
రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ప్రభుత్వం పిలుపు
నేడు అన్ని పార్టీల ఎంపీలతో ప్రజా భవన్‌లో భేటీ
హాజరు కానున్న సీఎం రేవంత్, భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా.. రానున్న లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల లోక్‌సభ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. సమావేశానికి హాజరు కావాలంటూ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు రాష్ట్ర ఎంపీలందరికీ శుక్రవారం భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వనించారు.
అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై సమావేశంలో ఎంపీలతో సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసిన సందర్భంగా.. మోదీ ఇచ్చనా వినతిపత్రంలోని అంశాలకు ఎలాంటి సహకారం అందిస్తామనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.
కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు విధివిధానాలు, రాష్ట్ర రుణ భారం తగ్గించుకునేందుకు గల వెసులుబాటు, కేంద్రం నుంచి రావలసిన పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌పై చర్చించి కేంద్రంపై సమష్టిగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment