
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న బీసీ గురుకుల విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే కొలువుదీరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయగా వాటిని 2019–20 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి తెచ్చేందుకు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కసరత్తు చేపట్టింది. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో భవనాలను మంజూరు చేయకపోవడంతో అద్దె ప్రాతిపదికన అనువైన భవనాలను వెతికింది. జూన్ 1 కల్లా వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించి ఏర్పాట్లు సైతం పూర్తి చేసింది. వాటిల్లో పూర్తిస్థాయి ఉద్యోగ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ భర్తీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
పోస్టుల విభజనపై స్పష్టత లేకపోవడంతో వాటి భర్తీకి సంబంధించి గురుకుల నియామకాల బోర్డు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దీంతో ఈ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో సరిపెట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ చర్యలు తీసుకుంటోంది. 119 గురుకులాల్లో ఈ ఏడాది 5, 6 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య, తరగతుల సంఖ్యకు తగినట్లుగా బోధకులను సొసైటీ నియమించుకోనుంది. ఈ నేపథ్యంలో 119 గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కేటగిరీల్లో దాదాపు 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి త్వరలో బీసీ గురుకుల సొసైటీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment