
తెలంగాణ భవన్‌కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్‌ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే చాన్స్ ఉన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.