సాక్షి, చిలుకూరు: చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణలోని గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నట్టు సీఎం చెప్పారు. అలాగే, మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హాస్టల్స్, గురుకులాల్లో విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ ఇస్తున్నాం. హాస్టల్స్, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభమైంది. మెస్ మెనూలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. వారం రోజుల్లో ఐదు రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయించాం.
తెలంగాణలో 26వేల ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే రాణిస్తారనే అపోహ ఉండేది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేటు స్కూల్స్ 33 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు?. మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలి. చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే.
గురుకులాలు, హాస్టల్స్‌లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది?. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రతీనెలా పదో తేదీలోపు డైట్ ఛార్జీలు చెల్లిస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment