సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా గురువారం ఎన్యుమరేటర్‌కు తన వివరాలు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు.
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
తరచూ తనిఖీలు చేయండి
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు.
పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు
విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment