స్పీకర్ నర్వేకర్ (పైన), శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తేల్చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న అనిశి్చతికి తెరదించారు. శివసేన పార్టీ 2022 జూన్‌లో రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఇరువురు నేతలు వాదిస్తున్నారు. అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞాపనలు సమరి్పంచారు. వీటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.
ఈ తొలగింపు 2022 జూన్ 21 నుంచి వర్తిస్తుందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను అధికారికంగా విప్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు వేయడం లేదన్నారు. పార్టీ నుంచి నేతలను బహిష్కరించే అధికారం శివసేన చీఫ్‌కు లేదని పేర్కొన్నారు.
2018 నాటి శివసేన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం కోరగా, స్పీకర్ అంగీకరించలేదు. 1999 నాటి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. శివసేన ఎన్నికల సంఘం సైతం ఈ రాజ్యాంగాన్నే గుర్తించిందని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు గాను 37 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయంపై షిండే వర్గంసంబరాలు చేసుకుంది. సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు.
సుప్రీంను ఆశ్రయిస్తాం: ఉద్ధవ్ వర్గం
స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన(ఉద్ధవ్) ప్రకటించింది. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని పార్టీ నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మండిపడ్డారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. షిండే వర్గమే అసలైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా ఉద్ధవ్ ఠాక్రే అభివరి్ణంచారు.
Comments
Please login to add a commentAdd a comment