
ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఒకేదఫాలో 55 పాఠశాలల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
రాష్ట్రంలోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు
ఒకే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు
అన్ని వర్గాల పిల్లలూ ఒకే గొడుగు కిందకు
విశాలమైన ఆవరణ.. అంతర్జాతీయ ప్రమాణాలు
డిజిటల్ విద్య, ల్యాబ్‌లు, యాంఫీథియేటర్ ఉండేలా డిజైన్
ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (వైఐఐఆర్‌ఎస్)...రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు. అన్ని వర్గాల పిల్లలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో దీనికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా తొలివిడత ఒకే దఫాలో 55 సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ.. మొత్తం 55 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది.
ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేవిడత ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం. కాగా గురుకులాల నిర్మాణానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
కుల, మత వైషమ్యాలు తొలగిపోయేలా..
కుల, మత వైషమ్యాలు తొలగిపోవాలని, అందరికీ సమాన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత గురుకుల పాఠశాలల క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం నాలుగు గురుకుల పాఠశాలలుంటాయి. డిమాండ్‌కు అనుగుణంగా కొన్నిచోట్ల జనరల్ గురుకుల పాఠశాలలకు సైతం అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్ విస్తీర్ణం గరిష్టంగా 25 ఎకరాల్లో ఉంటుంది. ఈ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మినీ యాంఫీథియేటర్, క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
55 నియోజకవర్గాలివే..
మంచిర్యాల, హుస్నాబాద్, ఆంధోల్, వికారాబాద్, షాద్‌నగర్, కొల్లాపూర్, నల్లగొండ, వరంగల్ ఈస్ట్, ములుగు, ఖమ్మం, పాలేరు, అచ్చంపేట్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, బోధన్, చాంద్రాయణగుట్ట, చెన్నూరు, చేవెళ్ల, చొప్పదండి, దేవరకద్ర, ధర్మపురి, డోర్నకల్, గద్వాల, స్టేషన్‌ఘన్‌పూర్, జడ్చర్ల, జగిత్యాల, జుక్కల్, కల్వకుర్తి, కోదాడ, కొత్తగూడెం, మక్తల్, మానకొండూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మునుగోడు, నాగార్జునసాగర్, నాగర్‌కర్నూల్, నకిరేకల్, నారాయణఖేడ్, నారాయణపేట, నర్సంపేట, నిజామాబాద్, పరకాల, పెద్దపల్లి, పినపాక, రామగుండం, సత్తుపల్లి, తాండూరు, తుంగతుర్తి, వనపర్తి, వైరా, ఇల్లందుల్లో సమీకృత గురుకులాలు ఏర్పాటు కానున్నాయి.
పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకే సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇవి దేశంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఉంటాయన్నారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
మీడియా సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సమీకృత గురుకులాలకు రూ.11 వేల కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమంటూ.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment