ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్‌పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్‌లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్‌స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment