థినులు వాపోతున్నారు. 

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణ శివారులోని బోర్నపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల చుట్టూ చెట్లు, పొదలతో అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్ల వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో రాత్రిపూట విద్యార్థులు భయపడుతున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారన్న వార్తలు వస్తుండటంతో.. ఆందోళనకు గురైన పలువురు తల్లిదండ్రులు కరీ ంనగర్‌ పట్టణ శివార్లలోని బొమ్మకల్‌ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలకు వచ్చారు. కొందరు విద్యార్థుల ఆరోగ్యాన్ని వాకబు చేసి వెళ్లగా.. మరికొందరు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం కనిపించింది. 

జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో డ్రైనేజీ నీరు పాఠశాల ఆవరణలోనే నిలుస్తోంది. తాగునీటి పైపులైన్లు కూడా లీకవుతున్నాయి. 

మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌లోని బాత్రూం, మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవని వాపోతున్నారు. తరగతి గదుల్లో ఐదు ఫ్యాన్లు ఉంటే నాలుగు పనిచేయడం లేదని.. దోమల బెడద ఎక్కువైందని అంటున్నారు. హాస్టల్‌ చుట్టూ పొదలు పెరిగాయని, ఇప్పటికే మూడుసార్లు హాస్టల్‌లోకి పాములు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్‌లో డోర్లు సరిగ్గా లేని మరుగుదొడ్లు.  

భయంతో అడ్మిషన్‌ రద్దు చేసుకుని తీసుకెళ్తున్నా.. 
మా కొడుకు సిద్ధార్థను బొమ్మకల్‌ గురుకుల పాఠశాలలో సీఈసీ మొదటి సంవత్సరంలో చేర్పించాను. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవని, భోజనం మంచిగా లేదని మా కొడుకు ఫోన్‌ చేసి చెప్పడంతో అడ్మిషన్‌ రద్దు చేసుకొని తీసుకెళ్తున్నాను. ప్రైవేట్‌ కాలేజీలో చేర్పించి చదివిస్తాను. 
– గంగాచారి, విద్యార్థి తండ్రి, కరీంనగర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement