ప్రతీ పుస్తకం పాఠకుడికి చేరాలి..
కవాడిగూడ,న్యూస్‌లైన్: రచయితలు తాము రచించే పుస్తకాలు పాఠకులకు చేరేలా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని ‘సాక్షి’ ఫీచర్స్ జర్నలిస్టు ఖదీర్‌బాబు సూచించారు. నేషనల్ బుక్‌ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్‌ఫెయిర్‌లో బుధవారం సాయంత్రం ‘పుస్తక పఠనం-మీడియా పాత్ర’ అన్న అంశంపై సెమినార్ జరిగింది. దీనికి ఖదీర్‌బాబు (సాక్షి), కె.రామచంద్రమూర్తి(హెచ్‌ఎంటీవీ),రామారావు(ఈనాడు), వక్కలంక రమణ(ఆంధ్రజ్యోతి),వల్లీశ్వర్(ఆంధ్రప్రదేశ్ ఎడిటర్),ప్రసాదమూర్తి (టెన్‌టీవీ), ఉదయశంకర్ (ఈటీవీ2) తదితరులు పాల్గొని మాట్లాడారు.
తొలుత ఖదీర్‌బాబు మాట్లాడుతూ మీడియా అధిపతులు లాభనష్టాలను ఆలోచించకుండా పుస్తక సమీక్షలకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. వందేళ్లకాలంలో వచ్చిన కథలను ‘సాక్షి’ పరిచయం చేసినట్లు గుర్తుచేశారు. కొత్త పత్రికలు వచ్చినప్పుడల్లా కొత్త పాఠకులు తయారవుతారని చెప్పారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రజలకు ఆసక్తి కలిగించేలా సాహిత్యం రావాల్సి ఉందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నేషనల్ బుక్‌ట్రస్టు తెలుగు సంపాదకులు డాక్టర్ పత్తిపాటి మోహన్, ఎమెస్కో బుక్ పబ్లిషర్ విజయ్‌కుమార్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణ: ప్రముఖ క్రీడాపాత్రికేయులు సి.హెచ్ .కృష్ణారావు రచించిన ‘క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్’ పుస్తకాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ హాకీ కెప్టెన్ ముఖేష్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంటీవీ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి, భారత క్రికెట్‌జట్టు మాజీ మేనేజర్ చాముండేశ్వర్, క్రీడావిశ్లేషకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.