- మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు రోడ్డుపై బైఠాయింపు
- పలువురి అరెస్ట్
- పర్యటనను వాయిదా వేసుకున్న మంత్రి
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఓయూ విద్యార్థులు నాలుగో రోజు కూడా ఆందోళన చేపట్టారు. సోమవారం ఆంధ్ర మహిళా సభలో ఏర్పాటు చేసిన నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తక వికాస కేంద్రాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ముందుగానే తెలుసుకున్న ఓయూ విద్యార్థులు అక్కడి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌ను అడ్డుకొని నిరసన తెలపాలని రోడ్డు పై బైఠాయించారు.
విద్యార్థి నాయకులను వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు నిరాకరించిన విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని నినదించారు.ట్రాఫిక్ జామ్ కావడంతో, పోలీసులు 11 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఓయూ పోలీస్‌స్టేషన్ ఎదుట మరికొందరు విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఓయూలోని పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.