National Book Trust
-
ఎన్బీటీపైనా స్మృతి ఇరానీ పెత్తనమేనా!
న్యూఢిల్లీ: సాహిత్య ప్రియులకు ప్రోత్సాహకరంగా గత ఆరు శతాబ్దాలుగా పనిచేస్తున్న ‘నేషనల్ బుక్ ట్రస్ట్’పైనా కాషాయం రంగు పడింది. ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పుస్తకాల క్రయవిక్రయాల ఆర్థిక లావాదేవీలను ఓ ప్రైవేటు ప్రొఫెషనల్ కంపెనీకి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించే వ్యవస్థను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకపక్షంగా రద్దు చేశారు. ఈ విషయంలో నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్‌నుగానీ, ట్రస్టీ సభ్యులనుగానీ ఏమాత్రం సంప్రతించకుండానే ఏకపక్షంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ట్రస్టీ సభ్యులను ఎన్నుకోవాల్సిన అంశం పెండింగ్‌లో ఉన్నందున తాను స్మృతి ఇరానీ ఉత్తర్వులపైనా స్పందించలేనంటూ నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ బల్దేవ్ శర్మ ఆ ఉత్తర్వులను పక్కన పెట్టగా, ట్రస్ట్ డెరైక్టర్ రీటా చౌధురి వాటిని ఆగమేఘాలపై అమలు చేశారు. రీటా చౌధురి అస్సాం బీజేపీ నాయకుడు చంద్రమోహన్ పట్వారీ భార్య. నేషనల్ బుక్ ట్రస్ట్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయినప్పుడు, దానికొక ట్రస్టీ ఉన్నప్పుడు ఏకపక్షంగా మంత్రి ఉత్తర్వులు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించగా, తమ సంస్థ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కేంద్ర మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్నందున ఆ శాఖ మంత్రి స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు వాటిని అమలు చేయక తప్పదని రీటా చౌధురి మీడియాతో వ్యాఖ్యానించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ బల్దేవ్ శర్మ కూడా బీజేపీ పరివారంకు చెందిన వ్యక్తే అయినప్పటికీ పాత సంప్రదాయాలను పాటించేందుకు మొగ్గు చూపారు. అయితే రీటా చౌధురి తీసుకున్న చర్యలపై ఆయన ఎలా స్పందిస్తారా? అన్న అంశంపై ఆయన నిజాయితీ ఆధారపడి ఉంది. బల్దేవ్ శర్మ ఆరెస్సెస్ నడిపిన ‘పాంచజన్య’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఆయన్ని బుక్ ట్రస్ట్ చైర్మన్‌గా నియమించింది. అప్పటి వరకు వామపక్ష భావాలున్న లేదా మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేసిన చరిత్రకారులు, విద్యావేత్తలు ట్రస్ట్ చైర్మన్లుగా కొనసాగుతూ వచ్చారు. శర్మకు ముందు సేతుమాధవన్, అంతకు ముందు ప్రముఖ హిస్టారియన్, రచయిత బిపన్ చంద్ర చైర్మన్‌గా ఉన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి సాహిత్యం పట్ల ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో వాటిని అందుబాటు ధరల్లో అందించేందుకు 1957లో ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పాటయింది. ఇంగ్లీషు, హిందీ భాషలతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ ట్రస్ట్ ఉత్తమ సాహిత్యాన్ని ఇప్పటివరకు అందిస్తూ వచ్చింది. 2009 నుంచి 2011 మధ్య పుస్తకాల క్రయ,విక్రయ లావాదేవీల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆడిట్ నివేదికలో వెల్లడైంది. దీంతో ట్రస్ట్గానీ, ట్రస్టీ సభ్యులకుగానీ సంబంధంలేని ప్రొఫెషనల్ సంస్థకు ఆర్థిక లావాదేవీలను అప్పగిస్తే మంచిదని అప్పటి చైర్మన్ బిపన్ చంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తర్వాత ఆ పదవిని చేపట్టిన సేతుమాధవన్ అమలు చేశారు. 2013లో అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం ప్రకారం టెండర్ ప్రిక్రియ ద్వారా ‘గ్లోబస్ లాగిసిస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి మూడేళ్ల పాటు అప్పగించారు. అలాగే ఆర్థిక అక్రమాలపై దర్యాప్తునకు కూడా ఆదేశించారు. ఆ దర్యాప్తు నివేదిక ఇంకా అందకముందే ఈ టెండర్ ప్రక్రియను రద్దుచేస్తూ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ స్మృతి ఇరానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం ట్రస్టీ సభ్యులు ఖరారు చేసిన పుస్తకాలనే నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురిస్తూ వచ్చింది. ఎక్కువకాలం అధికారంలోవున్న కాంగ్రెస్ ఏ పుస్తకాలు ప్రచురించాలనే విషయంలో పరోక్ష ప్రమేయం ఉండొచ్చేమోగానీ ఏనాడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రస్టీ అభిప్రాయానికే అవకాశం ఇవ్వలేదంటూ మున్ముందు పుస్తకాల ఎంపికలో కూడా వారికి స్వేచ్ఛనివ్వకపోవచ్చు. ఇక నేషనల్ బుక్ ట్రస్ట్‌లో ‘ట్రస్ట్’ ఎగిరిపోయినట్లే. -
పుస్తకం... ప్రియనేస్తం
చదువరి చెంతకు పుస్తకరాజం బహుభాషల భాగ్యనగరిలో బుక్‌ఫెయిర్‌కు అపూర్వ ఆదరణ పాఠకుడి వద్దకు పయనమైన ‘వట్టికోట’ మూడుపదులకు చేరువైన పుస్తక ప్రదర్శన హైదరాబాద్ బుక్‌ఫెయిర్...మూడు దశాబ్దాలుగా చదువరి చెంతకే సాగుతున్న పుస్తక లోకమిది. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో ఏటేటా పుస్తకం వేడుక చేసుకుంటూనే ఉంది. లక్షలాదిగా తరలి వచ్చే పాఠక మహాశయుల జ్ఞానదాహార్తిని తీరుస్తూనే ఉంది. ఎనిమిదో దశాబ్దంలో మొదలై 28 ఏళ్లుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న పుస్తకప్రదర్శనకు మొదటి నుంచి పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజు వేలాది మంది పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకం కోసం తరలి రావడమే ఇందుకు నిదర్శనం. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలపై పాఠకులు మక్కువ చూపుతున్నారు. బుక్‌ఫెయిర్ సందర్భంగా నగరంలో పుస్తక ప్రదర్శన చారిత్రక నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలో 1980లలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైనప్పటికీ అంతకుముందే పుస్తకాన్ని పాఠకుడి దగ్గరకు తీసుకొని వెళ్లే సంప్రదాయానికి రచయిత, ప్రచురణకర్త వట్టికోట ఆళ్వారుస్వామి శ్రీకారం చుట్టారు. పుస్తకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచనకు తావులేని రోజుల్లో ఆయన తాను ముద్రించిన పుస్తకాలను నెత్తిన పెట్టుకొని పాఠకుల ద గ్గరకు వెళ్లారు. ఇదంతా 1938 నాటి సంగతి. ఆ సంవత్సరం సికింద్రాబాద్‌లో ‘దేశోద్ధారక గ్రంథమాలను’ ప్రారంభించిన వట్టికోట ఆ సంస్థ నుంచి 100 పుస్తకాలను ప్రచురించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1948 నాటికి సుమారు 50 పుస్తకాలను ముద్రించారు. 1948లో అరెస్టై ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చాక తాను చనిపోయే(1961) వరకు పలు పుస్తకాలను ముద్రించారు. నిజానికి నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్ధూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడం భాషలకు చెందిన ప్రజలతో పాటు హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివే ప్రజలు కూడా మొదటి నుంచీ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్‌గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతోధిక కృషి కొనసాగిస్తూనే ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్టు కృషి... నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థల ఆకాంక్షలను నేషనల్ బుక్‌ట్రస్టు పరిపూర్తి చేసింది. నేషనల్ బుక్ ట్రస్టు ఇక్కడి సంస్థలతో కలిసి 986 ప్రాంతంలో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను కేశవ మొమోరియల్ స్కూల్ మైదానంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. కథలు, నవలలు, గుల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే ఇక్కడ అగ్రస్థానం. చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్ధనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్‌రావు వంటి ప్రముఖుల గ్రంథాలను పాఠకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. సోవియెట్ సాహిత్యం కూడా బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. ‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు... ఈ నెల 21న ఎమెస్కో పుస్తక ఆవిష్కరణ 22న రాజకీయ పార్టీల నేతలతో చర్చా కార్యక్రమం 23న పత్రికా సంపాదకుల సమావేశం 24న పుస్తకావిష్కరణ, జయరాజ్ పాటల కార్యక్రమం 25న సైన్స్ డ్రామా 26న ముగింపు, స్పీకర్ మధుసూధనాచారి హాజరు. పిల్లలను చదివించండి ప్రపంచీకరణ తరువాత జీవన వేగం బాగా పెరిగింది. నవలలు,కథలు వంటి పుస్తకాలకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పుటికీ మిగతా వాటికి బాగానే ఉంది. అయితే ఇప్పటి పిల్లలు ఫేస్‌బుక్‌లు, స్మార్ట్ఫోన్లకు పరిమితమైపోవడమే బాధగా ఉంది. పిల్లల్ని చదివించాలి.తల్లిదండ్రులు బాధ్యతగా ఆ పని చేయాలి.సామాజిక చైతన్యాన్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని కలిగించేవి, ఉన్నతమైన విలువలను బోధించే పుస్తకాలను తప్పనిసరిగా చదివించాలి. - లలితా జోషి ( మొట్టమొదటి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ సభ్యురాలు) -
కొనసాగిన ఓయూ విద్యార్థుల ఆందోళన
మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు రోడ్డుపై బైఠాయింపు పలువురి అరెస్ట్ పర్యటనను వాయిదా వేసుకున్న మంత్రి ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఓయూ విద్యార్థులు నాలుగో రోజు కూడా ఆందోళన చేపట్టారు. సోమవారం ఆంధ్ర మహిళా సభలో ఏర్పాటు చేసిన నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తక వికాస కేంద్రాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ముందుగానే తెలుసుకున్న ఓయూ విద్యార్థులు అక్కడి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌ను అడ్డుకొని నిరసన తెలపాలని రోడ్డు పై బైఠాయించారు. విద్యార్థి నాయకులను వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు నిరాకరించిన విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని నినదించారు.ట్రాఫిక్ జామ్ కావడంతో, పోలీసులు 11 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఓయూ పోలీస్‌స్టేషన్ ఎదుట మరికొందరు విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఓయూలోని పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. -
ప్రతీ పుస్తకం పాఠకుడికి చేరాలి..
కవాడిగూడ,న్యూస్‌లైన్: రచయితలు తాము రచించే పుస్తకాలు పాఠకులకు చేరేలా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని ‘సాక్షి’ ఫీచర్స్ జర్నలిస్టు ఖదీర్‌బాబు సూచించారు. నేషనల్ బుక్‌ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ఫెయిర్లో బుధవారం సాయంత్రం ‘పుస్తక పఠనం-మీడియా పాత్ర’ అన్న అంశంపై సెమినార్ జరిగింది. దీనికి ఖదీర్‌బాబు (సాక్షి), కె.రామచంద్రమూర్తి(హెచ్ఎంటీవీ),రామారావు(ఈనాడు), వక్కలంక రమణ(ఆంధ్రజ్యోతి),వల్లీశ్వర్(ఆంధ్రప్రదేశ్ ఎడిటర్),ప్రసాదమూర్తి (టెన్‌టీవీ), ఉదయశంకర్ (ఈటీవీ2) తదితరులు పాల్గొని మాట్లాడారు. తొలుత ఖదీర్‌బాబు మాట్లాడుతూ మీడియా అధిపతులు లాభనష్టాలను ఆలోచించకుండా పుస్తక సమీక్షలకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. వందేళ్లకాలంలో వచ్చిన కథలను ‘సాక్షి’ పరిచయం చేసినట్లు గుర్తుచేశారు. కొత్త పత్రికలు వచ్చినప్పుడల్లా కొత్త పాఠకులు తయారవుతారని చెప్పారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రజలకు ఆసక్తి కలిగించేలా సాహిత్యం రావాల్సి ఉందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నేషనల్ బుక్‌ట్రస్టు తెలుగు సంపాదకులు డాక్టర్ పత్తిపాటి మోహన్, ఎమెస్కో బుక్ పబ్లిషర్ విజయ్‌కుమార్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ: ప్రముఖ క్రీడాపాత్రికేయులు సి.హెచ్ .కృష్ణారావు రచించిన ‘క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్’ పుస్తకాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ హాకీ కెప్టెన్ ముఖేష్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎంటీవీ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి, భారత క్రికెట్జట్టు మాజీ మేనేజర్ చాముండేశ్వర్, క్రీడావిశ్లేషకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక మేళా కిటకిట
కవాడిగూడ, న్యూస్‌లైన్: నేషనల్ బుక్ ట్రస్టు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక మేళాకు విశేష స్పందన వస్తోంది. ఆదివారం ఒక్క రోజే 20 వేల మందికి పైగా సందర్శించి నట్టు బుక్‌ఫెయిర్ ఇన్చార్జి పి.మోహన్ తెలిపా రు. ఎక్కువగా అకడమిక్, కథల పుస్తకాలు అమ్ముడుపోయాయన్నారు. వీటి తరువాత సామాజిక, రాజకీయ పుస్తకాలకు డిమాండ్ కని పించింది. అన్నిరకాల పుస్తకాలు ఒకే చోట లభించడంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. డి.వెంకటేశ్వర్రావు రచించిన ‘హౌ చిల్డ్రన్ లెర్న్ అండ్ హౌ స్కూల్స్ షుడ్ టీచ్’ పుస్తకాన్ని విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. పీకాక్ క్లాసిక్స్ ఆఫర్ ఈ ఎగ్జిబిషన్‌లోని స్టాల్స్‌లో వేటికవే సాటి. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక పబ్లిషర్లు స్టా ల్స్‌లో ప్రపంచ సాహిత్యాన్ని వివిధ భాషలలో అందజేస్తున్నారు. ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రపంచ భాషల్లోని ఉత్తమ సాహిత్యాన్ని తేటతెలుగు లో అందిస్తోంది. తల్లిదండ్రులు, పాఠశాలల నుంచి గత ఏడాది లభించిన ఆదరణను దృష్టి లో ఉంచుకుని ఈసారి తమ స్టాల్ (ఎ84)లో తగ్గింపు ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నట్టు సంస్థ ఎడిటర్ ఎ.గాంధీ తెలిపారు. అన్నీ ఒకే చోట కావల్సిన పుస్తకాల కోసం ఒక్కో దుకాణం తిరగాలి. అయినా దొరుకుతాయన్న గ్యారెంటీ ఉండదు. ఈ ఫెయిర్‌లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. సమాజంలో ఇతర వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలిపే పుస్తకాలు బాగా నచ్చాయి. అకడమిక్‌తో పాటు కొన్ని జనరల్ పుస్తకాలు నాకు ఇక్కడ లభించాయి. - వేదప్రియ, విద్యార్థిని ప్రపంచ స్థాయి పుస్తకాలు ఈ ఫెయిర్‌లో సాధారణ పుస్తకాలతో పాటు ప్రపంచ స్థాయి పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల వారికీ అవసరమైన అన్ని రకాల బుక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫెయిర్ ఎంతో బాగుంది. - లక్ష్మీప్రసాద్, సందర్శకుడు