BC Gurukulas
-
కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో గురుకులాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచిచూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మేనిఫెస్టోలోని హామీల అమలుపై దృష్టి సారించి. కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని బీసీ గురుకుల సొసైటీని ఆదేశించింది. ఇందులో భాగంగా కొత్త గురుకులాల ఏర్పాటు అవసరమున్న మండలాల వారీగా బీసీ గురుకుల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 292 బీసీ గురుకులాలు.. రాష్ట్రంలో 594 మండలాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలుర, ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు తగినట్లుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 292 బీసీ గురుకుల పాఠశాలలను మండలాల వారీగా విభజించి.. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపిన అధికారులు, మండలాల వారీగా ప్రాధాన్యత క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో కూడా ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించారు. ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు, నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు. -
నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్ కిటుకులు!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువగా పాఠ్యాంశాల అభ్యసనకే పరిమితమవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజ జీవితంలో, వృత్తి పరమైన అంశాల్లో ఎదుగుదలకు సబ్జెక్టు ఉంటేనే సరిపోదు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చే అవకాశాలుంటాయి. ఈ ఉద్దేశంతోనే మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), బీసీ సంక్షేమ శాఖలు ఆ దిశగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. ‘2023 ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (పీఎస్‌ఐఎల్)’ పేరిట గురుకుల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపుదల కోసం అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ది లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో బీసీ గురుకుల సొసైటీ అవగాహన కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 108 మంది బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు, బీసీ హాస్టల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి ప్రత్యేకంగా ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు, ఓయూ నుంచి ఐదుగురు ఇన్స్ట్రక్టర్ ఫెలోస్ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అవగాహన కుదుర్చుకున్న మూడు సంస్థల ప్రతినిధులతో పాటు బీసీ గురుకుల సొసైటీ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఎనిమిదో తరగతి, ఆపై తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల్లో చురుకైన 108 మందిని బీసీ గురుకుల సొసైటీ గుర్తించి ఎంపిక చేసింది. ఇందుకోసం అంతర్గతంగా ప్రత్యేక పరీక్షను నిర్వహించింది. తొలిదశలో ఇలా ఎంపికైన విద్యార్థులకే ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సైంటిఫిక్ రేసిజం, ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇఫ్ స్టార్ట్స్ విత్ అన్ అబ్జర్వేషన్, ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, సినిమా అండ్ సోషల్ చేంజ్ అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వా లీబాల్, రగ్బీ వంటి క్రీడలతో పాటు నృత్యం, ఆ త్మరక్షణ, కరాటేపై కూడా సామూíßæ క చర్చలు జరిపి స్తున్నారు. శిక్షణా నంతరం సంబంధిత ఇన్స్ట్రక్టర్లు, ఇన్స్ట్రక్టర్ ఫెలోస్‌తో నిరంతర అనుసంధాన వ్యవస్థను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ఇలా శిక్షణ పొందిన గురుకుల విదార్థులను జిల్లాల వారీగా విభజించి గురుకుల పాఠశాలల్లోని పిల్లలకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తూ వాటిల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహింపజేయనున్నారు. మొత్తంగా ప్రతి గురుకుల విద్యార్థిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించేందుకు బీసీ సంక్షేమ శాఖ, బీసీ గురుకుల సొసైటీ ముందుకు సాగుతున్నాయి. ఆలకించడం, భావ వ్యక్తీకరణ కీలకం ఇతరులు చెప్పే విషయాల్ని ముందుగా శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మనం చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఈ నైపుణ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటే ఎక్కడైనా, ఎలాంటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడగలననే నమ్మకం కుదిరింది. – సాయికిరణ్, బీసీ గురుకుల పాఠశాల, జైనథ్, ఆదిలాబాద్ జిల్లా ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.. స్టేజీపైన మాట్లాడాలంటే ఎంతో ఆందోళన చెందేదా న్ని. ఈ ప్రత్యేక కార్యక్రమంతో నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇతరులతో మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజీ, భాషపై పట్టు పెంచుకోవడంలో మెళకువలెన్నో నేర్చుకుంటున్నా. – సంఘవి, బీసీ గురుకులం, రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లా -
కొత్తగా 119 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మరిన్ని గురుకుల జూనియర్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం మరో 119 బీసీ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ఇందు లో భాగంగా 119 గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయనుంది. దీంతో ఈ పాఠశాల ల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభు త్వం ఆమోదం తెలపడంతో కాలేజీల ఏర్పా టుకు మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్) అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. అద్దె భవనాల కోసం అన్వేషణ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవ లం 21 గురుకుల విద్యా సంస్థలు మాత్ర మే ఉండేవి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున రెండు విడతల్లో 238 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో డిమాండ్ విప రీతంగా ఉండటంతో ఇటీవల జిల్లాకు ఒక గురుకులం చొప్పున మరో 33 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. గత నెలలో సొసైటీ అధికారులు ఈ పాఠశాల లను ప్రారంభించారు. వీటికి తోడుగా మరో 15 గురుకుల డిగ్రీ కాలేజీలను సైతం అందుబాటులోకి తెచ్చారు. విడతలవారీగా యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన పాఠ శా లలకు ప్రభుత్వం ఇంకా శాశ్వత భవనాలను నిర్మించకపోవడంతో అవన్నీ అద్దె భవనా ల్లోనే కొనసాగుతున్నాయి. కొత్త కాలేజీలు సైతం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో జిల్లాల వారీగా డిమాండ్‌కు తగినట్లు భవనాలను గుర్తించేందుకు సంబంధిత జిల్లా సంక్షేమాధికారి, గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వ యకర్తలకు విద్యా సంస్థల సొసైటీ బాధ్య తలు అప్పగించింది. పాఠశాల స్థాయిలో గురుకుల భవనానికి 20 వేల చదరపు అడు గుల స్థలం అవసరం ఉండగా.. కాలేజీతో కలిపి 50 వేల చదరపు అడుగుల భవనం అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు పెద్ద భవనాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ విద్యా సంస్థల భవనాలు ఖాళీగా ఉంటే వాటికి ప్రాధా న్యం ఇవ్వాలని సొసైటీ ఆదేశించడంతో అలాంటివాటిని గుర్తించాలని భావిస్తు న్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భవనాలను గుర్తించి అగ్రిమెంట్లు చేసుకు నేందుకుగాను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవనాలను గుర్తించి నివేదికలు పంపేందుకు సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. -
Telangana: కొత్త గురుకులాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన బీసీ గురుకుల విద్యా సంస్థలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరానికి గాను ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాల, ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఉన్న మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. యుద్ధప్రాతిపదికన ఈ విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో బీసీ గురుకుల సొసైటీ ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు సొసైటీ చర్యలు పూర్తి చేసింది. కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది 5,6,7 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేయగా, విద్యార్థులు సైతం రిపోర్టు చేశారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 295 గురుకుల పాఠశాలలు ఇప్పటివరకు రాష్ట్రంలో 262 గురుకుల పాఠశాలలున్నాయి. క్షేత్రస్థాయిలో బీసీ గురుకులాలకు డిమాండ్ విపరీతంగా ఉండడం... ప్రతి సంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా నిండుతుండగా... మరింత మంది ఆశావహులు సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో కొత్తగా 33 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య 295కు చేరి అత్యధిక విద్యా సంస్థలతో అతి పెద్ద సొసైటీగా నిలిచింది. వచ్చే వారం నుంచి డిగ్రీ కాలేజీలు షురూ... రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 16కు చేరనుంది. కొత్తగా ప్రారంభించనున్న డిగ్రీ కాలేజీలకు భవనాలను గుర్తించిన అధికారులు మిగతా ఏర్పాట్లలో బిజీ అయ్యారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేకాధికారులుగా పదవీ విరమణ పొందిన కాలేజీ ప్రిన్స్పాళ్లు, సీనియర్ లెక్చరర్లను ఎంపిక చేసింది. మరోవైపు బోధన సిబ్బందిని గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో ఎంపిక చేస్తోంది.అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 15వ తేదీతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది. వచ్చే వారంలో అడ్మిషన్లు పూర్తి చేసిన వెంటనే తరగతులు ప్రారంభిస్తామని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు ‘సాక్షి’కి వెల్లడించారు. -
ప్రతీ జిల్లాకు బీసీ గురుకుల పాఠశాల
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులు ప్రవేశం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. దీంతో ప్రతి జిల్లాలో కొత్తగా 5,6,7 తరగతుల్లో అదనపు ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. లొకేషన్లకు గ్రీన్ సిగ్నల్... రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 33 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన లొకేషన్ల ఫైనలైజేషన్ పూర్తయింది. జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సమ్మతించింది. ఈ క్రమంలో వీటి ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతుల్లో అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా పాత పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాక కొత్త పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. వచ్చేనెల మొదటి వారంలో అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది. అతి పెద్ద సొసైటీగా... రాష్ట్రంలో నాలుగు సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల సొసైటీలుండగా...ప్రస్తుతం అతి పెద్ద సొసైటీగా ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఆవిర్భవించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలలతో పోలిస్తే ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్లో 294 గురుకుల పాఠశాలలున్నాయి. ఆ తర్వాత టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో 267 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది. మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో 206 పాఠశాలలు, గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 186 పాఠశాలలున్నాయి. -
TGCET 2021: తేదీల ఖరారు.. పరీక్షలు ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షలన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో బోధన, అభ్యసన కార్యక్రమాల్లో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా అడ్మిషన్లు నిర్వహించాలని విద్యాశాఖ సూచించడంతో గురుకుల సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం టీజీసెట్ నిర్వహిస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి సైతం దరఖాస్తుల ఆధారంగా ప్రవేశ పరీక్షలుంటాయి. ఇక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆర్జేసీసెట్, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్డీసీసెట్ నిర్వహిస్తున్నారు. పది రోజుల్లో ఫలితాలు గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీలు ఉమ్మడి ప్ర వేశ పరీక్ష(టీజీసెట్) నిర్వహిస్తోంది. ఈ నెల 18న టీజీసెట్‌ను నిర్వహించేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్షకు వారం ముందు వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సెట్ కన్వీనర్ ఇప్పటికే తెలిపారు. ► ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 17న యూజీసెట్ నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను ఈ ఏడాది మాత్రం విద్యార్థికి పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు. ► బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు, అదే సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈనెల 25న అర్హత పరీక్షలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో(ఆగస్టు తొలి వారం) ఫలితాలు విడుదల చేసేలా గురుకుల సొసైటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతేడాది పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది అలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా సొసైటీ అధికారులు ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారు. -
నేటి నుంచి బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం
సాక్షి, అమరావతి: బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. ఏ ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా తల్లిదండ్రుల సమ్మతి లేఖతో విద్యార్థులు గురుకులాలకు రావలసి ఉంటుంది. నాలుగు మాస్కులు వెంట తెచ్చుకోవాలి. గురుకులాల వద్ద విద్యార్థులను థర్మల్ స్కానర్లతో సంస్థ వైద్య బృందం పరీక్షిస్తుంది. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ విద్యార్థిని వెంటనే తిరిగి ఇంటికి çపంపిస్తారు. కాగా క్లాసులు ఉదయం 8:15 నుండి సాయంత్రం 1:30 వరకు జరుగుతాయి. క్యాంపస్, హాస్టల్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు ఇలా ప్రతిచోటా విద్యార్థులు సురక్షిత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. ► చేతులు కడుక్కునేందుకు సబ్బు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు. ► అందుబాటులో స్టాఫ్ నర్సులతో కూడిన ఆరోగ్య బృందాలు ► విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం. ► ముందుజాగ్రత్త చర్యగా ప్రతి పాఠశాలలో ఐసోలేషన్ రూమ్ / వార్డ్ ఏర్పాటు ► ప్రతి తరగతి గదిలో 16 మందికి మించకుండా విద్యాబోధన. ► ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, పెన్సిళ్లు, లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి వాడకం తాత్కాలికంగా నిలిపివేత. ► వసతి గృహంలో విద్యార్థులు మంచం, తువ్వాళ్లు, దుస్తులు, బూట్లు, సాక్స్‌లు వంటి తమ వస్తువులు దూరంగా, విడివిడిగా ఉంచుకునేలా ఏర్పాటు. ► మరుగుదొడ్లు, బాత్రూములను రోజుకు మూడుసార్లు శుభ్రం చేయాలి. ► అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనానికి ముందు, ఆ తర్వాత డైనింగ్ హాల్ శుభ్రపరుస్తారు. ► ప్రతి విద్యార్థి తమ సొంత ప్లేట్, గ్లాసు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. ► సాధారణ అసెంబ్లీ ఉండదు. విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనుమతి లేదు. -
బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతూ మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. వీరు ఈ నెల 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశం పొందే విద్యార్థి కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష లోపు ఆదాయం ఉండాలి. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 14 బీసీ గురుకుల కళాశాలలు.. 2,080 సీట్లు రాష్ట్రంలో మొత్తం 14 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఏడు బాలికలకు, ఏడు బాలురకు కేటాయించారు. బాలికలకు 1,000 సీట్లు ఉండగా.. బాలురకు 1,080 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలకు www. jnanabhumi. ap. gov. in చూడాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ నుంచి మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమ్యాటిక్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), ఫిజికల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), బయోలాజికల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), సోషల్ స్టడీస్ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు), ఇంగ్లిష్ 15 ప్రశ్నలు (15 మార్కులు), లాజికల్ రీజనింగ్ 10 ప్రశ్నలు (10 మార్కులు) ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మార్చి 15న ఫలితాలు రాత పరీక్ష మార్చి 8న (ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు) జరుగుతుంది. మార్చి 15న ఫలితాలను ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి 17లోపు సీట్లు కేటాయిస్తారు. 75 శాతం సీట్లు బీసీ గురుకుల విద్యార్థులకే.. ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాల్లో బీసీ–ఏలకు 20 శాతం, బీసీ–బీలకు 28 శాతం, బీసీ –సీలకు 3 శాతం, బీసీ –డీలకు 19 శాతం, బీసీ –ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 2 శాతం, అనాధలకు 3 శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది. ప్రత్యేకించి మత్స్యకారుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కాలేజీల్లో మత్స్యకార వర్గానికి చెందిన విద్యార్థులకు 46 శాతం, బీసీ–ఏలకు 7 శాతం, బీసీ–బీలకు 10 శాతం, బీసీ –సీలకు 1 శాతం, బీసీ –డీలకు 7 శాతం, బీసీ –ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 1 శాతం, అనాధ పిల్లలకు 3 శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే.. మొత్తం మీద 75 శాతం సీట్లను బీసీ గురుకుల స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో చదువుకున్న వారికే కేటాయిస్తారు. మిగిలిన 25 శాతం సీట్లలోకి ఇతర చోట్ల చదువుకున్న వారిని తీసుకుంటారు. -
గురుకుల సీట్లకు భలే క్రేజ్ !
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలకు క్షేత్రస్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. గురుకులాల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గురుకుల పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 819 గురుకుల పాఠశాలల్లో ఆయా సొసైటీలు ఐదోతరగతి అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. మొత్తం 64,140 సీట్లు ఉన్నాయి. వీటిలో మైనార్టీ గురుకుల పాఠశాలలు మినహా ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి టీజీసెట్ృ2019 అర్హత పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ పద్ధతిలోనే సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నాలుగు సొసైటీల పరిధిలో 47,740 సీట్లు ఉండగా...తొలివిడత కౌన్సెలింగ్‌లో ఏకంగా 83.76% విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. మరో రెండ్రోజుల సమయంలో మరికొందరు ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. ఈనెల 25 వరకు తొలివిడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి 26న రెండో విడత జాబితాను ఇచ్చేందుకు టీజీసెట్ కన్వీనర్ ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో 47,740 సీట్లు ఉండగా ఇప్పటికే 39,990 మంది ప్రవేశాలు పొందారు. ఈనెల 25 తర్వాత ఉన్న ఖాళీల ఆధారంగా రెండో విడత జాబితా విడుదల చేస్తారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల ఆధారంగా మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించే అంశంపై టీజీసెట్ నిర్ణయం తీసుకుంటుంది. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 16,400 సీట్లు ఉన్నాయి. ఈ గురుకులాల్లో కూడా అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ...ఇప్పటివరకు ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యను ఇంకా ఆ సొసైటీ విడుదల చేయలేదు. సొసైటీల వారీగా ఉన్న పాఠశాలలు, ఐదో తరగతిలో సీట్ల వివరాలు వచ్చే నెల 15కల్లా పూర్తి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను జూలై 15కల్లా పూర్తి చేయాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఈనెల 26న రెండో విడతలో దాదాపు అన్ని సీట్లు భర్తీ అవుతాయని సొసైటీలు అంచనా వేస్తున్నాయి. రెండోవిడత పరిస్థితిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. అన్ని గురుకులాల్లో ఐదోతరగతికి ఉమ్మడి పరీక్ష నిర్వహించగా... 6,7 తరగతుల్లో ఖాళీల భర్తీకి సొసైటీలు విడివిడిగా పరీక్షలు నిర్వహించాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కావడంతో సీట్ల భర్తీకి ప్రత్యేక పరీక్ష నిర్వహించింది. వీటిల్లోనూ 90% సీట్లు భర్తీ అయినట్లు బీసీ గురుకుల సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో ఖాళీలను కూడా ఇదే తరహాలో భర్తీ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నిర్దేశించిన స్కూల్లో అడ్మిషన్ పొందినప్పటికీ స్కూల్ మార్పు చేసుకునే అంశంపై గురుకుల సొసైటీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సుదూర ప్రాంతాల్లోని స్కూళ్లలో సీట్లు పొందిన విద్యార్థులు మార్పు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
నేటి నుంచి కొత్త బీసీ గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసిన 119 బీసీ గురుకులాలను నేడు (17న) ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ గురుకులాలన్నింటినీ సోమవారం ఏకకాలంలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీటి ప్రారంభంతో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో పాఠశాలల సంఖ్య 257కు చేరనుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ మిషన్ కింద గురుకుల పాఠశాలలను తెరుస్తూ వచ్చింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. అయితే జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఆ ఏడాది ప్రారంభించిన గురుకులాల సంఖ్య తక్కువే. గురుకులాలకు డిమాండ్ అధికంగా ఉండటం... పాఠశాలల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ప్రభుత్వం గతేడాది మరో 119 గురుకుల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన బీసీ గురుకుల సొసైటీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది. సవాళ్లను అధిగమించి... కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటులో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పలు సవాళ్లను ఎదుర్కొం ది. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 400 గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో కొత్తగా మరో 119 మంజురు చేయగా... వాటి ఏర్పాటుకు భవనాల గుర్తింపు పెను సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న దాదాపు అన్ని భవనాలు అప్పటికే గురుకులాల ఏర్పాటు కోసం అద్దెకు తీసుకోవడంతో భవనాల కొరత విపరీతమైంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. భవనాల లభ్యత లేకపోవడంతో అధికారులు సైతం తలపట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు భవనాల కోసం పరిశీలించారు. పలుచోట్ల యజమానులతో దఫాల వారీగా చర్చలు జరిపి, మరమ్మతులకు ఒప్పించి మొత్తంగా అవసరమైన మేర అద్దె భవనాలను గుర్తించారు. కొన్ని చోట్ల మాత్రం అనువైన భవనాలు లేని కారణంగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల్లోనే ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాల, బాలికల బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. 2017–18లో ప్రారంభించిన 119 గురుకులాలను డిమాండ్‌ను బట్టి బాల బాలికలుగా విభజించినప్పటికీ... తాజాగా ప్రారంభిస్తున్న గురుకులాలతో బ్యాలెన్సింగ్ పద్ధతితో బాలబాలికల పాఠశాలలను ఏర్పాటు చేశారు. మొత్తం 257 బీసీ గురుకులాల్లో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించింది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించింది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న విద్యా సంస్థగా బీసీ గురుకుల సొసైటీ రూపుదాల్చనుంది. -
లక్షమంది బీసీలకు గురుకులాల విద్య
బహుజన సామాజిక వర్గాలలో మార్పుకు, అన్ని రంగాలలో వారు దూసుకుపోతూ శిరసెత్తుకుని నిలవటానికి విద్యే ప్రధాన సాధనమని చెప్పిన బహుజన పితామహులు మహాత్మాజోతిభాపూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ల ఆలోచనా ధారల్లో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. అందరూ మాటలు చెప్పేవారే కానీ ఆచరణ చేసి చూపే వారేరన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ అవతరణ తర్వాత బహుజన వర్గాలకోసం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు దినదినాభివృద్ధి చెందుతూ పురోభవిస్తున్నాయి. గురుకుల పాఠశాలలు పటిష్టవంతంగా నిలవటానికి కేసీఆర్ బలమైన పునాదులు వేస్తున్నారు. ఇది సబ్బండవర్ణాలు ఆహ్వానించదగ్గది మాత్రమే కాకుండా బహుజన వర్గాల చైతన్యానికి ఎంతో దోహదపడతాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు మూడు గురుకుల పాఠశాలలు, మూడు ప్రాంతాలలో మూడు జూనియర్, డిగ్రీ గురుకుల పాఠశాలలు నెలకొల్పటం, ఆ తర్వాత మానవవనరుల శాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలనే నవోదయ విద్యాసంస్థలుగా దేశవ్యాపితంగా ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాపితంగా 29 రాష్ట్రాలలో జిల్లాకు ఒకటి చొప్పున 600 నవోదయ విద్యాసంస్థలున్నాయి. 1986లో జాతీయ విద్యావిధానంలో భాగంగా 12వ తరగతి వరకు విద్యను బోధిస్తూ నవోదయ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం 906 గురుకుల పాఠశాలలు, 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. ఈ ఏడాది అంటే 2019 విద్యాసంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 56 ఏళ్లపాలనలో బీసీ రెసిడెన్షియల్ గురుకులాల సంఖ్యే 280 దాకా వచ్చాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గం పరిధిలోకి గురుకుల పాఠశాలలు వచ్చేశాయి. ఇది గుణాత్మక మార్పుగా చెప్పాలి. ఇది విప్లవాత్మక పరిణామం. అందరూ చెప్పేవారే కానీ ఈ వర్గాలలో విద్యాభివృద్ధికి కృషిచేసిన వారేరన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానంగా మిగులుతారు. సరిగ్గా బహుజన సమాజం కోరుకునేది అన్ని రంగాలలో తమ భాగస్వామ్యం. అందుకు తొలి మెట్లు విద్య. ఆ రంగంలో స్థిరపడితే అన్ని రంగాలలోకి బహుజనవర్గం దూసుకుపోతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు 90శాతం దాకా ఉన్నారు. ఈ వర్గాల అభ్యున్నతే తెలంగాణ అభివృద్ధి అన్న దార్శనికత కేసీఆర్‌కుంది. అందుకే ఈ వర్గాల సంక్షేమం దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఉంది. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏడాది లక్షన్నరకుపైగా ఖర్చుచేస్తూ పౌష్ఠికాహారం, దుస్తులు, మంచి చదువు, ఆరోగ్యకరమైన వాతావరణంలో గురుకుల పాఠశాలలున్నాయి. సమాజంలో సగభాగమైన బీసీల కోసం అదనంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పటంతో ఆయావర్గాలు హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ గురుకుల పాఠశాలలు రాబోయే 10 ఏళ్ల తర్వాత మరిన్ని మంచి ఫలితాలనిస్తాయి. ఇక్కడనుంచి తయారయ్యే విద్యార్థులు సమాజంలో జరిగే మార్పులకు కేంద్రబిందువుగా నిలుస్తారు. ఈ గురుకుల పాఠశాలలను బహుజనవర్గాలే కంటికి రెప్పలా కాపాడుకోవలసిన అవసరం ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలూ అందించనంత ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. బహుజన బిడ్డలకు సంతృప్తికరమైన పౌష్ఠికాహారంతోపాటు వారికి మంచి వైద్యసదుపాయాలు అంది స్తున్నారు. క్రీడల్లో, సాంస్కృతిక రంగాల్లో ఈ పిల్లలు శక్తివంతులుగా ఎదుగుతున్నారు. మొత్తంగా పదవతరగతి, ఇంటర్‌ఫలితాల్లో బహుజన విద్యాసంస్థలే అత్యధికశాతం ఫలితాలు సాధించటమేగాక ర్యాంకులన్నీ వీళ్లే స్వంతం చేసుకుంటున్నారు. ఆంగ్ల బోధనలో విద్యార్థులు సాధనచేస్తున్నారు. ఒక బీసీ గురుకులాల్లోనే లక్షమంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది బీసీ విద్యార్థులకు ఈ గురుకులాల ద్వారా విద్యనందించటం విశేషం. తెలంగాణ సమాజ మంతా శక్తివంతం కావటానికి ఈ స్కూళ్లు దోహదకారులవుతాయి. భవిష్యత్ కాలంలో రాబోయే విప్లవాత్మక మార్పులకు గురుకులాలనుంచి వచ్చిన వారే శ్రీకారం చుడతారు. బహుజన వర్గాల పిల్లల చైతన్యం గురుకులాల నిండా నిండి ఉన్నంతకాలం ఆ వర్గాల మనస్సులో తెలంగాణ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అదే జ్ఞాన తెలంగాణకు బాటలు వేస్తుంది. -జూలూరు గౌరీశంకర్ (వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్సభ్యులు ‘ 94401 69896) -
కొత్త గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న బీసీ గురుకుల విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే కొలువుదీరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయగా వాటిని 2019–20 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి తెచ్చేందుకు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కసరత్తు చేపట్టింది. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో భవనాలను మంజూరు చేయకపోవడంతో అద్దె ప్రాతిపదికన అనువైన భవనాలను వెతికింది. జూన్ 1 కల్లా వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించి ఏర్పాట్లు సైతం పూర్తి చేసింది. వాటిల్లో పూర్తిస్థాయి ఉద్యోగ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ భర్తీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పోస్టుల విభజనపై స్పష్టత లేకపోవడంతో వాటి భర్తీకి సంబంధించి గురుకుల నియామకాల బోర్డు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దీంతో ఈ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో సరిపెట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ చర్యలు తీసుకుంటోంది. 119 గురుకులాల్లో ఈ ఏడాది 5, 6 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య, తరగతుల సంఖ్యకు తగినట్లుగా బోధకులను సొసైటీ నియమించుకోనుంది. ఈ నేపథ్యంలో 119 గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కేటగిరీల్లో దాదాపు 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి త్వరలో బీసీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టనుంది. -
బీసీ గురుకులాలదే హవా
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ డంకా బజాయించింది. అత్యుత్తమ ఉత్తీర్ణతా శాతంతో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో 98.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులాలకు పోటాపోటీగా ముందుకెళ్లిన విద్యా శాఖ గురుకులాలు 98.54 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆదర్శ పాఠశాలలు (98.45), సాంఘిక సంక్షేమ గురుకులాలు (96.56), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (95.07) ఉన్నాయి. గురుకుల పాఠశాలల కేటగిరీలో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)ని మినహాయిస్తే మిగతా సొసైటీలన్నీ రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని (92.43) దాటడం గమనార్హం. పది పాయింట్లతో... గురుకుల పాఠశాలలు సాధించిన ఉత్తీర్ణత రికార్డు స్థాయిలో ఉండగా.. ఉత్తమమైన గ్రేడ్ పాయింట్లు సాధించిన పిల్లలు సైతం అధికంగానే ఉన్నారు. ఆదర్శ పాఠశాలల్లో 210 మంది, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 53 మంది, విద్యా శాఖ గురుకులాలకు చెందిన 20 మంది, బీసీ గురుకులాల్లో 13 మంది, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. నూరు శాతం ఫలితాలు సాధించిన కేటగిరీలో 13 బీసీ గురుకులాలు, 58 ఎస్సీ గురుకులాలు, 15 గిరిజన సంక్షేమ గురుకులాలు, 185 కేజీబీవీలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. ఎస్సీ హాస్టళ్లలో వసతి పొందుతూ ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంత్రి, అధికారుల అభినందనలు.. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ, బోధన, బోధనేతర సిబ్బందికి సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. ప్రత్యేక తరగతులతోపాటు ట్యూటర్లను ఏర్పాటు చేసి అభ్యసనం చేయించడం, రాత్రి వేళ ప్రత్యేక డైట్/స్నాక్స్ ఇవ్వడంతో ఫలితాల శాతం గణనీయంగా పెరిగిందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరుతో పాటు కష్టపడి చదివి పరీక్షలు రాసిన పిల్లలకు అభినందనలు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలతో ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చామని విద్యా శాఖ గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బీసీ గురుకులాలతో సమానంగా విద్యాశాఖ గురుకులాలు పోటీ పడ్డాయని స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ మరింత మెరుగైన పనితీరుతో అగ్రస్థానం కైవసం చేసుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. సర్కారీ సూళ్లది వెనుకబాటే.. పదో తరగతి ఫలితాల్లో సర్కారీ స్కూళ్లు వెనుకబడ్డాయి. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటంతోపాటు విద్యార్థుల సంఖ్య సైతం పెద్ద మొత్తంలో ఉంది. దీంతో ఫలితాల్లో కొంత వెనుకబాటు సహజమే అయినప్పటికీ.. రాష్ట్ర సగటుకు ఆమడ దూరంలో ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా పరిషత్ పాఠశాలలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే విధంగా ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా నమోదు కాలేదు. గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలు మాత్రం ఫలితాల్లో వెనుకబడ్డాయి. రాష్ట్ర సగటును అందుకోకపోగా 9 శాతానికిపైగా విద్యార్థులు ఫెయిలైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
అద్దె భవనాలు కావాలి ‘గురు’!
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ అద్దె భవనాల వెతు కులాటలో పడింది. 2019–20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వీటికి శాశ్వత భవనాలు లేనందున అద్దె భవనాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని వెతికేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ఏప్రిల్ నెలాఖరులోగా అద్దె భవనాలను గుర్తించి లొకేషన్లు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు బీసీ గురుకుల సొసైటీ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురుకుల పాఠశాలలను నెలకొల్పే విస్తీర్ణంలో భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. 20 వేల చదరపు అడుగుల భవనం... ఒక గురుకుల పాఠశాల ఏర్పాటుకు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ఐదు నుంచి పదో తరగతి వరకు రెండేసి సెక్షన్లు... ఒక్కో సెక్షన్లో నలభై మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతిగృహాలు, డైనింగ్ హాలు, కిచెన్, మూత్రశాల, స్టాఫ్ రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, స్టోర్ రూమ్ తదితరాలకు కచ్చితంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల భవనం కావాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, క్షేత్రస్థాయిలో అంత విస్తీర్ణమున్న భవనాల లభ్యత కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం మంజూరు చేసిన గురుకుల పాఠశాలల ఏర్పాటును అతి కష్టంగా పూర్తి చేసిన అధికారులకు ప్రస్తుత లక్ష్యం సాధించడం ‘కత్తి మీద సాము’లా మారింది. పాత వాటిలో ప్రారంభిస్తే... రెండేళ్ల క్రితం బీసీ గురుకుల సొసైటీ 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాలను అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త గురుకులాలకు భవనాలు లభించకుంటే ఇప్పుడు నడుస్తున్న భవనాల్లో ఒక భాగంలో కొత్త గురుకులాలను ప్రాథమికంగా ప్రారంభించే అంశంపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భవనాల లభ్యత ఆశాజనకంగా లేదు. మరోవైపు పట్టణీకరణ నేపథ్యంలో అద్దె సైతం ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే రెట్టింపు ఉంది. ఈ క్రమంలో కొత్త గురుకులాల ఏర్పాటు ఎలా ఖరారు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వచ్చే నెల రెండోవారం వరకు ప్రయత్నాలు జరిపి తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
గురుకుల పాఠశాల విద్యార్థులను తల్లిదండ్రుల్లా ఆదరించాలి
మిర్యాలగూడ రూరల్ : గురుకుల పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లా ఆదరించాలని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు సూచించారు. బుధవారం మిర్యాలగూడ మండలంంలోని శ్రీనివాసనగర్ గల బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లు, డేటా ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులను వదిలి గురుకులాలకు వచ్చిన విద్యార్థులకు కొంత బెరుకు, భయం ఉంటుందని, వారికి కా వాల్సినవన్నీ సమకూర్చడంతో పాటు పాఠశాలను తన ఇల్లుగా నమ్మకం కలిగించాలని సూ చించారు. అప్పుడే వారు ఇష్టంగా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తారని చెప్పారు. అనంతరం పాఠశాలలో నీటి కొరత ఉన్న విషయం తెలుసుకున్న ఆయన తాగునీరు అందించే బోరును పరిశీలించారు. అదనంగా మరో బోరు వేసి సమస్య తీర్చాలని ప్రిన్సిపాల్ వెంకటప్పయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ గురుకుల ప్రిన్సి పాల్ భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, కత్తుల శంకర్, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ‘కార్పొరేట్’కు దీటుగా బీసీ గురుకులాలు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ గురుకులాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాణిస్తున్నాయని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు అన్నారు. బుధవారం శ్రీనవాసనగర్లో గల గురుకుల పాఠశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రవేశపెట్టిన 30 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందకు ప్రభుత్వం స్థలం కేటాయిం చిందన్నారు. 12 పాత పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించేందుకు ఒక్కొ క్క పాఠశాలకు 10 ఎకరాల స్థలం కేటాయించిందని చెప్పారు. ఒక్కొ క్క పాఠశాల భవనానికి రూ.20కోట్ల చొప్పున రూ.240 కోట్లు నిధులు ప్ర భుత్వం విడుదల చేసిందని తెలిపారు. గత సంవత్సరం తాత్కాలిక బోధన సిబ్బంది స్థానంలో కొత్తగా 2000 మంది బోధనా సిబ్బందిని నియమించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మరో 800 మంది బోధనేతర సిబ్బంది (క్రాఫ్ట్, డ్రాయింగ్, పీఈ టీ)ని త్వరలో నియమించనున్న ట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు డిజిటల్ క్లాసులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాఠశాలలకు ఫర్నిచర్ అందజేశామని, ఈ సంవత్సరం సైన్స్ ల్యాబ్, గ్రంథాలయాలు ఏ ర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ గురుకుల బోధనపై తల్లి దండ్రులకు నమ్మకం పెరిగిందని తెలి పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ గురకులాల రీజినల్ కోఆర్డినేటర్ ఎం.షకీనా, ప్రిన్సి పాల్స్ వెంకటప్పయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
బీసీ గురుకులాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలలకు డిమాండ్ పెరిగింది. బీసీ గురుకుల జూనియర్ కాలేజీలు, పాఠశాలలు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలతో క్షేత్రస్థాయిలో ప్రవేశాలకోసం పోటీ తీవ్రమైంది. ఇటీవల బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. తాజా ప్రవేశాల్లో పదోవంతు సీట్లు అత్యంత ప్రతిభావంతులే దక్కించుకోవడం గమ నార్హం. రాష్ట్రంలో 19 బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 3,040 సీట్లుండగా, 24,327 మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సీట్ల కేటాయింపు పూర్తయింది. వీరిలో ఏకంగా 10 శాతం విద్యార్థులు 9జీపీఏ కంటే ఎక్కువ మార్కులు సాధించినవారే ఉండటం గమనార్హం. మిగతా 40శాతం సీట్లు 8.5 నుంచి 9జీపీఏ లోపు మార్కులు సాధించినవారు న్నారు. సాధారణంగా 9జీపీఏ కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానిక జూనియర్ కాలేజీలు ఉచిత విద్య లేదా ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటి అవకాశాలను వదులుకుని బీసీ గురుకులాల్లో సీట్ల కోసం పోటీపడటం విశేషం. 2017–18 సంవత్సరంలో బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 98శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎస్సీ, ఎస్టీ, గురుకులాల కంటే బీసీ గురుకులాలు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశాయి. తొలివిడతలో 92శాతం భర్తీ రాష్ట్రంలో 142 బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో ఐదోతరగతికి సంబంధించి 11,360 సీట్లు భర్తీ చేసేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 45 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా సీట్ల కేటా యింపు కౌన్సెలింగ్ తొలివిడత పూర్తయింది. ఇందు లో 10,382 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 938 సీట్లను రెండోవిడతలో భర్తీ చేసేందుకు బీసీ గురు కుల పాఠశాలల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి సీట్ల భర్తీలో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు కత్తెర వేసింది. గతేడాది కొత్తగా 119 గురుకుల పాఠ శాలలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించగా, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలు తీసుకొచ్చిన వారికి అడ్మిషన్లలో ప్రాధా న్యత ఇచ్చారు. తాజాగా ప్రవేశాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధా రంగా సీట్లు భర్తీ చేసినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ‘సాక్షి’తో చెప్పారు. -
12న బీసీ గురుకులాలు ప్రారంభం
మంత్రి జోగు రామన్న వెల్లడిl సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12న 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలను లాంఛ నంగా ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభి స్తారని చెప్పారు. అన్ని హంగులతో అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. కేసీఆర్ ప్రకటించిన మేరకు తొలిసారిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కటి చొప్పున గురుకులాలను మంజూరు చేశారన్నా రు. మంగళవారం సచివాలయం నుంచి 31 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా గురుకులాల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బీసీ గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణానికి పది ఎకరాల చొప్పున భూమిని సేకరించినట్లు, వీటి నిర్మాణాలు పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017–18లో 5, 6 తరగతులతో ప్రారంభించనున్న ఈ గురుకులాలతో 41,863 మంది విద్యార్థులు లబ్ధిపొందుతారని వివరించారు. నాలుగేళ్లలో ఇంటర్ స్థాయికి ఈ గురుకులాలను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్, కమిషనర్ జీడీ అరుణ, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, జేడీ కె.అలోక్‌కుమార్ పాల్గొన్నారు.