దేశంలో టెక్నాలజీ, మీడియా, టెలికమ్యునికేషన్(టీఎంటీ) విభాగాల్లో కృత్రిమమేధ(ఏఐ) ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ కేపీఎంజీ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)2024లో ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని నివేదిక పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు(సీడీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లను సంప్రదించి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు కేపీఎంజీ ప్రతినిధులు తెలిపారు.
నివేదికలోని వివరాల ప్రకారం..టీఎంటీ విభాగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికాం రంగంలో నెట్‌వర్క్‌ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా కంటెంట్‌ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది.
55 శాతం టీఎంటీ సంస్థలు పూర్తిగా ఏఐను వినియోగిస్తున్నాయి.
37 శాతం సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వాడేందుకు వివిధ దశల్లో పని చేస్తున్నాయి.
40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరుగైన అంచనాను సాధించడానికి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఏఐను వాడుతున్నాయి.
టెలికాం రంగంలో ఎక్కువగా ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.
టెలికాం రంగంలో ఏఐ వల్ల 30 శాతం సేవల నాణ్యత మెరుగుపడుతుందని కంపెనీలు అనుకుంటున్నాయి. రాబడి వృద్ధి 26%, మోసాల నివారణ 32% పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.
సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవవనరులు లేవు.27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాయి.
సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల్లోని వర్క్‌ఫోర్స్‌లో 30-50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు.
టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని విధానాలు పాటించాలని కేపీఎంజీ సూచనలు చేసింది. ‘మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి. ఖర్చులను తగ్గించడానికి నెట్‌వర్క్ ఆటోమేషన్‌పై దృష్టి సారించాలి. 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్‌లను అందించాలి. అందుకు హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలి. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్‌లతో కలసి పని చేయాలి. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు’ అని తెలిపింది.
ఇదీ చదవండి: రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) పార్ట్‌నర్ అఖిలేష్ టుతేజా మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత మెరుగ్గా సేవలందిస్తోంది. కేవలం టీఎంటీ రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment