సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సందిగ్ధం వీడలేదు. ప్రస్తుతమున్న గురుకులాలు చాలకపోవడం, క్షేత్రస్థాయి నుంచి అత్యధిక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కానీ వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో వీటి ఏర్పాటుకు ఏడాది పాటు సమయాన్ని గురుకుల సొసైటీకి ఇచ్చింది. వీటిని ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. మరో 4 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. వచ్చే ఏడాది మే నెలలోగా భవనాల ఏర్పాటుతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించు కోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ లొకేషన్లు ఖరారు చేయకపోవడంతో భవనాల పరిశీలన ప్రక్రియే ప్రారంభం కాలేదు.
నియోజకవర్గానికో బాలబాలికల గురుకులం
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 23 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొన్నిచోట్ల బాలుర, కొన్నిచోట్ల బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసింది. గురుకుల పాఠశాలలకు భారీ డిమాండ్ రావడంతో కొత్త గురుకులాల్లో సీట్ల సర్దుబాటు యంత్రాంగానికి కష్టంగా మారింది. ఈ క్రమంలో మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపడంతో వాటిని ఆమోదిస్తూ కొత్తగా మరో 119 గురుకులాలను మంజూరు చేసింది. వీటిని ప్రారంభిస్తే నియోజకవర్గానికో బాల, బాలికల గురుకులం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుత గురుకులాలన్నీ అద్దె భవనాల్లోనే..
ప్రస్తుతం గురుకుల పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక గురుకుల పాఠశాలకు కనిష్టంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం, మైదానం ఉన్న వాటిల్లోనే కొనసాగించాలని నిబంధన విధించింది. చాలాచోట్ల సౌకర్యవంతమైన భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కొత్త గురుకులాలకు అద్దె భవనాలు లభించడం కష్టంగా మారింది. ప్రారంభ తేదీ ముంచుకొస్తున్నప్పటికీ.. లొకేషన్లపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త గురుకులాలు ఎక్కడ?
Published Sun, Dec 30 2018 1:55 AM | Last Updated on Sun, Dec 30 2018 1:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment