సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసిన 119 బీసీ గురుకులాలను నేడు (17న) ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ గురుకులాలన్నింటినీ సోమవారం ఏకకాలంలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీటి ప్రారంభంతో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో పాఠశాలల సంఖ్య 257కు చేరనుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ మిషన్ కింద గురుకుల పాఠశాలలను తెరుస్తూ వచ్చింది.
ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. అయితే జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఆ ఏడాది ప్రారంభించిన గురుకులాల సంఖ్య తక్కువే. గురుకులాలకు డిమాండ్ అధికంగా ఉండటం... పాఠశాలల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ప్రభుత్వం గతేడాది మరో 119 గురుకుల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన బీసీ గురుకుల సొసైటీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది.
సవాళ్లను అధిగమించి...
కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటులో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పలు సవాళ్లను ఎదుర్కొం ది. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 400 గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో కొత్తగా మరో 119 మంజురు చేయగా... వాటి ఏర్పాటుకు భవనాల గుర్తింపు పెను సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న దాదాపు అన్ని భవనాలు అప్పటికే గురుకులాల ఏర్పాటు కోసం అద్దెకు తీసుకోవడంతో భవనాల కొరత విపరీతమైంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. భవనాల లభ్యత లేకపోవడంతో అధికారులు సైతం తలపట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు భవనాల కోసం పరిశీలించారు. పలుచోట్ల యజమానులతో దఫాల వారీగా చర్చలు జరిపి, మరమ్మతులకు ఒప్పించి మొత్తంగా అవసరమైన మేర అద్దె భవనాలను గుర్తించారు. కొన్ని చోట్ల మాత్రం అనువైన భవనాలు లేని కారణంగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల్లోనే ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాల, బాలికల బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. 2017–18లో ప్రారంభించిన 119 గురుకులాలను డిమాండ్‌ను బట్టి బాల బాలికలుగా విభజించినప్పటికీ... తాజాగా ప్రారంభిస్తున్న గురుకులాలతో బ్యాలెన్సింగ్ పద్ధతితో బాలబాలికల పాఠశాలలను ఏర్పాటు చేశారు. మొత్తం 257 బీసీ గురుకులాల్లో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించింది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించింది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న విద్యా సంస్థగా బీసీ గురుకుల సొసైటీ రూపుదాల్చనుంది.
నేటి నుంచి కొత్త బీసీ గురుకులాలు
Published Mon, Jun 17 2019 2:14 AM | Last Updated on Mon, Jun 17 2019 2:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment