
ప్రజాభవన్‌లో రాష్ట్ర లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం.. హాజరుకాని బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు..
కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహాయ సహకారాలు సాధించుకుందాం
రాష్ట్ర ఎంపీల ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
పార్లమెంటులో రాష్ట్ర అవసరాలు, సమస్యలను లేవనెత్తాలి
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలసి రావాలని ఆశిస్తున్నాం
వారం తర్వాత మరో సమావేశం పెడతాం.. ఎంపీలను నేను ప్రత్యేకంగా కలసి ఆహ్వనిస్తా
పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడి..
సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు, ప్రాజెక్టులు, సహాయ సహకారాలు కావాలి. ఇందుకోసం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలి. రాష్ట్ర అవసరాలను, సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి..’’అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల సాధన కోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా.. రాష్ట్ర ఎంపీలకు సమాచారం అందించేందుకు శనివారం ప్రజాభవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
సమాచారమంతా అందుబాటులో పెట్టాం
రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని, రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలకు సమాచారం ఇచ్చామని చెప్పారు. సమావేశానికి రావాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను తాను ప్రత్యేకంగా ఆహ్వనించానని.. అయినా బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యులు రాలేదని భట్టి తెలిపారు. వారు సమావేశానికి రాకపోయినప్పటికీ ఆయా పార్టీల ఎంపీలకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంతోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నివాసంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఆ సెక్రటేరియట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందుతున్న సాయం వివరాలను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పార్లమెంటు సభ్యులు వీలును బట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి అవకాశాలను ఉపయోగించుకుని రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
పునర్విభజన ద్వారా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, టెక్స్‌టైల్ పార్కు, మెట్రో రైలు విస్తరణ, నవోదయ విద్యాలయాలు, నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులకు నిధుల మంజూరుపై రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం
ఈ సమావేశానికి హాజరుకావాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు తాను స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వనించానని.. కానీ తమకు సమయం లేదని, ఇతర కార్యక్రమాలు ఉన్నాయంటూ బీజేపీ సభ్యులు రాలేదని భట్టి చెప్పారు. బీజేపీ సభ్యులు కోరిన విధంగా ప్రభుత్వం వారం తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేస్తుందని.. ఆ సమావేశానికైనా బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమావేశానికి రావాలని ఆయా పార్టీల ఎంపీలను తాను స్వయంగా కలసి ఆహ్వానిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ కలసివస్తాయని ఆశిస్తున్నామన్నారు.
ప్రభుత్వ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సమాచారాన్ని ఇచ్చేందుకు ఎంపీలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని.. ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి న్యాయం జరగడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అందిస్తున్న సాయాన్ని తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎంఐఎం పక్షాన పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తామన్నారు.
చాలాసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎంపీ చామల
రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన నిధులు, ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎన్ని సార్లు ప్రధానిని, సంబంధిత మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల గురించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని.. సభ లోపల మాట్లాడటంతోపాటు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.
‘రీజనల్’ రోడ్డు నుంచి నవోదయ విద్యాలయాల వరకు..
ఎంపీల ప్రత్యేక సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన, రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి వివరించారు. మొత్తం 28 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వ స్పందన, ప్రస్తుత స్థితి ఏమిటన్నది తెలిపారు.
అందులో రీజనల్‌రింగ్‌రోడ్డు, ఓఆర్‌ఆర్ నుంచి రీజనల్ వరకు రేడియల్ రోడ్లు, మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, గోదావరి–మూసీ లింకు ప్రాజెక్టు, హైదరాబాద్‌కు సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రీన్‌ఫీల్డ్ హైవే, సింగరేణికి బొగ్గుబ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్, ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, పవర్ సిస్టమ్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద పథకాలు, పీఎం కుసుమ్–ఏ, బీ, సీల కింద సోలార్ ప్లాంట్లు, తాడిచర్ల బ్లాకు బొగ్గు తవ్వకాల లీజు, రుణాల రీస్ట్రక్చరింగ్, ఏపీ నుంచి రావాల్సిన నిధులు,
రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా రావాల్సిన నిధులు, 2014–15లో పొరపాటున ఏపీకి జమ అయిన సీసీఎఫ్ పథకాల నిధులు, లేబర్ వెల్ఫేర్ ఫండ్, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, 8 రైల్వే లైన్ల కనెక్టివిటీ, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు, 12 జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు అంశాలను ప్రజెంటేషన్‌లో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment