Khadirbabu
-
నిన్న మొన్నటి వేసవి
ఉబ్బరింతల సెలవు దినాల మధ్యాహ్నం నిద్రపట్టని పిల్లవాడి గుట్టుచప్పుడు కాని అల్లరి.... ఎండ పూర్తిగా చల్లారక ముందే సెగవెలుతురు సాయంత్రాన గోరింటాకు కోసుకోవడానికి వచ్చిన ఆడపిల్ల పూలపూల గౌనూ హైహీల్ బాదంకాయ స్లిప్పర్లూ... జామచెట్టుకు అంత వైనంగా ఉండదని తెలిసినా అరాకొరా తాళ్లు కట్టి ఉయ్యాల ఊగినంత పని చేస్తూ పకపకలు పోయే పిల్లల నవ్వు వినడానికి వాలే కాకుల కావుకావు... శుష్కమైన రొమ్ముల మీద నిరభ్యంతరంగా కొంగు తొలగించి ముసలమ్మ వొదిలే అష్షుబుష్షు... ఏదో ఒక స్టేషన్లో పాట తగలకపోతుందా అని రేడియోను ట్యూన్ చేస్తూ పట్టీల పాదాలను పదేపదే తాటించే వయసుకొచ్చిన అమ్మాయి వొయ్యారయత్నం... ఆ కిటీకీలు మూయండి అని ఆర్డరేసి భోజనానంతర కునుకు కోసం పక్కకు వొత్తిగిలి కళ్లకు మోచేయి అడ్డుపెట్టుకున్న నాన్న బొజ్జ ప్రతి శ్వాసకు పడే ఎగుడు దిగుడు.... నిన్న మొన్నటి వేసవి... ఎటు పోయెను ఆ వేసవి... నడియీడు కాయలు కాసిన మామిడిచెట్టు మీద నిర్భయంగా రాయి విసరడానికి చూసే తుంటరి... ఎప్పుడో ఒకప్పుడు తప్ప దొరకని కెంపూ ఆకుపచ్చ చింతచిగురూ.... సందేళ ఏదో ఒక మిషన వచ్చి పెరట్లో పూసిన తెల్లటి మొగ్గలను రెండు మూడైనా ఇమ్మని ప్రాథేయపడి జడలో ముడిచిన వెంటనే తానే ఒక మల్లెపొదై మురిసే సాదాసీదా ఇల్లాలు... నీళ్లు తడిపిన బట్టలో చక్కెర కలుపుకొని తాగడానికి దాచిన ఆకుపచ్చ నిమ్మకాయల పెన్నిధి... ఎవరైనా వస్తే బాగుండు రస్నా ఇచ్చి మర్యాద చేద్దామనుకునే పటాటోప గృహస్తు... అర్ధగడియలో ఆరిపోయి తీగన వృధాగా వేళ్లాడుతున్న ఉతికిన వస్త్రాలు... వరండాలో అమ్మలక్కలు కాలు సాచి కూచుని ఆడే చింతపిక్కలూ పరమపద సోపానపటమూ వామనగుంటలూ... నీళ్లు నిండి ప్రశాంత చిత్తధారి అయిన సిమెంటు తొట్టె... పూర్తిగా గడ్డిపరకలు దులుపుకోని కొత్తజాడీ... సానబట్టిన కత్తికి సాగిలపడటానికి సిద్ధమైన చెట్టుకాయ... నిన్న మొన్నటి వేసవి... ఎటు పోయెను ఆ వేసవి... నలుపు తిరిగిన ఆకాశమూ... సముద్రం మీదుగా కనికరంతో వీస్తున్న చల్లగాలి.... అమ్మ జట్టుగా ఉండే ఒక కొడుకు డాబా మీద కుమ్మరించిన నీళ్లతో రేగి అణిగిన వేడి... రిపేరు చేయించిన టేబుల్ ఫ్యానుకు పక్కల దగ్గర చేసిన ప్రత్యేక ఏర్పాటు... వరుస తీరిన మంచాలతో ఇరుకు వీధికి వచ్చే డార్మిటరీ కళ... తలుపులన్నీ తెరిచి వేసే సెకండ్ షో కోసం కొత్తగా లుంగీ కట్టుకొని సిద్ధమయ్యే టెన్త్ రాసిన కుర్రాడూ వాడి టికెట్ తక్కువ డబ్బు మిత్రబృందమూ.... దొంగలు దిగారన్న పుకార్లకు కమ్మలు బేసర్లు కూడా ఏమీ ఎరగనట్టుగా దాచి వాకిలి దగ్గర దుప్పటి కప్పుకుని పడుకునే గృహిణి... స్తంభించిన గాలికి అర్ధరాత్రి ప్రాప్తమయ్యే బూతు తిట్టు... చిన్న పిల్లలకు స్తన్యమిచ్చేందుకు సిద్ధంగా ఉండే కూజాలు... తెల్లవారుజామున ఆ దారిన వెళ్తూ ఆశీర్వదించే దేవతలు... వెలుతురు వచ్చే కొద్దీ నీడకు జరుపుకుంటూ వెళుతూ చేసే నిద్దరలు... నిన్న మొన్నటి వేసవి... ఎటు పోయెను ఆ వేసవి... ముంజలు అమ్మేవారు బతుకుతారు... కొత్తకడవకు తడివస్త్రం చుట్టి చల్లను అమ్మేవారు బతుకుతారు... గాఢ నీలిరంగు గోళీని చూపుడు వేలుతో చప్పుడొచ్చేలా నొక్కి సోడాలమ్మేవారు బతుకుతారు... కొత్త తాటిఆకులు తెచ్చి చలువ పందిళ్లు కట్టేవాళ్లు బతుకుతారు... ఒక పుచ్చకాయను అనేక అర్ధచంద్రాకారాలుగా కోసే ఆ కళాకారుడు బతుకుతాడు.... ఎండను పనిముట్టుగా మలుచుకోగల ప్రతి ఒక్కడూ బతుకుతాడు... చివరకు బెట్టకు జడిసి చీకటి పడ్డాకే తిరుపానికి వచ్చే భిక్షగాడూ బతుకుతాడు.... ప్రాణప్రదాయిని వేసవి... బతుకు ప్రదాయిని వేసవి... నిన్న మొన్నటి వేసవి... ఎటు పోయెను ఆ వేసవి... వెలుతురు వల్ల జగతి. ఉష్ణం వల్ల జగతి. త్వరగా వచ్చి ఆలస్యంగా వెళ్లే వేసవి ఎండ వల్ల జగతి. కార్యకలాపాలు ఉత్సాహంగా కొనసాగే ఈ కాలపు జగతి. ఇప్పుడు విరిసే వికసించే జగతి. వేసవి జగతి. నిన్న మొన్నటి వేసవితో పోల్చినప్పుడు ఈ వేసవి బాగలేదు. క్రిమిపూరితంగా ఉంది. కష్ట కఠినాలతో ఉంది. పర్లేదు. మరో వేసవి వస్తుంది. కాసింత అల్లపు ఘాటు తగిలిన చెరకు రసాన్ని తెస్తుంది. తలుపు తెరిచి పొరుగువారిని పిలిచి చూపే కోయిల పాటను తెస్తుంది. దగ్గర దగ్గర కూడి భజనగుడి దగ్గర కలిసి పాడే బృందగానాన్ని తెస్తుంది. బెరుకు లేకుండా అరుగు మీదకు చేరే మునిమాపులను తెస్తుంది. మనిషికి మనిషి సమీపిస్తున్నప్పుడు సంతోషపడే సమయాన్ని తెస్తుంది. ఎండలో ఒకరినొకరు తేరిపార చూసుకునే ఉత్సవాన్ని తెస్తుంది. ఈ వేసవి బాగలేదు. నిజమే. కాని అనంతమైన శుభ వేసవుల ఆగమనానికి ఓపిక పట్టాల్సి ఉంది.-ఖదీర్ -
ఖదీర్‌బాబుకు విశిష్ట కథా పురస్కారం
మూడో రోజూ కొనసాగిన తెలుగు రాష్ట్రాల కథానాటిక పోటీలు చిలకలూరిపేట టౌన్: అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్, చిలకలూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్‌ల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల కథానాటిక పోటీలు మూడో రోజు శనివారం కొనసాగాయి. ఇందులో ప్రముఖ కథా రచయిత,‘సాక్షి’ దినపత్రికలో సీనియర్ న్యూస్ ఎడిటర్ మహమ్మద్ ఖదీర్‌బాబుకు ‘సరిలేరు నీకెవ్వరూ’ విశిష్ట కథా పురస్కారం అందజేశారు. సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ... ఖదీర్‌బాబు కథలు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాయన్నారు. నిత్య పరిశీలన నుంచి జనించిన ఆయన కథలను ప్రతి ఒక్కరూ చదవదగినవన్నారు. ఖదీర్‌బాబు మాట్లాడుతూ... ‘కథకుడు కథను రచించేందుకు భౌతిక, మానసిక శ్రమ చేయాలి. సంఘటన, పర్యవసానం గుండెలమీద మోయాలి’ అన్నారు. సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, సాహితీవేత్తలు ఎర్రాప్రగడ రామకృష్ణ, కొలకనూరి ఇనాక్, సంస్కృతి సంస్థ అధ్యక్షుడు ఎస్.బాలచందర్, రంగారావు, మన్నం మనోరమ పాల్గొన్నారు. అంతకముందు అమెరికాలోని వర్జీనియాకు చెందిన డాక్టర్ తాడికొండ కె.శివకుమారశర్మ రచించిన ‘విదేశ గమనే’ పుస్తకాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రముఖ కథా విశ్లేషకుడు వాసిరెడ్డి నవీన్ ఈ పుస్తకం సమీక్ష నిర్వహించారు. ఆదివారంతో ఈ పోటీలు ముగుస్తాయి. -
ప్రతీ పుస్తకం పాఠకుడికి చేరాలి..
కవాడిగూడ,న్యూస్‌లైన్: రచయితలు తాము రచించే పుస్తకాలు పాఠకులకు చేరేలా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని ‘సాక్షి’ ఫీచర్స్ జర్నలిస్టు ఖదీర్‌బాబు సూచించారు. నేషనల్ బుక్‌ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ఫెయిర్లో బుధవారం సాయంత్రం ‘పుస్తక పఠనం-మీడియా పాత్ర’ అన్న అంశంపై సెమినార్ జరిగింది. దీనికి ఖదీర్‌బాబు (సాక్షి), కె.రామచంద్రమూర్తి(హెచ్ఎంటీవీ),రామారావు(ఈనాడు), వక్కలంక రమణ(ఆంధ్రజ్యోతి),వల్లీశ్వర్(ఆంధ్రప్రదేశ్ ఎడిటర్),ప్రసాదమూర్తి (టెన్‌టీవీ), ఉదయశంకర్ (ఈటీవీ2) తదితరులు పాల్గొని మాట్లాడారు. తొలుత ఖదీర్‌బాబు మాట్లాడుతూ మీడియా అధిపతులు లాభనష్టాలను ఆలోచించకుండా పుస్తక సమీక్షలకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. వందేళ్లకాలంలో వచ్చిన కథలను ‘సాక్షి’ పరిచయం చేసినట్లు గుర్తుచేశారు. కొత్త పత్రికలు వచ్చినప్పుడల్లా కొత్త పాఠకులు తయారవుతారని చెప్పారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రజలకు ఆసక్తి కలిగించేలా సాహిత్యం రావాల్సి ఉందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నేషనల్ బుక్‌ట్రస్టు తెలుగు సంపాదకులు డాక్టర్ పత్తిపాటి మోహన్, ఎమెస్కో బుక్ పబ్లిషర్ విజయ్‌కుమార్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ: ప్రముఖ క్రీడాపాత్రికేయులు సి.హెచ్ .కృష్ణారావు రచించిన ‘క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్’ పుస్తకాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ హాకీ కెప్టెన్ ముఖేష్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎంటీవీ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి, భారత క్రికెట్జట్టు మాజీ మేనేజర్ చాముండేశ్వర్, క్రీడావిశ్లేషకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.