ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు.